CRIME: ఒక శవం… రెండు హత్యలు… మిస్టరీ ఛేదించిన భూపాలపల్లి పోలీసులు…

భర్త, కూతురును కడతేర్చిన భార్య

వివాహేతర బంధమే కారణం…

దిశ దశ, భూపాలపల్లి:

నేషనల్ హైవేపై అనుమానస్పద స్థితిలో లభ్యమైన ఓ మృతదేహం రెండు హత్యల నిగ్గు తేల్చింది. క్షుద్ర పూజలు చేసే ముఠాలు చంపేశారన్నట్టుగా సీన్ క్రియేట్ చేసినప్పటికీ వాస్తవమేంటో కూపీ లాగారు పోలీసులు. వివాహేతర బంధం కారణంగా కట్టుకున్న భర్తను కడతేర్చి… కన్న కూతురునూ హతమార్చిన ఘటనకు సంబంధించిన వివరాలను జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే మీడియాకు వివరించారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జున రావు, ఎస్సై శ్రీనివాస్ ల దర్యాప్తుతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందని ఎస్పీ తెలిపారు.

యువతి మృతదేహం…

భూపాలపల్లి జిల్లా కమలాపూర్ క్రాస్ రోడ్ సమీపంలోని నేషనల్ హైవే పక్కన ఆగస్టు 3వ తేదిన ఓ యువతి అనుమానస్పద స్థితిలో శవమై కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు కాటారం డీఎస్పీ  సూర్యనారాయణ, సీఐ నాగార్జున రావులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. శవం వద్ద క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఉండడంతో మొదట క్షుద్ర పూజలకు సంబంధించిన ముఠాలు ఏమైనా చంపి ఉంటాయని అనుమానించారు. జాతీయ రహదారి పక్కన క్షుద్ర పూజలు చేసే అవకాశం ఉండదని అనుమానించిన పోలీసులు ఘటనా స్థలాన్ని సునిశితంగా పరిశీలించి కీలక ఆధారాలను దొరకబట్టారు. ఆగస్టు 6న తన కూతురు 3వ తేది నుండి కనిపించడం లేదని వర్షిణి తల్లి కవిత ఫిర్యాదు చేసింది. అయితే కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని అనుమానస్పద స్థితిలో లభ్యమైన శవం గురించి పోలీసులు ఆరా తీస్తున్న క్రమంలో తన కూతురును క్షుద్ర పూజలు చేస్తున్న వారు హత్య చేసి ఉంటారని కూడా కవిత అనుమానం వ్యక్తం చేసింది. దీంతో కాటారం సబ్ డివిజన్ పోలీసులు వర్షిణి హత్యకు కారణాలు ఏంటన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఆమెను చంపేంత శతృత్వం ఎవరితోనూ లేదని తేలింది.

రెండు మరణాలు…

వర్షిణి మృతదేహం దొరికిన నేషనల్ హైవే సమీపంలో అనుమానస్పద వ్యక్తులు సంచరించిన దాఖలాలు లేకపోవడం… క్షుద్ర పూజలు చేసే వారు రోడ్డు పక్కన శవాన్ని పడేయడం ఏంటా అన్న అనుమానాలు కూడా పోలీసులను వెంటాడాయి. ఈ క్రమంలోనే ఘటనా స్థలంలో దొరికిన దండెం తాడు ఆధారంగా ఆరా తీస్తున్న పోలీసులకు రెండు నెలల్లోనే ఆ ఇంట్లో రెండు మరణాలు సంభవించాయన్న విషయం తెలిసింది. దీంతో నిందితులను వేటాడాలంటే ముందుగా కవిత ఇంటి నుండే దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించుకుని ఆ కోణంలో ఆరా తీయడం మొదలు పెట్టారు. వర్షిణి శవం దొరికిన చోట లభ్యమైన తాడు కవిత ఇంటి దండెం తాడు ఒకటే కావడంతో పోలీసుల అనుమానానికి బలం చేకూరినట్టయింది. దీంతో కవితతో పాటు వివాహేతర బంధం కొనసాగిస్తున్న జంజర్ల రాజ్ కుమార్ లపై నిఘా వేశారు. పోలీసులు అనుమానించినట్టుగా వర్షిణిని హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా కమలాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో పడేశారని నిర్దారణకు వచ్చారు. సాంకేతికతను కూడా అందిపుచ్చుకున్న పోలీసులు ఇందుకు సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా సేకరించడంతో వర్షిణి మర్డర్ మిస్టరీని ఛేదించగలిగారు.

జులైలో భర్త…

చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పల కుమారస్వామి (50) 24 ఏళ్ల క్రితం తన మొదటి భార్య చనిపోవడంతో జిల్లాలోని మల్హర్ మండలం తాడిచర్ల గ్రామానికి చెందిన మాదరవేణి కవితను రెండో వివాహం చేసుకున్నాడు. వీరి దాంపత్య జీవనంలో ఇద్దరు కూతుర్లకు జన్మనివ్వగా చిన్న కూతురు హన్సికకు వివాహం జరగగా పెద్ద కుమార్తె వర్షిణి తల్లిదండ్రులతోనే కలిసి జీవనం సాగిస్తోంది. దాదాపు ఐదేళ్ల క్రితం కుమారస్వామి పక్షవాతం బారిన పడడంతో మంచానికే పరిమితం కాగా… కవిత జంజెర్ల రాజ్ కుమార్ తో వివాహేతర బంధం కొనసాగించింది. ఈ విషయాన్ని గమనించిన భర్త కుమారస్వామితో పలుమార్లు గొడవ జరగడంతో తమకు అడ్డుగా ఉన్నాడని అతన్ని ఎలాగైనా హతమార్చాలని కవిత, రాజ్ కుమార్ లు కలిసి నిర్ణయించుకున్నారు. ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం జులై 25న వర్షిని ఇంట్లో లేని సమయంలో మంచంపై పడుకున్న కుమారస్వామి కాళ్లను కదలకుండా కవిత గట్టిగా పట్టుకోగా రాజ్ కుమార్ నోరు మూసి గొంతు నులిమి చంపాడు. అయితే కుమారస్వామి అనారోగ్యంతో మరణించాడని గ్రామస్థులను నమ్మించిన కవిత అతని అంత్యక్రియలు జరిపించి కర్మకాండలు కూడా నిర్వహించింది. కవిత భర్త నిజంగానే అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడని గ్రామస్థులు కూడా నమ్మారు. అయితే భర్త మరణం తరువాత కూడా కవిత వివాహేతర బంధం కొనసాగిస్తున్న విషయం గమనించిన పెద్ద కూతురు వర్షిణి తల్లితో చాలాసార్లు గొడవ పడింది. దీంతో వర్షిణి అడ్డు కూడా తొలగించుకున్నట్టయితే తమకు అడ్డూ అదుపూ ఉండదని భావించిన కవిత, రాజ్ కుమార్ లు ఆమెను హత్య చేసేందుకు పకడ్భందీగా పథకం రచించుకున్నారు. కుమారస్వామిని హత్య చేసి సహజ మరణంగా సమాజాన్ని నమ్మించిన నేపథ్యంలో వర్షిణిని మర్డర్ చేసినా ఏమీ కాదని అనుకున్నారు నిందితులు ఇద్దరు. ఈ విశ్వాసంతోనే ఆగస్టు 3వ తేది తెల్లవారు జామున 2 గంటల సమయంలో గాఢ నిద్రలో ఉన్న వర్షిణిని శాశ్వత నిద్రలోకి పంపించారు.

అనుమానం రాకుండా…

అయితే వర్షిణిని హత్య చేసిన నిందితులు శవాన్ని ఓ సంచిలో ఉంచి దండెం తాడును తెంచి ప్యాక్ చేసి ప్రభుత్వ ఆసుపత్రి వెనక ప్రాంతంలో ఉన్న దబ్బగట్టు గుట్ట చెట్ల పొదల్లోకి తరలించారు. రాజ్ కుమార్ వ్యవసాయ భూమి కూడా వర్షిణి మృతదేహాన్ని దాచిపెట్టిన చెట్ల పొదల వైపునే ఉండడంతో ఎవరికీ అనుమానం రాదని గమనించి రెండు రోజులకోసారి ఆమె మృతదేహాన్ని పరిశీలించేవాడు. అయితే శవం అక్కడే ఉంటే ఎప్పటికైనా బయటపడుతుందని, గ్రామస్థులు గమనిస్తే కేసుల్లో ఇరుక్కుంటామన్న భయం కవిత, రాజ్ కుమార్ లను వెంటాడింది. దీంతో ఆగస్టు 25 రాత్రి వర్షిణి శవాన్ని ద్విచక్ర వాహనంపై తరలించిన ఇద్దరు కమలాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో వేసి హత్య కేసు నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అయితే వర్షిణి కొంతకాలంగా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో పడడంతో అతనిపై ఈ హత్య కేసు పడుతుందని భావించారు. పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు వర్షిణి శవంపై పసుపు, కుంకుమ చల్లి, నిమ్మకాలు ఉంచి, శవం చుట్టూ ఇనుప మేకులు కొట్టి ఆమెను చంపింది కుద్ర పూజల కోసమేనన్న రీతిలో సీన్ క్రియేట్ చేశారు. వర్షిణీ మర్డర్ విషయం తమపై రాకుండా ఉండేందుకు రాజ్ కుమార్ యూట్యూబ్ ద్వారా పలు వీడియోలను చూసి క్షుద్ర పూజల సీన్ ఎలా క్రియేట్ చేశాడో నేర్చుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ లు కూడా పోలీసులకు చిక్కడంతో మర్డర్ మిస్టరీ చిక్కు ముడి వీడింది. అయితే కాటారం సబ్ డివిజన్ పోలీసులు వర్షిణి హత్య కేసును ఛేదించే క్రమంలో రెండు నెలల క్రితం కుమారస్వామిని హత్య చేసిన విషయం వెలుగులోకి రావడంతో ఒక శవం రెండు మర్డర్ కేసులను ఛేదించేందుకు కారణమైంది.

వెల్ డన్: ఎస్పీ కిరణ్ ఖరే

మిస్టరీ మర్డర్ కేసును ఛేదించడంతో పాటు సహజ మరణంగా చిత్రీకరించిన మరో కేసును కూడా వెలుగులోకి తీసుకవచ్చిన కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జున రావు, ఎస్సై శ్రీనివాస్ లతో పాటు దర్యాప్తులో కీలకంగా పని చేసిన పోలీసు యంత్రాంగాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అభినందించారు. నిందితులు కవిత, రాజ్ కుమార్ లను కోర్టులో హాజరు పరిచామని తెలిపారు.