తండ్రి చాటు తనయుడే… చెన్నూరు క్యాడర్ మాత్రమే…

దిశ దశ, పెద్దపల్లి:

పెద్దపల్లి లోకసభకు గడ్డం కుటుంబానికి ఉన్న అనుబంధం ఎనలేనిది. ఈ ఫ్యామిలీకి చెందిన మూడు తరాలను కూడా ఈ నియోజకవర్గం అక్కున చేర్చుకుంది. రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేకతను అందిపుచ్చుకున్న కాక వెంకటస్వామి వారసులు ఎదుర్కొంటున్న ఒడిదొడుకులు అత్యంత విచిత్రంగా ఉంటున్నాయి. తాజాగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటస్వామి మనవడు గడ్డం వంశీ కృష్ణ తండ్రి ఎదుర్కొంటున్నట్టుగానే ప్రతికూల పరిస్థితులను చవి చూస్తున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వగానే లోకసభలోకి అడుగుపెట్టిన వంశీ కృష్ణ ప్రత్యక్ష్య రాజకీయాల్లో సొంత పార్టీ నాయకుల ఆదరణకు నోచుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వంశీ కృష్ణ వివక్షకు గురవుతున్న విషయం పలుమార్లు వెలుగులోకి రాగా తాజాగా కాళేశ్వరంలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు నిరసన వ్యక్తం చేశారు.

ఎవరు వారు..?

గురువారం సాయంత్రం కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో చెన్నూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత ఎంపీ కనిపించడం లేదా అన్న నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఇంతవరకూ బాగానే ఉన్న మూడు తరాలు పెద్దపల్లిలోని ఏఢు సెగ్మంట్ల ఓటర్లను ఆకట్టుకున్నప్పటికీ వంశీకి మద్దతు ఇచ్చే విషయంలో మాత్రం తన తండ్రి వివేక్ ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గానికి చెందిన వారు మాత్రమే ముందుకు రావడం విశేషం. కాంగ్రెస్ పార్టీలో కాకలు తీరిన కాక వారసుడిగా చెరగని ముద్ర వేయాలన్న తపనతో ఉన్న వంశీ కృష్ణకు ఆ కుటుంబ అభిమానుల నుండి బహిరంగంగా వెన్నుదన్నుగా నిలిచే వారు లేకపోవడమేంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది. ఏడు సెగ్మెంట్లలో కేవలం చెన్నూరు నుండి మాత్రమే బోటాబోటిగా నాయకులు వంశీపై వివక్ష చూపుతున్నారని చేపట్టిన నిరసనకు హాజరయ్యారు తప్ప ఆ కుటుంబానికి ఉన్న ఇమేజీకి తగ్గ రీతిలో స్పందన రాలేదన్నది మాత్రం వాస్తవం.

ఎందుకిలా..?

కాకా రాజకీయాలు నెరిపినప్పుడు జాతీయ స్థాయి నాయకులే ఆయన ఆశీస్సులతో ఎదిగిన వారు ఉన్నారు. ఆయనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ఉండేది… ఆయనకున్న చరిష్మా కూడా ఆపాటిది కావడంతో తనతో పాటు సమకాలీకులు అయినా, సీనియర్లు అయినా, జూనియర్లు అయినా కూడా ఆయనంటే ప్రత్యేక అభిమానం చూపించేవారు. కానీ ఆయన వారసులుగా రాజకీయరంగ్రేట్రం చేసిన వివేక్, ఆయన తనయుడు వంశీ మాత్రం ప్రతికూలతను మూటగట్టుకుంటున్నారు. ప్రధానంగా తొలిసారి ఎంపీ అయినప్పుడు వివేక్ ఏడు సెగ్మెంట్లలో కూడా తన అనచరులను పెంచి పోషించుకున్నారు. దీంతో ఆయా సెగ్మెంట్లలో పట్టు బిగించి ఉన్న ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. కొన్ని సెగ్మెంట్లలో వివేక్ వెంట నడిచిన నాయకులు మాత్రం దిక్కు మొక్కు లేకుండా తెరమరుగు అయ్యారు. తెలంగాణాలో నెలకొన్న పరిణామాలతో వివేక్ పార్టీలు మారడం… కాంగ్రెస్ పార్టీలో ఆయనతో కలిసి నడిచిన వారి భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. పెద్దపల్లి లోకసభ పరిధిలోని చాలా మంది అనుచరుల బాగోగులు చూసుకోవడంలో ఆయన ప్రత్యేక దృష్టి సారించలేకపోయారన్న వాదనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వంశీ అరంగ్రేట్రాన్ని స్వాగతించే వారు ఆయా సెగ్మెంట్లలో ఉన్నప్పటికీ ఆ కుటుంబం నుండి ఎదురైన అనభవాల దృష్ట్యా వారితో కలిసి నడిచేందుకు వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కురువృద్దుడైన వెంకటస్వామి వద్దకు వెల్లి నేరుగా మాట్లాడేందుకు చాలా మంది కూడా మీనామేషాలు లెక్కించేవారు. అటువంటి సమయంలో వివేక్ రాజకీయాల్లోకి రావడంతో తమ జీవితాలు మారుతాయని రాజకీయంగా తమకు లాభిస్తుందని ఆశించిన వారి అంచనాలు తలకిందులు అయ్యాయి. ఆ నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న వారు వంశీ కృష్ణ విషయంలో బాహాటంగా మద్దతు ఇవ్వలేకపోతున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పారిశ్రామిక రంగంలో కూడా గడ్డం కుటుంబం వేళ్లూనుకుని ఉన్నప్పటికీ నమ్ముకున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించేందుకు కూడా చొరవ తీసుకున్న దాఖలాలు అంతంత మాత్రమే కావడం వల్లే సిట్టింగ్ ఎంపీకి సానుకూల వాతావరణం కనిపించడం లేదు. ఆయా నియోజకవర్గాల్లో అత్యంత బలమైన నాయకత్వం ఉండడం వారిని కాదని వెల్లినా తమకు గడ్డం కుటుంబం నుండి సంపూర్ణంగా అండదండలు ఉండే అవకాశాలు ఉండవన్న అనుమానం చాలామందిని వెంటాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో స్థానికంగా అందుబాటులో ఉండే నాయకత్వంతో కలివిడిగా ఉండడమే బెటర్ అనుకుంటున్న వారే ఎక్కువ.

You cannot copy content of this page