Kaleshwaram: మిగిలింది ఇక మూడు రోజులే… సరస్వతి పుష్కరాలు…

దిశ దశ, కాళేశ్వరం:

అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. దక్షిణాదికే తలమానికంగా నిలిచే కాళేశ్వరంలో మాత్రమే సరస్వతి నది ఉనికిని చాటుకుంటోంది. భారతదేశంలో 12 నదులకు పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. అందులో సరస్వతి నది ఒకటి కావడం విశేషం. ఇంతకాలం సరస్వతి నది పుష్కరాలు అనగానే ప్రయాగరాజ్ మాత్రమే అనుకునే వారు. కానీ కాళేశ్వరంలో కూడా సరస్వతి నది ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు. సాంప్రాదాయబద్దంగా మాత్రమే స్థానికులు సరస్వతి నదికి పుష్కరాలు నిర్వహించుకునే వారు. గంగమ్మ తల్లికి పూజలు చేసి ఒడిబియ్యం సారె పెట్టి పుష్కర నదిని ఆరాధించేవారు. ఈ సారి తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతి నది పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది. మంథని నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో తెలంగాణలో సరస్వతి నది ఉందన్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నెల 15న సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభం  కాగా 26నాటితో తొలి 12 రోజుల తంతు ముగియనుంది. దీంతో కాళేశ్వర సన్నిధిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో కాళేశ్వరం చేరుకుంటున్నారు. చత్తీస్ గడ్, ఒడిషా, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు ఉత్తరాది నుండి కూడా భక్తులు కాళేశ్వరం వస్తున్నారు. దీంతో రోజు రోజుకు కాళేశ్వరం భక్తుల రాకపోకలతో కళకళలాడుతోంది.

కాశీని మరిపిస్తున్న…

‘‘కాశీ నాన్ మరణాన్ ముక్తీ కాళేశ్వరస్య దర్శనాన్ ముక్తీ’’ అని స్కాంద పురణంలో శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి సన్నిధి గురించి కీర్తించబడింది. అయితే ఇంతకాలం కాళేశ్వరం మారుమూల ప్రాంతంగా మగ్గిపోవడంతో ఈ కేత్రం యొక్క ప్రత్యేకత బాహ్య ప్రపంచానికి అంతగా తెలియలేదు. దీంతో దక్షిణాది ప్రాంత వాసులు కూడా ఆనంద వనంలోని ప్రయాగరాజ్ లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు వెల్లేందుకు ప్రాధాన్యత ఇచ్చేవారు. అక్కడి నుండి శ్రీ విశ్వేశ్వరుడి సన్నిధిలో పూజలు చేసేందుకు కాశీకి చేరుకునే సాంప్రాదాయాన్ని పాటించేందుకే మొగ్గు చూపేవారు. కానీ దక్షిణాది రాష్ట్రాలలో కూడా కాశీ కన్న గొప్ప క్షేత్రాలు ఉన్నాయన్న విషయం వెలుగులోకి రాలేదు. కాశీ కన్న అత్యంత పుణ్యాన్ని అందించే కాళేశ్వర క్షేత్రం సరస్వతి పుష్కరాల కారణంగా సరికొత్త శోభను సంతరించుకుంది. కాశీ గంగా నది తీరంలో మాత్రమే ఘాట్లు అద్భుతంగా కనిపిస్తుంటాయి. కాశీలో నిర్మించిన ఘాట్లలో భక్తులు పూజలు పుణ్య స్నానాలతో పాటు పితృకర్మలు, దహన సంస్కాలు చేస్తుంటారు. దేశ, విదేశాలకు వచ్చే భక్తులు ఇక్కడ బోటింగ్ చేస్తూ ఘాట్లను సందర్శిస్తుంటారు. అలాంటి అద్భుత సన్నివేశం రాణి అహల్యాభాయి పరిపాలించిన మధ్యప్రదేశ్ లోని మహేశ్వరంలో సాక్షాత్కరిస్తోంది. కాశీలో గంగ, మధ్యప్రదేశ్ లోని మహేశ్వరంలో నర్మదా నది తీరంలో కనిపిస్తోంది. ఉత్తర భారతాన కాశీ, మధ్య భారతాన మహేశ్వరంలోని నది తీరాలు ఘాట్ల నిర్మాణానికి నోచుకుంటే…   దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం ఉత్సవాల సమయంలో మాత్రమే ఘాట్ల నిర్మాణం చేపడుతుంటారు. ఆ తరువాత అక్కడ అభివృద్ది ఛాయలు అంతంత మాత్రమే. త్రివేణి సంగమం, త్రిలింగ క్షేత్రం, త్రిదైవ ఆలయంగా భాసిల్లుతున్న కాళేశ్వరం కూడా నిన్న మొన్నటి వరకు అదే పరిస్థితి కనిపించేది కానీ… సరస్వతి పుష్కరాల పుణ్యమా అని కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలోని గంగా నదిని మరిపిస్తోంది. త్రివేణి సంగమ తీరాన ప్రత్యేకంగా ఘాట్లను నిర్మించడంతో పాటు 17 అడుగులు సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఇతరాత్ర నిర్మాణాలు చేపట్టడంతో కాళేశ్వరం త్రివేని సంగమ తీరం రూపు రేఖలే మారిపోయాయి. దీంతో కాళేశ్వర త్రివేణి సంగమ ప్రాంతం ప్రకృతి రమణీయతతో పాటు నూతన నిర్మాణాలు సరికొత్తగా కనిపిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి.  ఎగువ నుండి గోదావరి, ఉత్తరాది నుండి ప్రాణహిత నదులు ఇక్కడ సంగమించిన తరువాత దిగువకు బయలు దేరుతున్న గోదారమ్మ అందాలను చూస్తూ భక్తులు పరవశించిపోతున్నారు. త్రివేణిలా అల్లుకుని పోతున్న గోదావరి పరవళ్లు భక్తులను సరికొత్త ఆనందాన్ని పంచిపెడుతున్నాయి. సరస్వతి పుష్కర సరంభంతో కాళేశ్వరం సరికొత్తగా కాంతులీనుతున్న తీరు భక్తులను పారవశ్యంలో ముంచెత్తుతోంది.

కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఆహ్లదభరితమైన సన్నివేశాలు…

You cannot copy content of this page