దిశ దశ, హైదరాబాద్:
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేస్తున్న పోలీసు అధికారులు మందుబాబులను పట్టుకుని కోర్టులో హాజరు పరుస్తుంటారు. విచారణకు హాజరైన మందుబాబులకు కోర్టు శిక్షలు వేస్తుంటుంది. మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడ్డ వారికి కోర్టు జరిమానా విధించడం, సామాజిక సేవ చేయించడం కామన్ గా సాగుతుంటుంది. ఆ తరువాత పోలీసు అధికారులు కూడా మద్యం తాగి పట్టుబడ్డ వారి కుటుంబ సభ్యుల ముందే కౌన్సిలింగ్ ఇవ్వడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ పోలీస్ అధికారిని మాత్రం చిరుప్రాయంలో ఉన్న కొడుకు నోటితో చెప్పించి తండ్రిచే ప్రమాణం చేయించారు. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉప్పల్ ట్రాఫిక్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ లక్ష్మీ మాధవి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఓ వ్యక్తికి వెరైటీగా ప్రామిస్ చేయించారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘‘నాన్న మరోసారి తాగి వాహనం నడపనని, నాన్న నువ్వు నాకు కావలి’’ అంటూ కొడుకు నోటితో చెప్పించి తండ్రిలో మార్పు వచ్చేందుకు ప్రయత్నించారు. చిరు ప్రాయంలో ఉన్న కొడుకు ఒక్కో మాట చెప్పిస్తూ తండ్రిచే ప్రమాణం చేయించడంతో చలించి పోయిన ఆయన కొడుకును అక్కున చేర్చుకున్నాడు. ఆ తర్వాత ‘‘హ్యాపీ హ్యాపీ’’ అంటూ SHO లక్ష్మీ మాధవి బాలుడికి చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పోలీసు అధికారి లక్ష్మీ మాధవి చొరవ తీసుకున్న తీరుపై నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.