తెలంగాణాలో అప్పటి నుండే… ఆయుధాలతో లొంగుబాట…

నాడు జనశక్తి, ప్రతిఘటన, ప్రజా ప్రతిఘటన…

నేడు మావోయిస్టు పార్టీ…

దిశ దశ, దండకారణ్యం:

తెలంగాణాలో వేళ్లూనుకున్న విప్లవ సంస్థల ఉనికి కోల్పోయేందుకు అప్పటి పోలీసు అధికారులు చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్నీ కావు. దీంతో ఆ సమయంలో అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 1990వ దశాబ్దంలో పీపుల్స్ వార్ తో పాటు జనశక్తి, ప్రతిఘటన, ప్రజా ప్రతిఘటన వంటి పలు విప్లవ పార్టీలు సాయుధ పోరాటం చేశాయి. వీరిని ఏరివేసేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా ముందుకు సాగారు. ఓ వైపున నక్సల్స్ కోసం గాలింపు చర్యలు చేపడుతూనే, మరో వైపున లొంగుబాట్లను ప్రోత్సహించారు. లొంగిపోయిన నక్సల్స్ పై క్రిమినల్ ఉండవని జనజీవనంలో కలవాలంటూ పోలీసు అధికారులు పిలుపునిచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

23 ఏళ్ల క్రితమే… 

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణాలో అత్యంత బలంగా సాగిన విప్లవోద్యమాలకు చెక్ పెట్టేందుకు అప్పటి పోలీసులు చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. పీపుల్స్ వార్ సైద్దాంతిక నిర్మాణం కారణంగా అప్పట్లో ఆయుధాలతో సహా వచ్చి లొంగిపోయేందుకు పీపుల్స్ వార్ గ్రూప్ నక్సల్స్ అంతగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ విప్లవ సంస్థల ఉనికి లేకుండా చేయాలన్న ప్రయత్నాల్లో భాగంగా 2002లో అప్పటి కరీంనగర్ ఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో పోలీసులు స్పెషల్ ఆపరేషన్లకు శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాల్లో అత్యంత బలంగా ఉన్న జనశక్తి పార్టీ నక్సల్స్ ను అనుకూలంగా మల్చుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీంతో జనశక్తి పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్న రణధీర్ ఆధ్వర్యంలో 45 మంది సాయుధ నక్సల్స్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు లొంగిపోవడం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. ఐదు రాష్ట్రాలలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న జనశక్తి పార్టీకి అత్యంత ఆయువు పట్టుగా నిలిచిన ప్రాంతం సిరిసిల్ల, కామారెడ్డి ఏరియానే. ఆ ప్రాంతంలోనే పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న రణధీర్ సహా 45 మంది ఆయుధాలతో లొంగిపోయేలా ఒఫ్పించడంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం సఫలం అయింది. 2004 ప్రాంతంలో ప్రతిఘటన విప్లవ పార్టీకి చెందిన బక్కన్న అలియాస్ సోమన్న ఆధ్వర్యంలోని సాయుధులు 35 మంది లొంగిపోయారు. కరీంనగర్ తూర్పు డివిజన్ ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ అటవీ ప్రాంతంలో ప్రతిఘటన కార్యకలాపాలు కొనసాగిస్తున్న బక్కన్న బృందాన్ని మెప్పించి ఒప్పించడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు. ఆ తరువాత ప్రజా ప్రతిఘటనకు చెందిన 10 సాయుధ నక్సల్స్ కూడా ఆయుధాలతో లొంగిపోయారు. ఈ లొంగుబాట్ల పర్వం తరువాత ఈ రెండు విప్లవ పార్టీలు బలహీనపడిపోయాయనే చెప్పాలి. జనశక్తి కీలక నేత అమర్ మహారాష్ట్రలోని పూణేలో అరెస్ట్ కాగా, ఆయన అన్న పార్టీ చీఫ్ కూర రాజన్నను ఉత్తరప్రదేష్ లోని బారాబంకిలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో జనశక్తి పార్టీ ఉనికి దాదాపుగా అంతరించిపోయినట్టయింది. ఆయుధాలతో సరెండర్ ను ప్రోత్సహించనట్టయితే ఈ రెండు పార్టీలు నేటికీ ఉనికిలో ఉండేవి. కానీ పోలీసులు ఆ సమయంలో తీసుకున్న సాహసోపేతమైన చర్చల ఫలితంగా రెండు విప్లవ పార్టీలపై పైచేయి సాధించగలిగారు.

తాజాగా…

23 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంత పోలీసు అధికారులు చేపట్టిన చర్యలనే మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో పోలీసులు అవలంభిస్తున్నారు. దండకారణ్య అటవీ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వం నిర్వహిస్తున్న మావోయిస్టు పార్టీని సమూలంగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికల్లా మావోయిస్టు పార్టీ రహిత భారత్ గా ప్రకటించాలన్న సంకల్పంతో ఉన్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలుమార్లు ప్రకటించారు. ఇందులో భాగంగా గత సంవత్సరం నుండి ఆపరేషన్ కగార్ పేరిట భారీగా బలగాలు మావోయిస్టుల ఏరివేతలో నిమగ్నం అయ్యాయి. ఇటీవల కాలంలో ఎన్ కౌంటర్లు కూడా తీవ్రంగా పెరిగిపోయాయి. మూడు నాలుగేళ్ల క్రితం వరకూ బలగాలే లక్ష్యంగా దాడులు చేసిన మావోయిస్టులు ఆ తరువాత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మావోయిస్టుల ఏరివేతపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. దీంతో ముఖ్య నేతలు కూడా ఎన్ కౌంటర్లలో చనిపోతున్నారు. ఈ క్రమంలోనే పార్టీతో దశాబ్దాలుగా అనుబంధం పెనవేసుకున్న అత్యంత కీలకమైన నాయకులు కూడా లొంగుబాట పడుతుండడం గమనార్హం. సాయుధ పోరాట విరమణ వైపు అడుగులు వేయాలని భావించిన కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో మెంబర్ మల్లోజ్జుల వేణుగోపాల్ రావు అలియాస్ సోనూ దాదా నేతృత్వంలో బుధవారం 61 మంది మావోయిస్టు పార్టీ నక్సల్స్ ఆయుధాలతో సహా లొంగిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో వీరంతా జనజీవనంలో కలిశారు. మరోవైపున చత్తీస్ గడ్ లోని అభూజామఢ్ (మాఢ్ డివిజన్)కు చెందిన 50 మంది మావోయిస్టులు 40 ఆయుధాలతో సహా లొంగిపోయారు. కాంకేర్ జిల్లా అంతాఘడ్ పోలీసుల ముందు లొంగిపోయిన వీరంతా మాఢ్ డివిజన్ ముఖ్య నాయకులు రాజ్మాన్, రాజు సలాంల ఆధ్వర్యంలో పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. వీరు జనజీవనంలో కలుసినట్టుగా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇంకా మావోయిస్టు పార్టీ చెందిన మరికొంత మంది కూడా ఆయధాలతో సహా లొంగిపోయేందుకు సిద్దంగా ఉన్నారని చత్తీస్ గడ్ పోలీసు వర్గాలు చెప్తున్నాయి.