అప్పుడెందుకు పట్టించుకోలేదో..?
ఇరిగేషన్ అధికారులు తీరుపై సర్వత్రా చర్చ
దిశ దశ, కరీంనగర్:
నాడు కళ్ల ముందు కనిపిస్తున్న కబ్జాకాండా అయినా, వనరుల విధ్వంసమే అయినా తమకేమీ పట్టించుకోనట్టుగా వ్యవహరించిన నీటి పారుదల శాఖ అధికారులు ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగారు. డ్యామ్ సేప్టీ యాక్టు ప్రకారం నిర్మాణాలు చేసుకున్న వారికి నోటీసులు పంపించడం మొదలు పెట్టారు.
ఎల్ఎండీ సమీపంలో…
లోయర్ మానేరు డ్యాం సమీపంలో అక్రమంగా నిర్మాణాలు జరపడం చట్ట విరుద్దమని నోటీసులు జారీ చేస్తున్నారు. లోయర్ మానేరు డ్యాంకు 200 మీటర్ల దూరం వరకూ ఎలాంటి నిర్మాణాల జరపవద్దని 2021 డ్యాం సేఫ్టీ యాక్ట్, ఇండియన్ స్టాండర్డ్ యాక్టు ప్రకారం చట్ట విరుద్దమని అందులో పేర్కొన్నారు. డ్యాం కట్ట భద్రత దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని లేనట్టయితే డ్యాం సేఫ్టీ యాక్ట్ చాప్టర్ 4, క్లాజ్ 41 ప్రకారం ఏడాది జైలు శిక్ష, లేదా జరిమానా, రెండు కూడా విధించవచ్చని ఇరిగేషన్ అధికారులు ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. ఎల్ఎండీ కాలనీలోని డివిజన్ నంబర్ 5 పరిధిలోని సబ్ డివిజన్ 1 డిప్యూటీ ఈఈ నోటీసులు జారీ చేస్తన్నట్టుగా తెలుస్తోంది. లోయర్ మానేరు డ్యాం సమీపంలో అక్రమంగా నిర్మాణాలు జరిపిన సుమారు 150 మందికి ఈ మేరకు నోటీసులు పంపించినట్టుగా తెలుస్తోంది.
అప్పుడేం చేశారో..?
ఆనకట్టల భద్రతా చట్టం 2021 ప్రకారం చర్యలు తీసుకోవల్సి ఉంటుందని ఇరిగేషన్ అధికారులు నోటీసులు జారీ చేయడం విస్మయం వ్యక్తం అవుతోంది. బాజాప్తాగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం, ఇంటి నిర్మాణం చేయడం, మునిసిపాలిటీ నుండి పర్మిషన్లు కూడా తీసుకున్నా నాలుగేళ్లుగా పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు ఉన్నట్టుండి నోటీసులు జారీ చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. నిర్మాణాల సమయంలోనే ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విషయంపై కొందరు లోకాయుక్తాను కూడా ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. అయితే 2021 నుండి అమల్లోచి డ్యాం సేఫ్టీ భద్రతా చట్టం అమల్లోకి వచ్చిందని చెప్తున్న అధికారులు మొదట్లోనే అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టయితే బావుండేది కదా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇంతటితోనేనా..?
అయితే నిబంధనల ప్రకారం నోటీసులు ఇస్తున్న ఇరిగేషన్ అధికారులు రూల్స్ బ్రేక్ చేసిన వారిపై కఠినంగా వ్యవహిరిస్తారా లేక నోటీసులతోనే సరిపెడ్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇంటి నిర్మాణం కోసం సదరు వ్యక్తులు మునిసిపాలిటీలో సమర్పించిన డాక్యూమెంట్లు ఏంటీ..? ఈ భూములు వారి పేరిట ఎలా మారాయి, రిజిస్ట్రేషన్ చేసింది ఎవరూ తదితర అంశాలపై అధికారికంగా వివరాలు సేకరించి బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారా లేక నామమాత్రపు చర్యలతోనే సరిపెడ్తారా అనే విషయంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఇరిగేషన్ అధికారులు కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే దర్జాజా నిర్మాణాలు చేసుకున్నారని, అప్పుడు ఫిర్యాదు అందుకుని అభ్యంతరాలు వ్యక్తం చేసి చేతులు దులుపుకున్నారు కానీ అప్పుడే చట్టపరమైన చర్యలు తీసుకోవల్సి ఉండేనని అంటున్న వారూ లేకపోలేదు.
ఆ భూమి ఎవరిది..?
మరో వైపున ఇరిగేషన్ అధికారులు తాజాగా ఇచ్చిన నోటీసుల్లో డ్యాంసేప్టీ యాక్ట్ 2021 గురించి మాత్రమే ప్రస్తావించారు కానీ ఆ భూములు ఎవరివో మాత్రం నోటీసులో పేర్కొనకపోవడం గమనార్హం. లోయర్ మానేరు డ్యాం నిర్మాణం కోసం చాలా గ్రామాల్లో భూసేకరణ జరిపిన అధికారులు కట్టకు దిగువ ప్రాంతంలో కూడా భూ సేకరణ చేశారని తెలుస్తోంది. అప్పటి నుండి కూడా ఈ ఫ్రాంతంలోని భూములు నీటి పారుదల శాఖ పరిధిలో ఉన్నప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా, నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్లు లేకుండా ప్రైవేటు వ్యక్తులు క్రయ విక్రయాలు జరుపుతున్నారన్నది బహిరంగ రహస్యం. ఇరిగేషన్ విభాగానికి చెందిన ఈ భూములను అమ్ముతూ సామాన్యులను మోసం చేస్తున్నారన్న ఆరోపణలు గతంలోనే వెల్లువెత్తాయి. ఇప్పుడు మాత్రం 2021 యాక్టు ప్రకారం నోటీసులు ఇస్తున్న అధికారులు అసలు విషయాన్ని మరుగున పెడుతున్నారా అన్న అనుమానం వస్తోంది. తమ శాఖ పరిధిలో ఉన్న భూములు అని, వాటిని ఆక్రమించుకోవడం చట్ట విరుద్దమని, డ్యాం సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం శిక్ష పడే అవకాశం ఉంటుందని మాత్రం ఆ నోటీసుల్లో పేర్కొనలేదు. కేవలం డ్యాం సేఫ్టి యాక్టు ప్రకారం తమ అనుమతి లేకుండా నిర్మాణాలు చేసుకున్న వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని మాత్రం సూచించారు. ఇరిగేషన్ పరిధిలో ఉన్న భూములను పట్టాదారులకు ఇచ్చేందుకు నిబంధనలు సడలించి రాష్ట్ర ప్రభుత్వం జీఓలను విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఇరిగేషన్ అధికారుల నుండి NOC తీసుకున్న తరువాతే పట్టాదారులకు భూములు ఇచ్చింది. కానీ చాలా మంది మాత్రం ప్రభుత్వంతో కానీ, ఇరిగేషన్ విభాగంతో కానీ సంబంధం లేకుండానే ఆక్రమణలు జరిపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో చాలా వరకు భూమి అంతా కూడా ఇరిగేషన్ విభాగం ఆధీనంలో ఉన్నప్పటికీ కబ్జాలు చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నోటీసుల వెనక ఉన్న ఆంతర్యం ఏమిటోనన్నదే అంతు చిక్కకుండా పోతోంది. ఒకవేళ ఆ భూములు ఇరిగేషన్ పరిధిలోనివి కానట్టయితే ఆ శాఖ అనుమతి తీసుకోవల్సిన అవరమే ఉండదని, యజమానులు భూమికి సంబంధించిన రికార్డులు సమర్పించిన బల్దియాలో ఇంటి నిర్మాణం తీసుకునే అధికారం ఉంటుంది. అయితే తాజాగా ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నోటీసులో మాత్రం ఆ భూములు తమ శాఖకు సంబంధించినవన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ప్రేవేటు వ్యక్తుల భూములపై ఇరిగేషన్ అధికారులకు హక్కు ఎలా ఉంటుందన్న వాదనలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. 1978లోనే లోయర్ మానేరు డ్యాం కోసం సేకరించిన భూమి వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి ఇందుకు అనుగుణంగా నోటీసులు జారీ చేయడం సరైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

