తెరపైకి రేకుర్తి భూముల వ్యవహారం…

నివేదిక కోరిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి….

దిశ దశ, కరీంనగర్:

కోర్టులో విచారణ సాగుతున్న రేకుర్తి భూముల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో విచారణలో ఉన్న ఆ భూములకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు జరపకూడదని ఆదేశాలు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దృష్టికి బాధితుల తరుపు న్యాయవాదులు తీసుకెళ్లడంతో ఈ అంశం  వెలుగులోకి వచ్చింది.

కరీంనగర్ సమీపంలోని రేకుర్తి శివార్లలోని దాదాపు 200 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. విచారణ దశలో ఉన్న ఈ భూముల్లో ఎలాంటి క్రయ విక్రయాలు జరపరాదని హై కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ లావాదేవీలు సాగుతున్నాయని బాధితుల తరుపున న్యాయవాదులు మే 30న జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. W.A No. 612/1997లో హై కోర్టు ఆదేశాల మేరకు అప్పటి కలెక్టర్ బీఆర్ మీనా విచారణ నిర్వహించారని ఆ లేఖలో పేర్కొన్నారు. రేకుర్తి శివార్లలోని సర్వే నంబర్ 6లో 2.35 ఎకరాలు, 207లో 2.12 ఎకరాలు, 44లో 0.38 ఎకరాలు, 20లో 1.32 ఎకరాలు, 50లో 3.03 ఎకరాలు, 216లో 0.30 ఎకరాలు, 18లో 9.28 ఎకరాలు, 26లో 2.09 ఎకరాలు, 27లో 1.28 ఎకరాలు, 58లో 3.35 ఎకరాలు, 194లో 88.21 ఎకరాలు, 186లో 17.35 ఎకరాలు, 157లో 2.05 ఎకరాలు, 158లో 0.12 ఎకరాల్లో రికార్డులు తారుమారు చేసిన విషయాన్ని అప్పటి కలెక్టర్ ప్రస్తావించారని వివరించారు. ఈ మేరకు అప్పటి కలెక్టర్ బీఆర్ మీనా సుప్రీంకోర్టు, హైకోర్టుకులకు నివేదిక ఇచ్చారని తెలిపారు. ఆ తరువాత జిల్లా కలెక్టర్ సుమితా డావ్రా 2003లో జారీ చేసిన ప్రొసిడింగ్స్ లో బాధిత పట్టాదారులకు పాసు పుస్తకాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ పట్టాదారు పుస్తకాల జారీ ప్రక్రియలో రెవెన్యూ అధికారులు ఆలస్యం చేయడంతో ప్రత్యర్థులు హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకున్నారు. హై కోర్టు ఇచ్చిన స్టేపై జిల్లా కలెక్టర్ సుమితా డావ్ర రేకుర్తి భూములకు సంబంధించిన రిపోర్టులను హై కోర్టుకు సమర్పించారు. ఈ నివేదికలను పరిశీలించడంతో పాటు, బాధితులు చేసుకున్న వినతులను సునిశితంగా పరిశీలించిన హై కోర్టు 2022లో బాధితులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పాటు వారికి 3 నెలల్లో పాసు పుస్తకాలు కెటాయించాలని  ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వుల మేరకు నడుచుకోవడంలో రెవెన్యూ అధికారులు చేసిన  ఆలస్యంతో మరోసారి ప్రత్యర్థులు హై కోర్టును ఆశ్రయించారు.  హై కోర్టులో జరుగుతున్న ఈ భూములకు సంబందించిన లావాదేవీలు జరపవద్దని అప్పటి కలెక్టర్ రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశిస్తూ లేఖ విడుదల చేశారని తెలిపారు. 1994 నుండి ఇప్పటి వరకు కూడా జిల్లా అధికారులు రేకుర్తిలోని పలు సర్వే నంబర్లను కూడా క్రోడీకరించి లేఖలు విడుదల చేసినప్పటికీ ఇందుకు సంబంధించిన లావాదేవీలు జరుగుతున్నాయని వాటిని రద్దు చేయడంతో పాటు ఇక ముందు కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయకూడదని కోరుతూ బాదితుల తరుపున న్యాయవాదులు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి రాసిన లేఖలో కోరారు.

ఆదేశాలు…

రేకుర్తి భూముల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగుతున్న విషయంపై నివేదిక ఇవ్వాలని ప్రస్తుత కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు Lr.No. E1/1033/2025, తేది: 12 /06/2025 ద్వారా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. హై కోర్టు W.A.No.442/2022 స్టే కూడా ఇచ్చినందున రేకుర్తి భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేయడంపై చర్యలు తీసుకోవడంతో పాటు నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.