crime news: సహజ మరణంగా చిత్రీకరించి హత్యకు స్కెచ్…

భర్త మృతి… ప్రాణాపాయ స్థితిలో భార్య…

నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు

దిశ దశ, గంగాధర:

ఆన్ లైన్ బెట్టింగ్, జూదం వంటి వ్యసనాలకు బానిసైన వ్యక్తి వృద్ద దంపతులను హత్య చేసేందుకు పకడ్బందీగా ప్లాన్ వేశాడు. గ్రామానికి దూరంగా నివాసం ఉంటున్న వారికి కొంత కాలంగా చేదోడుగా నిలుస్తూ నమ్మకంగా ఉన్న వ్యక్తే వారిని హత్య చేసేందుకు పథకం రచించాడు. వృద్ద దంపతుల వద్ద ఉన్న ఆభరణాల కోసం వారిని హత్య చేసేందుకు పకడ్బందీగా స్కెచ్ వేసుకున్నాడు. సవాల్ గా తీసుకున్న పోలీసులు వృద్దుల మరణానికి కారణాలను అన్వేషించి ఆధారాలను సేకరించి నిందితున్ని అరెస్ట్ చేశారు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం హత్య, హత్యాయత్నం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు. గంగాధర పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్షకుర్తికి చెందిన గజ్జల శంకరయ్య (76), గజ్జల లక్ష్మీ (70)లు ఈ నెల 7వ తేదిన ఇంటివద్ద అనుమానస్పద స్థితిలో పడిపోయి ఉన్నారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మరునాడు శంకరయ్య మృత్యువు ఒడిలోకి చేరిపోగా లక్ష్మీ అపస్మారకస్థితిలో చికిత్స పొందుతోంది. అయితే వీరిది సాధారణ మరణమా లేక ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఎవరితోనూ శత్రుత్వం కూడా లేని వీరిని హత్య చేసే అవకాశం లేదని గుర్తించిన పోలీసులు కీలకమైన ఆధారం కోసం అన్వేషణ మొదలు పెట్టారు. వృద్ద దంపతులైన శంకరయ్య, లక్ష్మీలకు చేదోడుగా ఉండేందుకు కత్తి శివ (47) తరుచూ వారి ఇంటికి వచ్చి వెల్తుంటాడని పోలీసుల చెవిన పడింది. ఇంతకాలం వారికి సహకరించిన శివ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టేంత సాహసం చేస్తాడా అన్న అనుమానమూ పోలీసులను వెంటాడింది. అయితే శివ స్థితిగతులపై పోలీసులు తెలుసుకునే పనిలో పడిన తరువాత కేసు చిక్కుముడి వీడింది. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్, గంగాధర ఎస్సై వంశీ కృష్ణలతో పాటు పోలీసు యంత్రాంగం గర్షకుర్తిలో జరిగిన క్రైం ఇన్వెస్టిగేషన్ లో శోధన చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు.

అనుమానం రాకుండా…

నిందితుడు శివకు ఉన్న వ్యసనాల కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. వీటిని అధిగమించేందుకు డబ్బులు అవసరం కాగా… తాను ఇంతకాలం అండగా నిలిచిన వృద్ద దంపతులను లక్ష్యం చేసుకున్నాడు. అయితే వారిని హత్య చేసినట్టయితే ఖచ్చితంగా తాను దొరికిపోతానని బావించిన శివ తనపై అనుమానం రాకుండా ఉండేందుకు పకడ్భందిగా స్కెచ్ వేశాడు. గతంలో ముంబాయిలోని కళ్లు డిపోలో పని చేసిన అనుభవం కూడా ఉన్న శివ అక్కడ కళ్లు సేవించేవారికి మత్తు ఎక్కువగా వచ్చేందుకు కలిపే మాత్రలను సేకరించాడు. అక్టోబర్ 7న శంకరయ్య, లక్ష్మీలు జలుబు, జ్వరం, దగ్గుతో బాధ పడుతున్నారని తెలుసుకున్న శివ తనవద్ద ఉన్న మత్తు ట్యాబెట్లను వారికి ఇచ్చి వాటిని వేసుకున్నట్టయితే ఆరోగ్యం బాగవుతుందని నమ్మించాడు. వృద్ద దంపతులకు ఆరు చొప్పున మత్తు గుళికలను ఇచ్చిన శివ మాటలు నమ్మిన వారు వాటిని వేసుకున్నారు. దాదాపు రెండు గంటల తరువాత వృద్ద దంపతులు అపస్మారక స్థితిలో చేరుకున్నారని నిర్దారించుకున్న శివ తిరిగి శంకరయ్య ఇంటికి వెళ్లి లక్ష్మీ మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు దొంగలించుకుని పరార్ అయ్యాడు. అదే రోజు రాత్రి గ్రామంలోని కట్ట శ్రీనివాస చారి అనే గోల్డ్ స్మిత్ కు ఆ బంగారన్ని విక్రయించి రూ. లక్షా 85 వేలు నగదు తీసుకుని అప్పులు తీర్చుకోవడంతో పాటు జూదం, ఆన్ లైన్ బెట్టింగుల్లో వెచ్చించాడు. వృద్ద దంపతులకు మత్తు గుళికలు ఇచ్చి హత్యకు స్కెచ్ వేసిన శివను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని సీపీ గౌష్ ఆలం తెలిపారు. నిందితుని వద్ద మిగిలిన మత్తు మాత్రలు, 20 గ్రాముల బంగారం, 250 మిల్లీ గ్రాముల పుస్తెల తాడు, మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీసి అసలు నిందితుడని పట్టుకోవడంలో సఫలం అయ్యారు. ఈ కేసు పరిశోధనలో కీలకంగా వ్యవహరించిన కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్, గంగాధర ఎస్సై వంశీ కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ చారీ, కానిస్టుబుళ్లు జంపన్న, అరవింద్ లను సీపీ గౌష్ ఆలం అభినందించారు.అభినందించారు.