భయం గుప్పిట ఉగ్రవాద శిబిరాలు… పాకిస్తాన్ తప్పుడు ప్రచారం…

దాడులు ఎక్కడెక్కడ జరిగాయంటే…

దిశ దశ, అంతర్జాతీయం:

భారత దేశంలో విధ్వంసాలే లక్ష్యంగా… కల్లోలం సృష్టించడమే ధ్యేయంగా ఉగ్ర వాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు సరైన గుణపాఠం చెప్పినట్టయింది. అంతర్జాతీయ సమాజం ముందు తల దించుకోవల్సి వస్తోందని ప్రగల్భాలు పలికే ప్రయత్నంలో దాయాది దేశం తప్పుడు ప్రచారానికి పూనుకుంది. మరో వైపున భారత్ జరిపిన క్షిపణి దాడులను పిరికి పంద చర్యగా అభివర్ణిస్తోంది. ప్రపంచానికే సవాల్ విసురుతున్న ఉగ్ర వాదులకు షెల్టర్ జోన్ గా మార్చిన పాకిస్తాన్ తప్పు సరిదిద్దుకోకుండా సరిహధ్దుల్లో పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అయినా భారత్ సంయమనంతో ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ చేస్తున్న దాష్టికాలను వివరిస్తూ శత్రు దేశం వైఖరిని మార్చుకుంటుందని ఆశించింది. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని భారత్ చేతల్లోనే తన ప్రతాపాన్ని చూపించేసింది. భారత సరిహధ్దులకు వంద కిలోమీటర్ల దూరం వరకూ ఉగ్ర స్థావరాలు, శిక్షణా శిబిరాలను దర్జాగా నిర్వహిస్తున్న పాకిస్తాన్ ముప్పేట జరిపిన దాడితో భయంతో వణికిపోయేలా చేసింది. ‘‘ఆపరేషన్ సింధూర్’’ ద్వారా ముజఫరాబాద్, బహవల్ప్ పూర్, కోట్లీ, చక్ అమ్రు, గుల్పూర్, భింబర్, మురిడ్కే. సియాల్ కోట్ పరిసర ప్రాంతాల్లోని స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న ఉగ్ర సంస్థలను సమూలంగా పెకలించి వేసేసింది. సరిహద్దులకు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న బహవల్ పూర్ లోని జైష్ ఏ మహ్మద్, 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న మురిడ్కే, సాంబా సమీపంలో ఉన్న లష్కర్ ఏ తోయిబా, 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఫూంఛ్, రాజౌరి గుల్పూర్, పాక్ అక్రమిత జమ్మూ కశ్మీర్ లోని తంగ్దర్ సెక్టార్ లో 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న సవాయ్ లష్కర్ ఏ క్యాంప్, రాజౌరీ సమీపంలోని నియంత్రణ రేఖకు 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న బిలాల్ క్యాంప్ జేఎం లాంచ్ ప్యాడ్, రాజౌరీకి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న బర్నాల క్యాంప్, సాంబా, కతువా ఎదురుగా, సరిహద్దులకు 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న జేఎంకు చెందిన సర్జల్ క్యాంప్, 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న సియాల్ కోట్ సమీపంలోని హెచ్ ఎం శిక్షణా శిబిరం మెహమూనా క్యాంపులను భారత సైన్యం ధ్వంసం చేసేసింది. కొన్ని ఉగ్ర సంస్థల స్థావరాల నుండి షెల్టర్ తీసుకున్న టెర్రరిస్టులు ఆయుధాలు వదిలేసి బ్రతుకు జీవుడా అనుకుంటూ పరుగు అందుకున్నారు. 1.44 గంటలకు ఒక్కసారిగా సంభవించిన క్షిపణి దాడులతో అతలా కుతలం అయిపోయింది పాకిస్తాన్. భారత దాడుల్లో గాయాల పాలైన వారిని ఆసుపత్రులకు చేర్చడంతో పాకిస్తాన్ దవాఖానలన్ని కిక్కిరిసిపోతున్నాయి. అంబూలెన్స్ ల సైరన్లు, గాయపడ్డ వారి ఆర్తనాదాలతో ఆసుపత్రుల పరిసర ప్రాంతాలు మారుమోగిపోతున్నాయి.

ఎంత మంది..?

బహవల్ పూర్ లో 20 నుండి 30 మంది, మురిడ్కేలో 30 మందికి పైగా చనిపోగా మొత్తం ఉగ్ర శిబిరాలలో 90 మంది వరకూ మరణించినట్టుగా భారత రక్షణ విభాగ వర్గాలు చెప్తున్నాయి ఈ శిబిరాల్లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వారు కూడా ఉండడంతో వారు కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదులకు తమకు ఏం సంబంధం లేదని అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేసిన పాకిస్తాన్… భారత దాడులు జరిపిన టెర్రరిస్ట్ బేస్ క్యాంపుల్లో ఉన్న అక్కడి ఆర్మీ యంత్రాంగం కూడా చనిపోవడంతో ప్రపంచం ముందు దోషిలా నిలబడాల్సిన పరిస్థితి తయారైంది. పాకిస్తాన్ ఆర్మీనే ఉగ్రవాదులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు పూనుకోవడంతో పాటు భారత సరిహద్దు ప్రాంతాలపై అవగాహన కల్పించే పనిలో నిమగ్నం అయి ఉంటారని అంచనా వేస్తున్నారు.

You cannot copy content of this page