దిశ దశ, మహదేవపూర్:
తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (TGMDC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొన్ని రీచుల్లో నిబంధనల సడలింపునకు కారణమేంటీ..? నది పరివాహక ప్రాంతంలో ఓ విధంగా, ప్రాజెక్టు నిర్మాణం జరిగిన చోట మరో విధంగా వ్యవహరిస్తుండడానికి వెనకున్న ఆంతర్యం ఏంటీ..?
అంతటా…
TGMDC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇసుక రీచులు గోదావరి, మానేరు నదుల్లో కొనసాగుతున్నాయి. అయితే అన్ని రీచుల్లో మాత్రం నదుల నుండి ఇసుకను స్టాకు యార్డులకు తరలించిన తరువాత లారీల్లో లోడింగ్ చేస్తుంటారు. ప్రతి రీచు వద్ద TGMDC స్టాక్ యార్డు కోసం ప్రత్యేకంగా భూమిని లీజుకు తీసుకుని ఇసుక రవాణా చేయిస్తుంది. కాంట్రాక్టర్లకు అప్పగించినప్పటికీ అజమాయిషీ మాత్రం TGMDC అధికారులే చేస్తుంటారు. స్టాక్ యార్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా నేరుగా నదుల నుండి ఇసుకను తరలించేందుకు ఎలా సమ్మతించారన్నదే అంతుచిక్కకుండా పోతోంది. జయశంకర్ భూపాపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం బ్యారేజీ సమీపంలో ఇటీవల ప్రాంరంభం అయిన రీచుల నుండి ఇసుక రవాణా జరుపుతున్న తీరు స్థానికంగా విస్మయానికి గురిచేస్తోంది.
బ్యారేజీ వద్దకే…
అన్నారం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో మేటలు వేసిన ఇసుకను తరలించేందుకు ఏర్పాటు చేసిన రీచు వద్దకు భారీ వాహనాలు చేరుకుంటుండడం గమనార్హం. జేసీబీల ద్వారా బ్యారేజీ నిర్మాణాల మధ్య నిలువ ఉన్న ఇసుకను లారీలలో లోడ్ చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇక్కడ రీచులు ప్రారంభం అయినప్పటి నుండి కూడా దర్జాజా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు అనుమతులు ఉన్నాయని నిర్వాహకులు చెప్తుండడంతో నిజమేనని స్థానికులు అనుకుంటున్నారు. అయితే డిజాస్టర్ మేనేజ్ మెంట్ రూల్స్ ప్రకారం ఇక్కడ ఇసుక లోడ్ అవుతోందా లేదా అన్న విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. భారీ వాహనాల్లో ఇసుక లోడ్ చేసిన తరువాత గోదావరి నది నుండి బయటకు వస్తున్న క్రమంలో భూమి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. నది నుండి లారీలు బయటకు వచ్చేందుకు వ్యవసాయ భూముల్లో రోడ్ల నిర్మాణం జరిపారు. అయితే లారీల్లో తరలిస్తున్న ఇసుక కారణంగా నది తీరంలోని భూమి తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల వర్షాకాలంలో ఇసుక రవాణా కోసం వినియోగించిన నది తీర భూములు కొట్టుకపోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో అన్నారం బ్యారేజీకి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశాలు లేకపోలేదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. మరో వైపున మిషనరీ సహాయంతో బ్యారేజీ నిర్మాణాల మధ్య పేరుక పోయిన ఇసుకను లోడింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రౌండ్ లెవల్ లో డ్యామేజీ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలోనే అన్నారంలో సీఫేజీ కారణంగా వాటర్ లీకేజ్ అయిందని ఇంజనీర్లే ప్రకటించారు. వాటిని సవరించేందుకు సాంకేతిక నిపుణుల సూచనల మేరకు నడుచుకోవల్సి వచ్చిందన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు అదే అన్నారం బ్యారేజీలో భారీ ఎత్తున ఇసుక నిలువలు ఉన్నాయన్న కారణంతో మిషనరీలతో లోడింగ్ చేస్తుండడం వల్ల డ్యామేజీ అయితే ఎలా అన్నది అధికారులకే తెలియాల్సి ఉంది.
గతంలోనూ…
గతంలో కూడా అన్నారం బ్యారేజీ వద్ద ఇసుక తరలించేందుకు నేరుగా లారీలను గోదావరి నదిలోకి పంపించే వారు. వందలాది లారీలు నదిలో క్యూ కట్టి ఉన్న వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో అధికారులు లారీలను స్టాక్ యార్డు వరకే పరిమితం చేశారు. అయితే ఈ సారి మాత్రం భారీ సంఖ్యలో లారీలు నదిలో ఉండకుండా జాగ్రత్త తీసుకుంటూ ఏకకాలంలో రెండు మూడు లారీలలో ఇసుక లోడ్ చేస్తున్నారు. అయితే ఈ విధానం కూడా నిబంధనలకు విరుద్దమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

