త్రివేణి సంగమంలో అద్భుత సన్నివేశం…
దిశ దశ, కాళేశ్వరం:
అంతర్వాహిని సరస్వతి పుష్కరాలతో కాళేశ్వరం సరికొత్త కాంతులీనుతోంది. కనీవిని ఎరగని స్థాయిలో భక్త జనం త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తోంది. శతాబ్దాలుగా సరస్వతి నదికి పుష్కరాలు జరుపుకునే ఆనవాయితీ కొనసాగుతున్న అధికారికంగా మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం. ఉత్తరాదిన ఉన్న ప్రయాగరాజ్ వద్ద మాత్రమే పుష్కరాలు నిర్వహించుకునే సాంప్రాదాయాన్ని ఈ ఏడాది కాళేశ్వరంలో మొదలుపెట్టారు. దీంతో దేశంలో రెండో చోట సరస్వతి నది పుష్కరాలు నిర్వహించుకునే సాంప్రాదాయానికి శ్రీకారం చుట్టినట్టయింది.
జనం… జనం…
కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పవిత్ర స్నానాలు చేసేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. పుష్కరాల గురించి విస్తృతంగా ప్రచారం జరగడంతో రోజు రోజుకు భక్తుల సంఖ్య రెట్టింపు అవుతోంది. దీంతో కాళేశ్వరం త్రివేణి సంగమ తీరం అంతా భక్తులతో కిక్కిరిసిపోతోంది. వేకువ జాము నుండి మొదలు రాత్రి వరకూ కూడా నదీ తీరం సరికొత్త శోభను సంతరించుకుంది. ఓ వైపున కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య స్నానాలు, మరో వైపున త్రివేణి సంగమానికి చీరె సారె సమర్పించడం, నీటి పక్కన సైకత లింగాలకు పూజలు, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో కాళేశ్వరం అంతా ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. నది తీరంలో పూర్వీకులను స్మరించుకుంటూ పితృ తర్పణాలు చేసేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా తమ కుంటుంబ సభ్యులు చనిపోయిన రోజున అమశ్రాద్దం నిర్వహించే తంతు కొనసాగిస్తుంటారు. కానీ పుష్కర నది తీరంలో తీర్థవిధి నిర్వహించుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటుంది భారతీయ సాంప్రాదాయం. ఏటా తమ కుటుంబ సభ్యులకు తిథి కార్యం చేసినప్పుడు మూడు తరాలను మాత్రమే స్మరించుకునే ఆనవాయితీ కొనసాగుతుంటుంది. కానీ పుష్కర నదీ తీరంలో అయితే తమ గోత్రీకులతో పాటు, చనిపోయిన బంధువులు, స్నేహితులను కూడా స్మరిస్తూ వారి పేరిట పిండ ప్రధానం చేయడం అత్యంత శ్రేయస్కరంగా భావిస్తుంటారు. ఇలాంటి ప్రతి అంశానికి ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతి, సాంప్రాదాయలను పాటించేందుకు త్రివేణి సంగమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. సోమవారం నాటితో సరస్వతి పుష్కరాల తొలి 12 రోజుల కార్యక్రమం ముగియ నున్నందున కాళేశ్వరానికి భక్తుల సంఖ్య మరింత తీవ్రంగా పెరిగిపోతున్నది.
త్రివేణి హారతి…
ఇకపోతే సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరంలో అత్యంత హైలెట్ గా నిలుస్తోంది త్రివేణి సంగమంలో నిర్వహించే హారతి. హారతి నిర్వహించేందుకు కాశీ నుండి ప్రత్యేకంగా పండితులను తీసుకుని వచ్చారు. వీరు రోజు రాత్రి త్రివేణి సంగమ తీరాన నిర్వహిస్తున్న హారతి తంతు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే కాశీ గంగలో నీటి ప్రవాహంపై బోట్లలో కూర్చుని తిలకించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ కాళేశ్వరంలో నది తీరం 3 నుండి 4 కిలో మీటర్ల మేర విస్తరించి ఉండడంతో నీటి ప్రవాహం మినహాయిస్తే మిగతా ప్రాంతమంతా కూడా ఇసుక మాత్రమే ఉంటుంది. దీంతో భక్తులు అదనంగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండానే త్రివేణి సంగమంలో ఉంటూ హారతిని వీక్షించే అవకాశం ఉంది. ప్రముఖులతో పాటు సాధారణ భక్తులు కూడా హారతిని వీక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. రోజు రాత్రి గంటకు పైగా నిర్వహించే హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకే పెద్ద ఎత్తున భక్తులు కాళేశ్వరంలో ఉండిపోతున్నారు. హారతి అనంతరం స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారంటే హారతి కార్యక్రమానికి ఎంతమేర ఆదరణ లభిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.
యముడు, శివుడు…
ఇకపోతే రోజు కాళేశ్వరం త్రివేణి సంగమంలో నిర్వహించే హారతి కార్యక్రమంతో పాటు శుక్రవారం శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి సన్నిధిలో కూడా హారతి కార్యక్రమం నిర్వహించారు. గర్భాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంతో కాళేశ్వరం ఆలయ ప్రాంగణమంతా హర హర మహాదేవో శంభో శంకర అన్న నినాదాలతో మారు మోగింది. క్యూ లైన్లలో ఉన్న భక్తులు కూడా వీక్షించే అవకాశం కల్పించడంతో వారంతా మంత్రముగ్దులై వీక్షించారు.