నాడు ప్రత్యక్ష్యంగా… నేడు పరోక్షంగా… ఎన్నికల ఇంచార్జీలుగా ఆ ముగ్గురు…

దిశ దశ, కరీంనగర్:

లోకసభ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలిచిన మూడు పార్టీల అభ్యర్థులు కార్పొరేషన్ ఎన్నికల ఇంఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు పార్టీల నాయకులు కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. గత లోకసభ ఎన్నికల్లో కరీంనగర్ అభ్యర్థులుగా పోటీ చేసిన బండి సంజయ్, బోయినపల్లి వినోద్ కుమార్, వెలిచాల రాజేందర్ రావులు మునిసిపల్ ఎన్నికల్లో కరీంనగర్ ఇంఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో తమ పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేందుకు పరోక్షంగా ముగ్గురు నేతల మధ్య పోటీ అనివార్యంగా మారింది. లోకసభ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలిచిన వారే కార్పొరేషన్ ఎన్నికల నిర్వహాణ బాధ్యతలు తీసుకోవడంతో ఓటర్లను ఆకట్టుకోవడంలో ఈ ముగ్గురిలో ఎవరు సఫలం అవుతారోనన్న చర్చ సాగుతోంది. లోకసభ ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని అభ్యర్థించిన ముగ్గురు నేతలు ఇప్పుడు తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయించేందుకు నడుం బిగించాల్సి వచ్చింది.

‘బండి’ దూకుడు…

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్పొరేషన్ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. 66 డివిజన్లు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్ లో మెజార్టీ స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. ఓ వైపున పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశం అవుతూ… మరో వైపున గెలుపు గుర్రాల గురించి ఆరా తీసే పనిలో నిమగ్నం అయ్యారు. సర్వేలు చేయిస్తూ గెలిచే అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్న బండి సంజయ్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. టికెట్ రాలేదని నిరాశ చెందకూడదని వారికి కూడా న్యాయం చేస్తామని బండి సంజయ్ ప్రకటించడం గమనార్హం. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్నప్పటి నుండే బీజేపీ శ్రేణులను సమాయత్తం చేశారు. అయితే తుది జాబితాను ప్రకటించే విషయంలో ఆచూతూచి వ్యవహరిస్తున్న బండి సంజయ్ ఈ సారి కరీంనగర్ కార్పొరేషన్ లో కాషాయం జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బండి సంజయ్ బల్దియా ఫలితాల్లో తన మార్క్ చూపించాలని భావిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది.

‘‘వెలిచాల’’ వ్యూహాలు…

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న వెలిచాల రాజేందర్ రావు కూడా గెలిచే అభ్యర్థులకే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అదిష్టానం చేయిస్తున్న సర్వేలు కాకుండా ఆయన కూడా వ్యక్తిగతంగా సర్వే చేయించినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరుపున నామినేషన్లు వేసిన వారి తరుపున కొన్ని డివిజన్ల ప్రచారంలో కూడా పాల్గొన్న ఆయన రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడం కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. అభ్యర్థులకు బీఫారంలు ఇచ్చే విషయంలో కూడా సునిశితంగా పరిశీలన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ అసెంబ్లీ ఇంఛార్జిగా రాజేందర్ రావును ఇటీవల నియమించడంతో తన సత్తా చాటాలని భావిస్తున్నారు. పార్టీ కార్యకలాపాలతో పాటు అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేసే విధంగా ప్లాన్ వేసుకున్నట్టుగా తెలుస్తోంది.

రంగంలో బోయినపల్లి…

బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఇంఛార్జిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కు బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. దీంతో ఆయన కరీంనగర్ లో మకాం వేసి సమీకరణాలు నెరుపుతున్నారు. కరీంనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో సమన్వయం చేసుకుంటూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అవసరమైన కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నట్టుగా సమాచారం. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యే గంగుల నిర్ణయానికే అధిక ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణుల ప్రచారం, అభ్యర్థుల గెలుపునకు అవసరమైన వ్యూహాలను రచించే పనిలో నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది.