దిశ దశ, రామగుండం:
ఓ వైపున వరుణ దేవుని కరుణ లేక రైతులు అల్లాడిపోతుంటే… మరో వైపున యూరియా ఉత్పత్తి చేసే పరిశ్రమలో సాంకేతిక లోపం ఎదురైంది. ఈ సీజన్ లో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది. రామగుండం ఫెర్టిలైజర్ కార్పోరేషన్ లిమిటెడ్ లో లీకేజీ కారణంగా పదిహేను రోజుల పాటు యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది.
ఆరు రాష్ట్రాలకు…
రోజుకు 3000 నుండి 3,500 టన్నుల యూరియా ఉత్పత్తి చేసే RFCL ప్లాంటులో అమెనియా గ్యాస్ సరఫరా చేసే ఎల్బో పైపుల్లో లీకేజీ ఏర్పడడంతో యూరియా ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ప్లాంటులో లీకేజీని గుర్తించిన RFCL అధికారులు రాత్రి 10 గంటల నుండి 15 రోజుల పాటు యూరియా ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం ప్లాంటు నుండి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ గడ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు యూరియా ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఈ ప్లాంటులో ఏర్పడిన సాంకేతికత సమస్యను అధిగమించే వరకు ఆయా రాష్ట్రాలకు యూరియా సరఫరా చేసే అవకాశాలు లేకుండా పోయాయి. తెలంగాణాలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలకు కూడా ఇక్కడి నుండే యూరియా సరఫరా అయ్యేది. అనూహ్యంగా ప్లాంటులో లీకేజీ కారణంగా ఆయా ప్రాంతాలకు యూరియా ఉత్పత్తి చేసే పరిస్థితి లేకుండా పోయింది. RFCL పునరుద్దరణ జరిగే వరకు దాదాపు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి నిలిచిపోయినట్టేనని తెలుస్తోంది.
అంతా బాగానే…
దేశంలోని యూరియా ఉత్పత్తి చేసే ప్లాంటలన్ని కూడా నిర్విరామంగా పని చేస్తున్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణాలోని RFCLలో సాంకేతిక సమస్య ఎదురుకావడం వల్ల వ్యవసాయరంగంపై తీవ్రమైన ప్రభావం పడనుంది. ఇప్పటికే తెలంగాణాలోని ఆయా జిల్లాలకు 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా 30,800 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే కేంద్రం కెటాయించింది. దీనివల్ల తెలంగాణా వ్యవసాయంపై తీవ్రమైన ప్రభావం పడుతోందని ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులను, అదికారులను కలిసి తెలంగాణాకు సరఫరా చేసే యూరియాలో కోత పెట్టవద్దని వినతి చేశారు. ప్లాంటును సందర్శించిన ఎంపీ ఉత్పత్తి సజావుగానే సాగుతుందని కూడా ప్రకటించారు. తాజాగా RFCLలో లీకేజీ ఏర్పడడంతో యూరియా సరఫరా చేయడం అసాధ్యంగా మారింది.
కేంద్రం ఆరా…
RFCLలో ఏర్పడిన సాంకేతిక సమస్యను అధిగమించే విషయంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఉన్నతాధికారులకు RFCL అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా చేస్తే బావుంటుందన్న సమాలోచనలు చేస్తున్నట్టుగా సమాచారం. RFCLకు ప్రత్యేకంగా నిపుణుల బృందాన్ని పంపిచే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.

