కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు…
రాజన్న ఆలయం మూసివేతపై ఆగ్రహం
దిశ దశ, వేములవాడ:
దక్షిణ కాశీగా భాసిల్లతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రధాన ఆలయాన్ని మూసివేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి పార్టీ శ్రేణులతో జూమ్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాజన్న మొక్కులు భీమన్నకు ఎలా చెల్లిస్తారని, ప్రజల మనో భావాలకు భంగం కల్గిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఆలయాన్ని మూసివేస్తే పంచెలు కట్టుకుని తలుపులు తెరుస్తామని, ఫైరింగ్ చేస్తారో లాఠీ ఛార్జి చేస్తారో చూద్దామని స్పష్టం చేశారు. రాజన్న ఆలయ అభివృద్ది విషయంలో ప్రభుత్వ ప్రణాళిక ఏంటో అర్థం కావడం లేదన్నారు. దేశంలో ఇప్పటి వరకు పలు దేవాలయాలను అభివృద్ది చేశారని ఎక్కడా కూడా ప్రధాన ఆలయాన్ని మూసివేయలేదన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. యాదాద్రి ఆలయ పునర్నిమాణం సమయంలో బాలా ఆలయంలో స్వామి వారిని ప్రతిష్టించి భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించి అభివృద్ది పనులు చేపట్టారన్నారు. కానీ వేములవాడ రాజన్న ఆలయం విషయంలో మాత్రం ప్రధాన ఆలయాన్ని మూసివేసి భీమన్న ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పించాలని నిర్ణయించడం విడ్డూరంగా ఉందన్నారు. నాయకులు శాశ్వతం కాదని పార్టీలు శాశ్వతం కాదని భక్తుల సెంటిమెంట్ మాత్రమే శాశ్వతమన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు. భక్తులు తమ కోర్కెలు తీర్చిన రాజన్నకు మొక్కులు చెల్లించే సాంప్రాదాయం ఉందని, ఇక నుండి భీమన్న ఆలయంలో మొక్కులు తీర్చుకోవాలనడం సమంజసం కాదన్నారు. రాజన్నపై అత్యంత విశ్వాసంతో ఉన్న భక్తులు ఆయన చెంతనే కోడె మొక్కులు తీర్చుకుంటారు కానీ భీమన్నకు సమర్పించడానికి ఒప్పుకోరన్నారు. రాజన్న భక్తుల మనో భావాలను గౌరవించేందుకు బీజేపీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. భీమన్న ఆలయంలో మొక్కులు తీర్చుకోవడం ఏంటని, తమతమ గ్రామాల్లో ఉన్న శివాలయల్లో కూడా దర్శించుకుంటారు కానీ రాజన్నకు మాత్రమే మొక్కులు తీర్చుకునేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారన్న విషయం అధికారులు గుర్తుంచుకోవల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అన్నారు. ఆలయాన్ని ఎన్ని రోజులు మూసివేస్తారోనన్న విషయంపై కూడా స్పష్టత లేకుండా పోయిందని, మేడారం సమ్మక్క, సారాలక్క జాతర, మహా శివారత్రి పర్వదినాలు కూడా రానున్న నేఫథ్యంలో ప్రధాన ఆలయాన్ని మూసి వేయడం సరైన నిర్ణయం కాదన్నారు. మేడారం జాతరకు వెల్లే భక్తులు ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకుని వెల్తారని, కోట్లాది మంది భక్తులు హాజరయ్యే సమ్మక్క సారలక్క జాతరకు ముందు గుడిని మూసి వేయాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు. రాజన్న గుడిని మూసివేస్తారని తెలిసి భక్తులు కన్నీటి పర్యంతం అవుతున్నారని, తమకు కొంగుబంగారమైన రాజన్నను దర్శించుకోకుండా ఎలా ఉండగలుగుతామని భక్తులు ప్రశ్నిస్తున్నారన్నారు. పేరు ప్రతిష్టల కోసం ఇలా వ్యవహరిస్తున్నారని, ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పించేందుకు అవసరమైన విధంగా చర్యలు చేపట్టాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆలయ అభివృద్ది కోసం సహకరించేందుకు తాము సిద్దంగానే ఉన్నామని అయితే భక్తుల సెంటిమెంట్ దెబ్బతీసే విధంగా వ్యవహరించవద్దని బండి సంజయ్ హితవు పలికారు. మహారాష్ట్ర, చత్తీస్ గడ్, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో రాజన్నను దర్శించుకుంటారని ఆయా ప్రాంతాల నుండి వచ్చే భక్తులను ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదన్నారు. వేములవాడ రాజన్న భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా చొరవ తీసుకునేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ వివరాలను జిల్లా అధ్యక్షుడు రొడ్డవేణి గోపి, సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణలు పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారని వివరించారు.

