ఇసుక తవ్వకాల తీరుపై విమర్శలు…
గోదావరిలోకే భారీ వాహనాలు…
దిశ దశ, మహదేవపూర్:
అన్నారం బ్యారేజీలో పేరుకపోయిన ఇసుక నిలువలను తరలిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. ఏరియాలోకి ఏకంగా భారీ వాహనాలను అనుమతించడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. అన్నారం బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇష్టారీతిన సాగుతున్న ఇసుక సేకరణపై అధికారులు పట్టించుకోని వైఖరి అవలంబిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనలు ఏవీ..?
అన్నారం బ్యారేజీ గేట్ల సమీపంలోని పిల్లర్ల మధ్య భారీగా ఇసుక వచ్చి చేరింది. ఇక్కడ పేరకపోయిన ఇసుకను తరలించేందుకు అనుమతులు ఇచ్చిన అధికారులు అజమాయిషీ చేయడం లేదన్న ఆందోళన స్థానికంగా వ్యక్తం అవుతోంది. తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (TGMDC) ఆధ్వర్యంలో తరలిస్తున్న అన్నారం ఇసుక విషయంలో కావాలనే అధికారులు మినహాయింపులు ఇచ్చారా లేక మరేదైనా కారణం ఉందా అన్న చర్చ స్థానికంగా సాగుతోంది. వాస్తవంగా సహజ వనరుల నుండి ఇసుక తవ్వకాలు జరపాలంటే కేంద్ర పర్యావరణ విభాగం నిబంధనలు అనుసరించాల్సి ఉంటుందని తెలుస్తోంది. కానీ అన్నారం విషయంలో మాత్రం ఇలాంటివేవి పట్టించుకోకుండానే నడుచుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా అన్నారం వద్ద నిర్మించిన బ్యారేజీ విషయంలో అయితే సంబంధిత శాఖల ద్వారా కూడా అనుమతులు తీసుకోవల్సి ఉంటుందని తెలుస్తోంది. కానీ ఇవేవి పట్టించుకోకుండానే ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు జరుపుతుండడంపై విస్మయం వ్యక్తం అవుతోంది.
భారీ వాహనాలు ఎలా..?
TGMDC ఆధ్వర్యంలో చేపట్టే ఇసుక రీచుల్లో ప్రత్యేకంగా స్టాక్ యార్డులను ఏర్పాటు చేసినప్పటికీ ఒక్క అన్నారం బ్యారేజీ విషయంలో మినహాయింపులు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్న చర్చ మొదలైంది. బ్యారేజీ ఎగువ, దిగువన పేరుకున్న ఇసుకను తొలగించేందుకు TGMDC ప్రత్యేకంగా రీచులను ఏర్పాటు చేసింది. అయితే ఈ రీచుల నుండి ఇసుక తరలించేందుకు సమీపంలో స్టాక్ యార్డుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎగువన ప్రాజెక్టు గేట్ల పిల్లర్ల సమీపం వరకు లారీల్లో మిషన్ల ద్వారా ఇసుక లోడింగ్ చేస్తున్నారు. మరో వైపున బ్యారేజీ దిగువన దాదాపు 500 మీటర్ల దూరం వరకు కూడా గోదావరి నదిలోకి లారీలను అనుమతించి అక్కడే ఇసుక లోడ్ చేస్తున్నారు. దీంతో పర్యావరణ సంబంధిత సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం.
అనుమతులా..?
మరో వైపున TGMDC అధికారులు లారీలను అన్నారం బ్యారేజీ సమీపంలోకి తీసుకెళ్లేందుకు అనుమతులు ఇచ్చారంటూ కాంట్రాక్టర్ తరుపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే నిజమైతే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను మాత్రం చూపించడం లేదని స్థానికులు అంటున్నారు. అన్నారంలో ఇసుక పేరుక పోయిందని అంచనాలు వేసిన ఇరిగేషన్ అధికారులు లారీలను బ్యారేజీ వరకు తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వడమో కానీ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ జారీ చేయడమో కానీ చేశారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఒక వేళ తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఇందుకు సంబంధించిన అనుమతులు ఇచ్చినట్టయితే పర్యావరణ నిబంధనల మేరకే జారీ చేశారా లేదా అన్న విషయం కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. కేవలం స్థానికులను మభ్య పెట్టేందుకు అనుమతులు ఉన్నాయన్న చెప్పుకుంటూ నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్టర్ నడుచుకుంటున్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరంలో TGMDC ప్రత్యేకంగా ప్రాజెక్టు కార్యాలయాన్ని నిర్వహిస్తున్నా ఇక్కడ పని చేస్తున్న యంత్రాంగం ఇలాంటి వ్యవహారాలపై చూసీ చూడనట్టుగా ఉండడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

