కార్పొరేటర్ ఇంటి వద్ద ఉద్రిక్తత…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ బల్దియా పాలిటిక్స్ హీటెక్కిపోతున్నాయ్. సోమవారం మేయర్, డిప్యటీ మేయర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కార్పొరేటర్ల ఇంటివద్ద ఉద్రిక్త వాతవారణం నెలకొంది. మెజార్టీ స్థానాలు గెల్చిన బీజేపీ, కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్లతో కలిసి వేర్వేరు క్యాంపులు నిర్వహిస్తున్నారు. అయితే బీజేపీకి మద్దతు ఇచ్చిన వారిలో స్వతంత్రులతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్ కూడా ఉన్నారు. వీరందరిని శుక్రవారం రాత్రే క్యాంపునకు తరలించగా మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి భర్తలను బీజేపీ శ్రేణులు క్యాంపునకు తరలించారు. కార్పొరేటర్లుగా గెలిచిన మహిళలు ఇంటివద్దనే ఉండడంతో పాటు ఊహించని రీతిలో కరీంనగర్ ను హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా మహిళా ప్రజాప్రతినిధులతో పాటు వారి భర్తలను కూడా క్యాంపుకు తరలించి బీజేపీకి స్వతంత్రులు చిక్కకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అయితే బీజేపీకి మద్దతుగా నిలిచిన 15వ డివిజన్ కార్పొరేటర్ విపల సాయి జ్యోతి తన ఇంటి వద్ద ఉన్న సమాచారం అందుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం ఉధయం నుండే మంతనాలు జరపడం మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న బీజేపీ శ్రేణులు కూడా ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే ఆదివారం మద్యాహ్నం నుండి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్న జ్యోతి వందలాది మంది తన ఇంటిని చుట్టుముట్టారని పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు అసలే ఉత్కంఠంగా మారిన ఈ సమయంలో కార్పొరేటర్ ఇంటి వద్ద భారీగా జనం వచ్చి చేరారని తెలియగానే కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, ఇన్స్ పెక్టర్ కోటేశ్వర్ లతో పాటు పోలీసు బలగాలను మోహరించారు. ఓ వైపున పోలీసులు, మరో వైపున బీజేపీ కార్యకర్తలు కార్పొరేటర్ జ్యోతి ఇంటి వద్ద ఉండడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే విపల జ్యోతి ఓ వీడియోను కూడా విడుదల చేయడం సంచలనంగా మారింది. తన పిల్లలకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సొంత వాహనంలోనే వెలుతున్నానని, సోమవారం జరిగే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తనకు నచ్చిన వారికి ఓటు వేస్తానని స్పష్టం చేశారు. అయితే తాను వెలుతున్న క్రమంలో తన వాహనాన్ని అడ్డుకున్నట్టయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, తన ఇంటి వద్ద ఉన్న వారంతా వెల్లిపోవాలని విపల జ్యోతి కోరారు. కొద్దిసేపటి తరువాత ఓ వాహనంలో జ్యోతి బయటకు వెళ్లిపోయారు.

బీజేపీ ఆందోళన…
బీజేపీలో చేరుతున్నానని ప్రకటించి కాషాయం కండువా కప్పుకుని ఇఫ్పుడు మాట మార్చడం సరికాదంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆమె మామ పిట్టల రవిందర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డబ్బులకు అమ్ముడు పోయిన పిట్టల రవిందర్ డౌన్ డౌన్, అన్ని పార్టీల్లో తిరుగుతూ ప్రజా స్వామ్యాన్ని ఖునీ చేశారంటూ రవిందర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విప్ జారీ…
మరో వైపున ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా కార్యరంగంలోకి దిగింది. తమ పార్టీ తరుపున గెలిచిన 15వ డివిజన్ కార్పొరేటర్ విపల సాయి జ్యోతి, 20 డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామలలు తమ పార్టీ బీఫామ్ ద్వారా గెలిచారని AIFB నాయకులు స్పష్టం చేశారు. వీరిద్దరి కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించినా టచ్ లోకి రావడం లేదన్నారు. దీంతో వారి ఇండ్ల వద్దకు వచ్చి విప్ నోటీసులు అందించాలని భావించినప్టపికీ వారి కుటుంబ సభ్యులు విప్ నోటీసులు తీసుకునేందుకు విముఖత చూపడంతో తాము ఇద్దరు కార్పొరేటర్ల ఇండ్లకు నోటీసులు అంటించామని AIFB రాష్ట్ర కన్వీనర్ అంబటి జో్జిరెడ్డి వెల్లడించారు. విప్ ధిక్కరణకు పాల్పడినట్టయితే కార్పొరేటర్ల సభ్యత్వం రద్దవుతుందని, ఇందుకోసం లీగల్ గా కూడా తాము పోరాటం చేస్తామని ప్రకటించారు. జాతీయ నాయత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం సోమవారం ఉదయం 11 గంటల వరకు నిర్ణయాన్ని వెల్లడిస్తాయని, అప్పటి వరకు తమ పార్టీ సింబల్ పై గెలిచిన వారు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ విప్ ను పార్టీ నేత తేజ్ దీప్ రెడ్డి జారీ చేశారని శేఖర్ వివరించారు.

