మాజీ ఎమ్మెల్యే ‘చెన్నమనేని’ ఇంటికి నోటీసులు…

ఓటు హక్కు తొలగిస్తామని వెల్లడి…

దిశ దశ, వేములవాడ:

వేములవాడ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు ఇంటికి రెవెన్యూ అధికారులు నోటీసులు అంటించారు. ఆయన జర్మనీ పౌరుడేనని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఇక్కడ ఓటు హక్కును తొలగించాలని అధికారులు నిర్ణయించుకున్నారు. జర్మనీ పౌరుడిగా ఉంటూ భారతీయ పౌరసత్వం పొంది వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచిన రమేష్ బాబు ఎన్నిక చెల్లదంటూ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 2010 నుండి కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆయన పౌరసత్వ వివాదంపై ఇటీవలే హై కోర్టు స్పష్టత ఇచ్చింది. దీంతో రమేష్ బాబు భారతీయుడు కాదని తేలిపోయింది. అయితే రమేష్ బాబు వేములవాడ ఓటరుగా ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన పేరును జాబితా నుండి తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఫారం నంబర్ 7 ప్రకారం ఓటరు జాబితా నుండి చెన్నమనేని రమేష్ బాబు పేరును తొలగిస్తున్నట్టుగా నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు నోటీసులను వేములవాడలోని రమేష్ బాబు ఇంటికి అతికించడంతో పాటు పోస్ట్ ద్వారా కూడా పంపించినట్టుగా తెలుస్తోంది. ఓటు హక్కును తొలగించే విషయంలో అభ్యంతరాలు ఉన్నట్టయితే ఏడు రోజుల్లో ఆధారాలతో కూడిన వివరాలను సమర్పించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకే రమేష్ బాబు పేరును ఓటరు జాబితా నుండి తొలగించేందుకు నోటీసులు పంపించినట్టుగా రెవెన్యూ అధికారులు చెప్తున్నారు.