పోలీసుల అత్యుత్సాహమా..?
వేడుకల్లో కాఖీల జోక్యంపై విమర్శలు…
దిశ దశ, కాళేశ్వరం:
స్వరాష్ట్రం సిద్దించిన తరువాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ జీవనం సాగిస్తామని కన్న కలలు కల్లలయ్యాయి. ముఖ్యంగా అంగరంగ వైభవంగా జరుపుకునే వేడుకల విషయంలో అయితే తీవ్రమైన నిర్భందం పెరిగిపోతోంది. వేములవాడ రాజన్న అయినా, యాదాద్రి నర్సన్న అయినా, కాళేశ్వరం పుష్కరమే అయినా ప్రతి చోట కూడా కట్టడి చర్యలు తీవ్రంగా పెరిగిపోయాయి. స్థానికులు అయినా, జర్నలిస్టులు అయినా ఎవరికైనా స్వేచ్ఛ మాత్రం లేకుండా పోయింది. దీంతో సామాన్యుడి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది.
ప్రభుత్వం నిర్ణయమేనా..?
పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తులను కట్టడి చేయడం, వారిని క్షేమంగా గమ్యానికి చేర్చే విధంగా ప్రణాళికలు తయారు చేయడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత. కానీ ఉత్సవాల సమయంలో పుణ్య క్షేత్రాలపై అజమాయిషీ అంతా కాఖీల చేతుల్లో పెడుతున్న తీరే విమర్శలకు దారి తీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాలలో కూడా ఈ పరిస్థితి సాక్షాత్కరిస్తున్న తీరుపై విస్మయం వ్యక్తం అవుతోంది. ప్రముఖుల కోసం అర్భాటాలు చేస్తున్న అధికార యంత్రాంగం సామాన్యుల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. చివరకు ఆలయాల్లో పనిచేసే అర్చకులను కూడా కట్టడి చేస్తున్న తీరు సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాళేశ్వరం ప్రధాన ఆలయ అర్చకుడు పనకంటి నగేష్ శర్మనే ఆలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకోవడం కలకలం లేపింది. కాళేశ్వరం నివాసులపై కూడా నియంత్రిస్తున్న తీరు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే సుదూర ప్రాంతాల నుండి వస్తున్న సామాన్య భక్తులు మండుతున్న ఎండలను తట్టుకుంటూ గోదావరి తీరానికి చేరుకోవడం గగనంగా మారిపోయింది. పుష్కర ఘాట్ల వద్ద లిమిటెడ్ ఏరియాలో పుణ్య స్నానాలు చేసి త్రిలింగ క్షేత్రానికి చేరుకుని దర్శనాల కోసం గంటల తరబడి క్యూ లెన్లలో నిలబడాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులు వస్తే వారి సేవలో తరిస్తూ స్వామి భక్తి చాటుకుంటున్న తీరు కూడా ఆందోళనకరంగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
“పోలీస్“
ఇకపోతే పోలీసు అని రాసి ఉంటే చాలు ఆ వాహనానికి రాచ మార్గం ఏర్పడుతోంది. కాళేశ్వరం అంతా కలియతిరిగే స్వేచ్ఛ ఆ వాహనాలకు ఉంటోంది. ఆ వాహనాల్లో పోలీసు ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ ఇలా ఎవరు వెళ్లినా అభ్యంతరాలు ఉండవు. ఆ వాహానాలకు పోలీసు అని రాసి ఉంటే సరిపోతుంది. ఇంకా పోలీసు అధికారులు తమ వారి కోసం అధికార దుర్వినియోగం చేసినా తప్పు ఉండదు. కానీ ఓ జర్నలిస్ట్ ఫ్యామిలీతో వస్తే డ్యూటీలో ఫ్యామిలీ తీసుకరావడం సరి కాదంటూ హితబోధ చేస్తున్నారు. పైగా కంట్రోల్ రూం నుండి చెప్పించాలని హుకూం జారీ చేస్తున్నారు. మారుమూలన ఉన్న కాళేశ్వరం గురించి వెలుగులోకి తెచ్చిన స్థానిక జర్నలిస్టులను తులనాడుతూ… ఉత్సవాలప్పుడు బందోబస్తు చేస్తున్న పోలీసులు మాత్రం కాళేశ్వరం క్షేత్రాన్ని ఆధీనంలోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసమో అధికారులకే తెలియాలి.
దేవాదాయ శాఖ..?
రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్వాహిని సరస్వతి పుష్కరాల విషయంలో ఇతర శాఖల యంత్రాంగం పెత్తనం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది. ఆలయంతో పాటు, నదీ తీరంలో ఆగమ శాస్త్రాలు. ఆచార వ్యవహారాలను పాటించే విషయంలో దేవాదాయ శాఖ ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ డ్యూటీలు చేసే ఉద్యోగుల నుండి మొదలు ఇతరాత్ర అన్నీ వ్యవహారాలను చక్కబెట్టే బాధ్యతపై ఇతర శాఖల పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆందోళన మొదలైంది. ప్రముఖులు ఆలయంలోకి వచ్చినప్పుడు వారి రక్షణ చర్యలకు పరిమితం కావడం, క్యూ లెన్లలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పరిమితం కావల్సిన పోలీసు శాఖ అన్నింటా ఆధిపత్యం వహిస్తున్న తీరుపై కాళేశ్వరం వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన రెవెన్యూ అధికారులు కూడా కొన్ని సందర్భాల్లో అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు కూడా లేకపోలేదు.
ట్రాఫిక్ విషయంలో…
దక్షిణాదిన ఏకైక చోట జరుగుతున్న సరస్వతి పుష్కరాల విషయంలో ట్రాఫిక్ అంచనా వేయడంలో విఫలం అయిన తీరు స్పష్టంగా కనబడుతోంది. వీకెండ్ లో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించకపోవడం విచిత్రం.