దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ఫిర్యాదుల పరంపర మొదలైంది. నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న వ్యవహరిస్తున్న పురుమళ్ల శ్రీనివాస్ ను పార్టీ నుండి బహిష్కరించాలని పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేరింది. మరోవైపున కరీంనగర్ లో పలవురు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ వ్యవహరశైలిని తప్పు పడుతూ ఆరోపణలకు దిగారు.
పీసీసీ చీఫ్ కు ఫిర్యాదు…
ఏప్రిల్ 28న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ పెరుమాళ్ సమక్షంలో జరిగిన గొడవపై జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు బీసీ నాయకులు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. గురువారం ఆయన ఢిల్లీ నుండి రాగానే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం ప్రత్యేకంగా కలిసి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. పరోక్షంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన పురుమళ్ల శ్రీనివాస్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని పార్టీ కార్య్రకర్తలు పురుమళ్ల శ్రీనివాస్ ను వారించినా వినిపించుకోకుండా దౌర్జన్యానికి దిగాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సమావేశం అనంతరం కిరాయి గుండాలను పిలిపించుకుని దాడి చేయించే ప్రయత్నం చేశాడని వివరించారు. పోలీసులు సకాలంలో స్పందిచనట్టయితే గొడవ తీవ్ర పరిణామాలకు దారి తీసేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా అనుమతి లేకుండా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి మంత్రులను, పార్టీ పెద్దలపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. శ్రీనివాస్ పై భూ కబ్జా కేసులు, ఛీటింగ్ కేసులు ఉన్నాయని, జైలుకు వెళ్లి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో సర్పంచ్ గా ఉన్నప్పుడు సస్పెన్షన్ కు కూడా గురయిన శ్రీనివాస్ తీరును గమనించి అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఆ ఫిర్యాదులో అభ్యర్థించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన వారిలో పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, మాజీ ఎంపీపీ రాచకొండ చక్రాధర్ రావు, సిటీ వర్కింగ్ ప్రసిడెంట్ ఎస్ఏ మోసిన్, బీసీ సెల్ నాయకుడు బోనాల శ్రీనివాస్ లు ఉన్నారు. మరో వైపున కరీంనగర్ జిల్లాలో కూడా పురుమళ్ల శ్రీనివాస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలకు దిగారు. పొన్నం ప్రభాకర్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఆయన వల్ల పార్టీ అప్రతిష్ట పాలు అవుతోందని బీసీ సెల్ ఛైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, డీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి రహమత్ హుస్సేన్, అర్బన్ బ్యాంక్ డైరక్టర్ గడ్డం విలాస్ రెడిలు ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరారు. నలభై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో అనుభందం పెనవేసుకున్న పొన్నం ప్రభాకర్ పై తప్పుడు ఆరోపణలు చేసిన పురమళ్ల తీరుపై మల్యాల సుజిత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.