Crime: హత్య చేసి… ఆరా తీసి… అడ్డంగా బుక్కయ్యారు…

దిశ దశ, కరీంనగర్:

ముగ్గురు కలిశారు… పథకం ప్రకారం హత్య చేశారు… తమకేమీ తెలియనట్టుగా నటించి అతని గురించి ఆరా తీశారు… దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనుమానం రావడంతో ఇంటి దొంగపై ఓ కన్నేసి అసలు విషయాన్ని రాబట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా మర్డర్ చేసిన ముగ్గురు నిందితులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేయడంతో వారి గుట్టు రట్టయింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మర్డర్ కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించారు. జులై 29న కరీంనగర్ సుభాష్ నగర్ కు చెందిన ఐలవేణి సంపత్ (45) రైల్వే ట్రాక్ సమీపంలో శవమై తేలాడు. గ్రంథాలయంలో స్వీపర్ గా పని చేస్తున్న సంపత్ మృతిపై కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు దర్యాప్తు చేపట్టింది. సంపత్ మరణానికి కారణం ఏంటన్నది తెలియకపోవడంతో పోలీసులు విభిన్న కోణాల్లో ఆరా తీశారు. చివరకు అతని భార్య రమాదేవి (38)పై అనుమానం రావడంతో పోలీసులు ఆమెపై నిఘా వేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు గురైన సంపత్ తాగుడుకు బానిసగా మారి భార్యను తీవ్రంగా కొడుతుండడంతో ఆమె కిసాన్ నగర్ కు చెందిన కర్రె రాజయ్య @ రాజు @ రాజన్న (50)తో వివాహేతర బంధం కొనసాగిస్తోంది. అయితే భర్త వేధింపులు తాళలేకపోయని రమాదేవి భర్తను ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకుంది. కర్రె రాజయ్యతో పాటు ఖాదరగూడెంకు చెందిన కీసరి శ్రీనివాస్ లను తన భర్త మర్డర్ కేసులో భాగస్వాములను చేసింది. జులై 29న రాజయ్య, శ్రీనివాస్ లు సంపత్ ను బొమ్మకల్ ఫ్లై ఓవర్ వద్దకు రమ్మని పిలిచి అక్కడ మద్యం తాగారు. సంపత్ మత్తులోకి వెల్లిన తరువాత హెర్బిసైడ్ అనే గడ్డి మందును అతని చెవిలో పోసి హత్య చేశారు. సంపత్ చనిపోయాడని నిర్దారించుకున్న రాజయ్య, శ్రీనివాస్ లు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ తరువాత రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ ముగ్గురూ కలిసి సంపత్ కనిపించడం లేదంటూ వెతకడం ఆరంభించారు. సంపత్ మృతదేహాన్ని గుర్తించిన తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా అతని భార్య రమాదేవిని అనుమానించడంతో అసలు విషయం బయటపడింది. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు  రెండు మోటారు సైకిళ్లు, మూడు సెల్ ఫోన్లు, మద్యం బాటిళ్లు, గడ్డి మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి, ఎస్సైలు తాండ్ర నరేష్, లక్ష్మారెడ్డితో పాటు పోలీసు బృందాన్ని సీపీ గౌష్ ఆలం అభినందించారు. ఈ మీడియా సమావేశంలో ఏసీపీ వెంకటస్వామి పాల్గొన్నారు.