దిశ దశ, హైదరాబాద్:
పీపుల్స్ వార్ అనుబంధ సంఘం అయిన జన నాట్య మండలి వ్యవస్థపాకుల్లో ఒకరు, మావోయిస్టు పార్టీకి అనుబంధంగా ఏర్పడిన చైతన్య నాట్య మండలి అగ్రనేత మల్ల సంజీవ్ అలియాస్ లింగు జనజీవనంలో కలవాలని నిర్ణయించుకున్నారు. ఆయన భార్య దీనా కూడా లొంగిపోతున్నట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపట్లో సంజీవ్ దంపతులు రాజకొండ పోలీస్ కమిషనర్ గొట్టె సుధీర్ బాబు ముందు అధికారికంగా లొంగుబాట ప్రకటన వెల్లడించనున్నారు.
అనారోగ్యంతో…
అనారోగ్యంతో బాధపడుతున్న లింగు కొద్ది రోజులుగా లొంగిపోయేందుకు నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని మావోయిస్టు పార్టీ వర్గాలు మాత్రం కొట్టి పారేశాయి. దీంతో కొంతకాలంగా మావోయిస్టు పార్టీ అగ్రనేతలు లొంగిపోతున్నారని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుండడం వారు మాత్రం బయటకు రాకపోవడంతో సంజీవ్ విషయంలో కూడా అలాంటి ప్రచారమే జరిగిందని భావించారు. కానీ గురువారం మద్యాహ్నం సంజీవ్ దంపతుల లొంగుబాటును అధికారికంగా ప్రకటించనున్నట్టు వెలుగులోకి రావడం గమనార్హం.
గద్దర్ తో పాటు…
1970వ దశాబ్దంలో ఏర్పడిన జన నాట్యమండలి పీపుల్స్ వార్ పార్టీ ఆవిర్బావం తరువాత అనుబంధంగా కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీ ఆవిర్భావం అయిన కొంతకాలనికి జన నాట్య మండలి పేరును చైతన్య నాట్య మండలిగా మార్చారు. గద్దర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సంస్థ నిర్మాణంలో సంజీవ్ పాత్ర కూడా కీలకం. పీపుల్స్ వార్ ఆవిర్భావం తరువాత కొంతకాలానికి పూర్తిస్థాయిలో విప్లవ కార్యకర్తగా అడవి బాట పట్టిన సంజీవ్ తాజాగా లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. సంజీవ్ దంపతుల లొంగుబాటుకు ప్రధాన కారణం అనారోగ్యమేనని తెలుస్తోంది.

