రాబరీ గ్యాంగ్ ఎత్తుకు కరీంనగర్ పోలీసుల పై ఎత్తు…

పీఎంజే నగల షాపు దోపిడీ నిందితులపై పీడీ యాక్ట్…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షోరూంలో దోపిడీకి పాల్పడిన ముఠాపై కరీంనగర్ పోలీసుల వ్యూహాలు అంతు చిక్కకుండా అమలవుతున్నాయి. ఈ ముఠా సభ్యులను తెలంగాణాలోనే కట్టడి చేసేందుకు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం వేసిన స్కెచ్ సుబోధ్ గ్యాంగ్ ముఠాకు చుక్కలు చూపిస్తోందనే చెప్పాలి. చివరకు గ్యాంగ్ లీడర్ సుబోద్ సింగ్ అలియాస్ గోల్డ్ థీఫ్ ను కూడా కరీంనగర్ నగల షాపు రాబరీ కేసులో ఏ1 నిందితునిగా చేర్చి అతన్ని పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ హై కోర్టును సుబోధ్ సింగ్ ఆశ్రయించడంతో అతన్ని తెలంగాణ నుండి స్వరాష్ట్రానికి తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సుబోద్ సింగ్ ను బీహార్ పోలీసులకు అప్పగించాల్సి వచ్చింది. అయితే ఈ ముఠాకు చెందిన మిగతా గ్యాంగ్ మెంబర్స్ మాత్రం కరీంనగర్ జైలులోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో వారిపై పీడీ (Preventive Detention Act) యాక్ట్ అమలు చేస్తూ కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఉత్తర్వులు జారీ చేశారు. పీఎంజే నగల షాపులో దోపిడీ ముఠాలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రఘునాథ్ కర్మాకర్ @ జాగీరా సింగ్ (41), బీహార్ లోని నలంద జిల్లాకు చెందిన రావిష్ కుమార్ @ ప్రద్యుమాన్ (23), సూర్యమణి కుమార్ @ సనోజ్ (21), పాట్నా జిల్లా పుల్వరి షరీఫ్ కు చెందిన యాదవ్ @ జైనుల్ అబ్దిన్ (33), మొహమ్మద్ ఆదిల్ ఖాన్ (31)లపై పీడీ యాక్ట్ అమలు చేస్తున్నామని ప్రకటించారు.

వ్యూహాత్మకంగా..?

సుబోధ్ సింగ్ బీహార్ హై కోర్టును ఆశ్రయించిన తరువాత మిగతా నిందితులు తెలంగాణ దాటి వెళ్లకుండా ఉండేందుకు కరీంనగర్ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టుగా స్పష్టం అవుతోంది. కరీంనగర్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న మిగతా నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేసినట్టయితే వారు బీహార్ రాష్ట్రానికి వెళ్లేందుకు అక్కడి కోర్టులను ఆశ్రయించి అనుమతులు తీసుకునే అవకాశం ఉండదని అంచనా వేసినట్టుగా తెలుస్తోంది. బీహార్ రాష్ట్రంలో వివిధ కేసుల్లో ఉన్న వీరంతా అక్కడి కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్టయితే వారికి అనుకూలంగా ఆదేశాలు వచ్చినట్టయితే వీరిని తిరిగి తెలంగాణాకు తరలించే విషయంలో శ్రమించాల్సి ఉంటుందని తెలుస్తోంది. మరో వైపున ఇక్కడి కోర్టుల్లో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసిన ఈ నిందితులు బయటకు వచ్చినట్టయితే స్వరాష్ట్రానికో లేక ఇతర ప్రాంతాలకో వెళ్లిపోయే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీనివల్ల నిందితులు కోర్టులకు హాజరు కాకపోవడం వల్ల కోర్టు వారెంట్ జారీ చేస్తే వారిని వెతికి పట్టుకునందుకు కరీంనగర్ పోలీసులు మళ్లీ బీహార్, పశ్చిమ బెంగాల్ తో పాటు ఇతర ప్రాంతాల్లో గాలించాల్సి వస్తుందని గుర్తించినట్టుగా తెలుస్తోంది. దోపిడీ సమయంలో అత్యంత క్రూరంగా వ్యవహరించి కాల్పులు జరిపిన వీరిపై పీడీ యాక్టు అమలు చేసినట్టయితే ఏడాది కాలం పాటు వారిని తెలంగాణాకే పరిమితం చేసే అవకాశం ఉంటుందని భావించినట్టుగా తెలుస్తోంది.

కమిటీ… హై కోర్టు…

పీడీ యాక్ట్ అమలు చేసిన సదరు నిందితులు స్టేట్ లెవల్ కమిటీని ఆశ్రయించినట్టయితే ఇందుకు సంబంధించి ఆధారాలతో కూడిన నివేదికను కరీంనగర్ పోలీసులు అందించేందుకు రంగం సిద్దం చేసినట్టుగా సమాచారం. కరీంనగర్ పోలీసుల వాదనలతో కమిటీ ఏకీభవించినట్టయితే నిందితులు హై కోర్టును కూడా ఆశ్రయించేందుకు అవకాశం ఉంటుంది. హై కోర్టులో కూడా పీఎంజే జ్యువెలరీ షోరూం నిందితులకు సంబంధించిన రిపోర్టును సమర్పించి వారి పిటిషన్ ను తిరస్కరించేందుకు అవసరమైన చర్యలు పకడ్భందీగా తీసుకునేందుకు సమాయత్తం అయినట్టు సమాచారం. దీంతో ఏడాది పాటు ఈ ముఠా చర్లపల్లి జైలుకే పరిమితం అయినట్టయితే ఆ లోగా కేసు ట్రయల్స్ కు వచ్చే అవకాశం ఉందని, ప్రధాన కేసులో కోర్టు తీర్పు రానుందని భావిస్తున్నారు. పీఎంజే జ్యువెలరీ రాబరీ నిందితులను కట్టడి చేయడంలో భాగంగానే వారిపై పీడీ యాక్ట్ అమలు చేసినట్టుగా విశ్వనీయంగా తెలుస్తోంది.

చర్లపల్లికి…

పీడీ యాక్ట్ అమలు అయిన నేపథ్యంలో నగల షాపు దోపిడీ కేసు నిందితులను హైదరాబాద్ లోని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించేందుకు రంగం సిద్దం చేశారు కరీంనగర్ పోలీసులు. నిందితులపై పీడీ యాక్ట్ అమలులో కీలకంగా వ్యవహరించిన టౌన్ ఎసీపీ వెంకటస్వామి, టూ టౌన్ సీఐ సృజన్ రెడ్డి, పీడీ సెల్ పండరి, హెడ్ కానిస్టేబుల్ శంకర్ లను ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.