కరీంనగరాన కమల వికాసం… ఒంటి చేత్తో గెలిపించిన ‘‘బండి’’

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల్లో కమలం వికసించింది. ఎమ్మెల్యే ఎన్నికల్లో దోబూచులాడిన విజయం కార్పొరేషన్ ఎన్నికల్లో అందిపుచ్చుకుంది. ప్రత్యర్థి పార్టీలు దరిదాపుల్లో లేని విజయాన్ని అందుకున్న భారతీయ జనతా పార్టీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒంటి చేత్తో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. అంచనాలకు మించిన ఫలితాలను సాధించి కార్పొరేషన్ కైవసం చేసుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

కమల వికాసం…

మైనార్టీల ప్రభావం తీవ్రంగా ఉన్న కరీంనగర్ బల్దియాను బీజేపీ కైవసం చేసుకోవడం అసాధ్యమన్న మాటలను తోసేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న తీరు సంచలనంగా మారింది. ఈ సారి వ్యూహాత్మకంగా వ్యవహరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తనదైన స్టైల్లో ప్రచార పర్వాన్ని కొనసాగించారు. ఓ వైపున రోడ్ షోలు నిర్వహిస్తూ మరో వైపున గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుంటూ బీజేపీ అభ్యర్థుల గెలుపునకు మార్గం సుగమం చేశారు. గత పాలకవర్గంలో కేవలం 13 స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈ సారి ఏకంగా 30 స్థానాల్లో విజయ దుందుభి మోగించడం సంచలనంగా మారింది. మొత్తం 66 డివిజన్లలో 30 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో, బీఆర్ఎస్ 9 చోట్ల, ఎంఐఎం మూడు చోట్ల, స్వతంత్రులు, ఏఐఎఫ్బీ పార్టీకి చెందిన అభ్యర్థులు 10 స్థానాల్లో గెలిచారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని మట్టి కరిపించే విధంగా క్యాంపెయిన్ నిర్వహించిన కేంద్ర మంత్రి తన బ్రాండ్ ఇమేజ్ చాటుకున్నారు.

మొదటి నుండి…

అయితే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి తీరాలన్న సంకల్పంతో ముందుకు సాగిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్నికల వాతావరణానికి ముందు నుండే కసరత్తులు చేశారు. పార్టీ శ్రేణులతో సమావేశాలు ఏర్పాటు చేసి సమీక్షలు నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో ఉన్న నాయకుల నుండి మొదలు జిల్లా స్థాయి నాయకులను సమన్వయ పరుస్తు ముందుకు సాగిన ఆయన నోటిఫికేషన్ విడుదలైన తరువాత ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలిస్తూ ఆచూతూచి అడుగులు వేశారు. ఏ మాత్రం అవకాశం చిక్కిన ఇతర పార్టీల నాయకులు పట్టుబిగించే అవకాశం ఉందన్న విషయంపై దృష్టిలో పెట్టుకుని తనదైన శైలిలో వ్యవహరించారు. అభ్యర్థుల ఎంపిక కోసం ప్రత్యేకంగా సర్వేలు జరిపించిన సంజయ్ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది గ్రౌండ్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు తెలుసుకుని అందుకు అనుగుణంగా పావులు కదిపారు.

స్టార్ క్యాంపెనర్లు…

కార్పొరేషన్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెనర్లు లేకుండానే ప్రచారాన్ని కొనసాగించారు బండి సంజయ్. అన్ని తానై పార్టీని ముందుకు నడిపించి ఒంటి చేత్తో పార్టీని గెలిపించుకోవడంలో సఫలం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రచారంలో పాల్గొన్నా బీజేపీ తరుపున మాత్రం ఒకే ఒక్కడు ‘‘బండి’’ రాజకీయ వ్యూహాల్లో తానేంటో చేతల్లోనే చూపించారు. అభ్యర్థుల ఎంపిక విషయంతో పాటు మరికొన్ని అంశాలపై సంజయ్ లక్ష్యంగా పార్టీకి చెందిన కొంతమంది విమర్శలు చేసినా పట్టించుకోకుండా సానుకూల ఫలితాలను సాధించుకోవడంలో తానేంటో నిరూపించారు.

రెబెల్స్ కు చెక్…

గతంలో ఏనాడూ లేని విధంగా కరీంనగర్ కార్పొరేషన్ నుండి పోటీ చేసేందుకు అభ్యర్థులు భారీ సంఖ్యలో ముందుకు వచ్చారు. బీజేపీ తరుపు 674 మంది నామినేషన్లు వేయగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసే విషయంలో కఠినంగానే వ్యవహరించారు బండి సంజయ్. ఖచ్చితంగా గెలుస్తారనుకున్న వారికే అవకాశం ఇచ్చి మిగతా వారిని పోటీ నుండి తప్పించడంలో దాదాపు సక్సెస్ అయ్యారు. కొన్ని డివిజన్లు మినహాయిస్తే మిగతా చోట్ల పార్టీ రెబెల్స్ బరిలో లేకుండా పకడ్భందీగా వ్యవహరించారు. అయితే పోటీ చేయాలని ఉత్సాహంగా ముందుకు వచ్చిన వారంతా పార్టీకి నష్టం చేకూరుస్తారన్న ఆందోళనకు కూడా తావివ్వకుండా జాగ్రత్త పడ్డారు. మరో వైపున ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారన్న విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగిన సంజయ్ ఆయా చోట్ల వారిని కూడా గెలిపించుకుని విమర్శకుల నోళ్లకు తాళం వేశారు. కొన్ని డివిజన్లలో స్వల్ప మెజార్టీతో బీజేపీ అభ్యర్థులు ఓడి పోవడం వల్ల మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయినప్పటికీ కరీంనగర్ చరిత్రలో మాత్రం ఇది బీజేపీకి మరుపురాని విజయమన్నది వాస్తవం.

నాలుగయితే…

మరో నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నట్టయితే అప్రతిహతమైన విజయాన్ని సాధించిన రికార్డు అందుకున్నట్టయ్యేది. 34 మంది కార్పొరేటర్లు గెలిచినట్టయితే బీజేపీ ఒంటరిగానే కాషాయం జెండా ఎగురవేసినట్టయ్యేది. కానీ కొన్ని డివిజన్లలో అభ్యర్థులు గెలుపు కోసం శ్రమించకపోవడం వల్ల పూర్తి మెజార్టీని సాధించుకోలేకపోయినట్టయింది. అయితే ఇప్పటికే స్వతంత్రులు బీజేపీకి మద్దతుగా నిలిచేందుకు ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది.