బల్దియాకా కహానీ…
దిశ దశ, కరీంనగర్:
అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు సరికొత్త సమస్య ఎదురవుతోందా..? వివిధ పార్టీల నాయకుల మధ్య సమన్వయం ఉందన్న ప్రచారం కారణంగా శ్రేణుల్లో అయోమయం నెలకొందా..? స్వతంత్రులుగా పోటీ చేసే యోచనలో అభ్యర్థులు ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కార్పొరేటర్ అభ్యర్థుల మధ్య జరుగుతున్న ఈ చర్చ పార్టీలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపేలా కనిపిస్తోంది.
చర్చ ఇలా…
కరీంనగర్ బల్దియా ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలిచి తమ సత్తా చాటుకోవాలనుకుంటున్న కొంతమంది అభ్యర్థుల్లో అయోమయం నెలకొన్నట్టుగా కనిపిస్తోంది. టికెట్ ఆశించిన పార్టీలు అక్కున చేర్చుకోనట్టయితే మరో పార్టీవైపు అడుగులు వేయడానికి మీనామేషాలు లెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధాన పార్టీల ముఖ్య నాయకుల మధ్య సమన్వయం ఉందన్న ప్రచారం విస్తృతంగా జరగడంతో కొన్ని డివిజన్లలో పట్టున్న స్థానిక నాయకులు ఏ పార్టీవైపు వెల్లినా తాము బలైపోతామేమోనన్ను అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వివక్షకు గురై పార్టీలు మారిన కార్పొరేటర్ల గురించి కూడా ఉదాహరణగా చెప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దీంతో స్వతంత్రులుగా పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కొంతమంది నాయకులు సమాలోచనలు చేస్తున్నట్టుగా సమాచారం. ఏదో ఒక పార్టీ నుండి పోటీ చేసి గెలిచినా ఆయా పార్టీల ముఖ్య నాయకుల మధ్య నెలకొన్న సమన్వయం వల్ల వాయిస్ వినిపించే అవకాశం ఉండదని దీంతో బల్దియాలో నామమాత్రంగా మిగిలిపోతామన్న ఆందోళన కూడా వారిని వెంటాడుతున్నట్టుగా సమాచారం. దీంతో కార్పోరేషన్ ఎన్నికల్లో స్వతంత్రలుగా పోటీ చేస్తే అన్నింటా మంచిదన్న అభిప్రాయంతో కొంతమంది ఉన్నట్టుగా సమాచారం.
గెలిస్తే…
స్వతంత్ర అభ్యర్థులుగా గెల్చినట్టయితే భవిష్యత్తులో తమకు ప్రాధాన్యత కూడా ఉంటుందని, మెజార్టీ స్థానాలు అందుకోలేకపోయిన పార్టీల ముందు తమ డివిజన్ కు సంబంధించిన అభివృద్ది పనుల విషయంలో డిమాండ్ విధించే అవకాశం కూడా ఉంటుందని అభ్యర్థులు భావిస్తున్నారు. మేయర్ ఎన్నిక కోసం స్వతంత్రులుగా గెలిచిన వారే అత్యంత కీలక పాత్ర పోషించాల్సిన అవశ్యకత ఉందన్న అంచనాలతో ఉన్న స్థానిక నాయకులు ఆ దిశగానే అడుగులు వేయాలని చూస్తున్నట్టుగా సమాచారం. తమకు అన్యాయం జరిగిందని ప్రచారం చేయడం వల్ల డివిజన్లలో సానుభూతితో గెలుపు అవకాశాలు కూడా మెరుగు అవుతాయన్న అంచనాల్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.

