చివరి క్షణంలో మహిళలకు చుక్కెదురు… కన్నీరు పెట్టుకున్న పట్టణ అధ్యక్షురాలు……

జిల్లా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల రగడ

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాల జిల్లా అధికార పార్టీలో అభ్యర్థిత్వాల ఖరారు రగడ రచ్చకెక్కింది. బీఫామ్స్ తీసుకెళ్లాలని ఫోన్ రావడంతో సంబరంగా జిల్లా అధ్యక్షుని ఇంటికి చేరుకున్న మహిళా నాయకురాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. టికెట్ ఆశించిన భంగపాటుకు గురయ్యారు.

కన్నీటి పర్యతం…

జిల్లాలోని మెట్ పల్లి పట్టణ అధ్యక్షురాలు 24 వార్డు నుండి పోటీ చేయాలని భావించిన ఎదుర్తి హరితకు చివరి క్షణంలో చుక్కెదురు అయింది. బీఫారం తీసుకెళ్లాలని పోన్ రావడంతో మంగళవారం జగిత్యాల జిల్లాకేంద్రంలోని డీసీసీ అధ్యక్షుడు నందయ్య ఇంటికి చేరుకున్న హరిత పేరు మార్చి వేరే వారికి ఇచ్చారని తెలియడంతో కన్నీటి పర్యంతం అయ్యారు. పట్టణ అధ్యక్షురాలిగా పార్టీ అభ్యున్నతి కోసం సేవలందిస్తే చివరి క్షణంలో తనకు అన్యాయం చేశారంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. తనకు టికెట్ ఇవ్వకపోతో ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించిన హరిత పార్టీలో సీనియర్లను కాదని కొత్తవారి అభ్యర్థిత్వం ఎలా ఖరారు చేస్తారంటూ ప్రశ్నించారు. తనకేమి తెలియదని అదిష్టానం నుండి వచ్చిన జాబితా ప్రకారం తాను బీఫామ్స్ ఇస్తున్నానను తప్ప తన ప్రమేయం ఏ మాత్రం లేదని నందయ్య వెల్లడించారు.

జగిత్యాలలో…

జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలోని 26వ వార్డు నుండి పోటీ చేయాలని ఆశించిన పద్మజ పేరును ఖరారు చేయకుండా మరోకరి పేరును ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశారు. తమకు టికెట్ వచ్చిందని చెప్తే వచ్చామని తీరా ఇక్కడకు వచ్చిన తరువాత వేరే వారికి బీఫారం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తెలిసిందన్నారు. పార్టీ కోసం శ్రమించిన తనను కాదని వేరే వారికి టికెట్ ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేసిన పద్మజ పార్టీ తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. మరో వైపున జిల్లా అధ్యక్షుడు నందయ్య తన ఇంటి ఆవరణలోనే బీఫారం ఒకటి చింపి వేయడం సంచలనంగా మారింది.

మారుతున్న పేర్లు… 

జగిత్యాల మునిసిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను మంగళవారం ఉదయం విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ మరిన్ని మార్పులు చేసింది. తాజాగా 26వ వార్డు అభ్యర్థిగా పద్మజ స్థానంలో గొలపల్లి మాధవి లత, 27వ వార్డులో బింగి సుమ స్థానంలో జుంబర్తి గంగా లక్ష్మీ, 29వ వార్డులో తోపారుపు లావణ్యకు బదులు అరుమూల తేజస్విని, 25లో జీనథ్ పర్వీన్ కు బదులు అజార్ ఫాతిమా, 29లో అనుమల జయశ్రీకి బదులు బోలుసాని శ్రీనివాస్ పేర్లను ఖరారు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.