మ్యాజిక్ ఫిగర్ చేరుకున్న బీజేపీ…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ కార్పొరేషన్ పై బీజేపీ పట్టు బిగించేసింది. మ్యాజిక్ ఫిగర్ చేరుకోడంలో సఫలం అయింది. పార్టీ తరుపున గెలిచిన 30 మంది కార్పొరేటర్లతో పాటు బీజేపీ రెబెల్ అభ్యర్థులు సౌగాని కొమురయ్య, మాసం గణేష్ లు తమ మద్దతు ప్రకటించారు. 13వ డివిజన్ నుండి గెలిచిన తెల్లం లక్ష్మీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి గెలిచిన విపల సాయి జ్యోతి కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీీలో చేరారు. మరో ఇండిపెండెంట్ అభ్యర్థి వేముల కవిత బీజేపీలో చేరినట్టుగా బీజేపీ వర్గాలు వెల్లడించాయి. దీంతో కార్పొరేషన్ లో బీజేపీ బలం 35కు చేరుకుంది. ఎక్స్ ఆఫ్ ఫియో సభ్యుల సంఖ్య కలుపుకున్నా కూడా బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లభించినట్టయింది. అవసరమైతే స్థానిక ఎంపీగా బండి సంజయ్, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డిల ఓటు హక్కును కూడా వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడం పక్కా అని తేలిపోయింది. మరో వైపున ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, స్వతంత్రులు మరో ఐదుగురు కూడా బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలు బీజేపీపై ఆధిక్యం ప్రదర్శించే ప్రయత్నాలకు కూడా గండి కొట్టినట్టయింది.