దిశ దశ, కరీంనగర్:
తొలి విడత పంచాయితీ ఎన్నికల్లో బారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలను అందుకోలేకపోయినా గ్రామాల్లో బలాన్ని పెంచుకునే దిశగా పావులు కదిపినట్టుగా స్పష్టం అవుతోంది. గురువారం జరిగిన తొలి విడుతలో 4,227 పంచాయితీలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాలు కైవసం చేసుకోగా, రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 2872 పంచాయితీలను, బీఆర్ఆస్ పార్టీ 1160 చోట్ల విజయం సాధించాయి. అయితే బీజేపీ మాత్రం 195 పంచాయితీలను కైవసం కేసుకుంది. ఇంతకాలం డబుల్ డిజిట్ దాటలేకపోయిన కమలం ఈ సారి తొలి విడుతలోనే 169 పంచాయితీల్లో గెలుపొందడం గమనార్హం.
ఎక్కువగా ఇక్కడే…
కరీంనగర్ లోక సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇలాకాలో ఈ సారి అనూహ్య ఫలితాలను అందుకున్నట్టయింది. 50 గ్రామ పంచాయితీల్లో బీజేపీ మద్దతు దారులు గెలవడం గమనార్హం. రాష్ట్రంలో 195 పంచాయితీలను కమలం పార్టీ కైవసం చేసుకోగా అందులో 50 జీపీలు కరీంనగర్ లోకసభ పరిధిలోనే ఉండడం విశేషం. బీజేపీ బలపర్చిన వారిని గెలిపించినట్టయితే నిధుల వరద పారిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. బీజేపీ మద్దతు దారులు ఏకగ్రీవం అయినట్టయితే ఆ పంచాయితీలకు ప్రత్యేకంగా నిధులు కెటాయిస్తానని కూడా ప్రకటించారు. దీంతో గత ఎన్నికలతో పోల్చుకున్నట్టయితే ఈ సారి చాలా గ్రామాల్లో బీజేపీ సానుకూలతను అందిపుచ్చుకుందని చెప్పక తప్పదు. మరి కొన్ని పంచాయితీల్లో బీజేపీ అభ్యర్థులు టఫ్ ఫైట్ కూడా ఇవ్వడంతో గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఈటల ఇలాకా…
2023 అసెంబ్లీ ఎన్నికల వరకూ హుజురాబాద్ నియోజకవర్గానికి ఎంపీ ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసేందుకు ఈటల రాజేందర్ కమలాపూర్ లో మకాం వేసి తన అనుచరగణాన్ని గెలిపించుకునేందుకు శ్రమించారు. ఈ నేఫథ్యంలో ఆయన సొంత మండలమైన కమలాపూర్ లోని కొన్ని పంచాయితీల్లో బండి సంజయ్ మద్దతు ఇచ్చిన వారు గెలవడం గమనార్హం.
టార్గెట్..?
పంచాయితీ ఎన్నికలు ముగిసిన తరువాత రానున్న మునిసిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై దృష్టి సారించే యోచనలో బండి సంజయ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించి కార్యక్షేత్రంలోకి దిగాలని భావిస్తున్నారు. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని ఢీల్లి పెద్దలతో భేష్ అనిపించుకోవడంతో పాటు స్థానికంగా తనకున్న పట్టును నిరూపించుకోవాలని కేంద్ర మంత్రి అనుకుంటున్నారు. తన లోకసభ పరిధిలోని కరీంనగర్ కార్పోరేషన్, హుజురాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి మునిసిపాలిటీలతో పాటు ఆయా మండలాల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోర్ టీమ్ సభ్యులకు బండి సంజయ్ చెప్పినట్టుగా సమాచారం.

