Saraswati Pushkaram enters seventh day in Kaleshwaram: ఏడో రోజుకు చేరుకున్న సరస్వతి పుష్కరాలు…

భక్త జన సంద్రంగా మారిన త్రివేణి సంగమం…

దిశ దశ, కాళేశ్వరం:

‘‘ప్రణీతాయాశ్చ గౌతమ్యా | మధ్యేగుప్త సరస్వతి గృహాణార్ఘ్యం మయా దత్తం । బ్రహ్మపత్ని సుపూజితే’’ 

చారిత్రాత్మక నేపథ్యాన్ని, ప్రకృతి ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మికత శోభను సంతరించుకున్న త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించే భక్తులు తమ శక్తి కొద్ది దానాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. గోదావరి, ప్రాణహిత నదుల సంగమించిన కాళేశ్వరంలో ప్రవహిస్తున్న అంతర్వాహిని సరస్వతి నది బ్రహ్మపత్ని పేరిట వెలియడం విశేషం. త్రిలింగ క్షేత్రంలో లింగాకారంలో యముడు, శివుడు ఒకే పానవట్టంపై సాక్షాత్కరించడమే కాకుండా, ఈ ఆలయంలో అత్యంత ప్రాశస్త్యం ఉన్న చరిత లిఖించి ఉంది. భక్తులకు మోక్షాన్ని ఇచ్చే శివుడు, పాపాత్ములకు పనిష్మెంట్ ఇచ్చే యముడు ఒకే చోట వెలిసిన చరిత్ర కాళేశ్వరం సొంతమనే చెప్పాలి. మరో వైపున ఉత్తరాదిన దేవదారుకారుణ్యం విస్తరించిన కశ్మీర్ లో బాల సరస్వతిగా ఉద్భవించిన అమ్మవారు దండకారణ్యంలోనే మరో రెండు రూపాలలో సాక్షాత్కరించడం తెలంగాణాకే తలమానికంగా నిలుస్తోంది. నిర్మల్ జిల్లా బాసరలో జ్ఞాన సరస్వతిగా భక్తులకు దర్శనం ఇస్తుండగా కాళేశ్వరంలో మహా (పౌడ) సరస్వతిగా ఆశీస్సులను అందిస్తోంది. హిమాలయాల్లో పుట్టిన సరస్వతి నది అంతర్థానం అవుతూ అక్కడక్కడ తన ఉనికిని బయటపెడుతూనే ఉంది. శతాబ్దాల క్రితమే బౌగోళికంగా వచ్చిన మార్పుల వల్ల అంతర్థానం అయిన సరస్వతి నది రెండు నదులు సంగమించే కాళేశ్వరంలో అంతర్వాహినిగా ప్రవహిస్తోందని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. దేశంలో అత్యంత అరుదైన సరస్వతి నదికి దక్షిణాది రాష్ట్రాల్లోనే ఒకేఒక చోట పుష్కరాలు జరుగుతున్నాయి. అదే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం కావడం విశేషం. అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నది కూడా మహా సరస్వతిగా అవతరించిన కాళేశ్వరంలోనే ఉండడం ఇక్కడ మరో స్పెషాలిటీ. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న కాళేశ్వరం తెలంగాణ, మహారాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతాల్లో ఉండడం వల్లే ఇంతకాలం వెలుగులోకి రాలేకపోయింది. కీకారణ్యాలు కూడా విస్తరించడం వల్ల కాళేశ్వరం చరిత్ర సరస్వతి నది పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండడంతో బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేసింది.

అక్కడ అలా ఇక్కడ ఇలా…

త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు జలకాలటలతో కేరింతలు కొడుతున్నారు. యువత, చిన్నారులు జలాల్లో స్నానాలు చేస్తూ సంభ్రమాశ్చార్యాల్లో మునిగిపోతున్నారు. శివ నామస్మరణతో పాటు సరస్వతి నదిని పూజిస్తు పుష్కర స్నానాలు చేస్తుంటే… త్రిలింగ క్షేత్రమన కాళేశ్వరం హర హర మహదేవ అంటూ భక్తులు నినదిస్తున్నారు. మరో వైపున ఈ భోళా శంకరుని కోసం శంఖం ఉదుతూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. 

ఏడో రోజున..?

పుష్కర నదిలో పుణ్య స్నానం ఆచరించిన తరువాత దాన ధర్మాలు చేయడం కూడా ముఖ్యమని పూర్వీకులు చెప్పేవారు. ఇందులో భాగంగా నేటికీ కూడా పుష్కర నదీ తీరంలో దానాలు చేసే సాంప్రాదాయం కొనసాగుతోంది. ఏడో రోజున గృహదానం, పీటల దానం, శయ్య దానం చేయడం వల్ల శుభం కలుగుతోందని చరిత్ర చెబుతోంది. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే… ఆథ్మాత్మిక భావనతో పుణ్య స్నానాలు చేయడం వల్లే ఫలితం దక్కదు… దాన గుణాన్ని కూడా అలవర్చుకోవాలన్నదే నాటి తరం అభిమతం. అయితే ఇప్పుడిదో సెంటిమెంట్ గా మారిపోయి పెద్దలు ఆచరించారు మేమూ ఆచరిస్తున్నామని మొక్కుబడిగా దానాలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. వాస్తవంగా పుణ్య స్నానం ఆచరించి పునీతులు కావడం కాదు మానవత్వాన్ని ప్రదర్శించడంతోనే పరిపూర్ణత దక్కుతుందన్నదే ఈ ఆచారంలో దాగి ఉన్న నిగూఢత.

నీటి కొరతా…?

అయితే కాళేశ్వరం త్రివేణి సంగమంలో చాలినంత నీరు ప్రవహిస్తోందా..? గోదావరి నదిలో నీరు అంతగా కనిపించడం లేదు కదా అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. కానీ వాస్తవగా గోదావరి నది ప్రవహించే ఎగువ ప్రాంతానికి త్రివేణి సంగమంగా ఉన్న కాళేశ్వరం ప్రాంతానికి చాలా వైవిద్యమైన పరిస్థితులు ఉంటాయి. ఎగువ ప్రాంతంలో మానేరు లాంటి చిన్న చిన్న నదులు మాత్రమే గోదావరి నదిలో కలుస్తుండడం వల్ల నీరు అంతగా గోదావరి నదిలో కనిపించదు. కానీ కాళేశ్వరం వద్దకు చేరుకున్న తరువాత ప్రాణహిత నది నుండి భారీగా జలాలు గోదావరి నదిలో వచ్చి కలుస్తూనే ఉంటాయి. దీంతో కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో నీటి కొరత అనేది ఉండదన్నది వాస్తవం. అయితే ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులు సంగమించడం వల్ల, దిగువ ప్రాంతానికి వస్తున్న గోదావరి నదిలో వరద ఉధృతి తీవ్రంగా ఉండడం వల్ల కాళేశ్వరం ప్రాంతంలో నది తీరం అంతా వెడల్పుగా విస్తరించింది. నీటి ప్రవాహం ఒత్తిళ్ల కారణంగా ఏటేటా నది తీరంలోని భూములు వరద ఉధృతిలో కొట్టుకపోవడం వల్ల ఇక్కడ గోదావరి దాదాపు 2 నుండి 3 కిలో మీటర్ల మేర ప్రవహిస్తుంటోంది. నది ప్రవహానికి ఇరువైపులా కిలోమీటర్ల మేర ఇసుక కనిపిస్తుండడంతో నీటి ప్రవాహం చిన్న పాయలా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎగువ గోదావరితో పాటు దిగువ గోదావరి ప్రాంతంలో కన్న ఎక్కువ నీటి లభ్యత కాళేశ్వరం త్రివేణి సంగమంలోనే ఉంటుంది. నీటి ప్రవాహం కూడా దిగువ ప్రాంతానికి సాగుతున్నందున కాళేశ్వరంలో పుణ్య స్నానాలు చేయడం వల్ల రుగ్మతలు సోకే అవకాశం కూడా ఉండదు.

You cannot copy content of this page