జగిత్యాలలో విచిత్రం…
దిశ దశ, జగిత్యాల:
మునిసిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీలో చిత్ర విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న మంత్రులు ఆ పట్టణం వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటైన ఆ నియోజకవర్గంలో ప్రచారం చేసేందుకు మాత్రం సాహసించడం లేదు. అత్యంత వైవిద్యమైన పరిస్థితులు నెలకొన్న ఆ నియోజకవర్గం ఏదంటే..?
బైపాస్…
జిల్లా కేంద్రమైన జగిత్యాలతో పాటు రాయికల్ పట్టణాల్లోనూ మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ మంత్రులు మాత్రం అటువైపు దృష్టి పెట్టడం లేదు. ఇదే జిల్లాలోని ధర్మపురి నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాలలో ప్రచారం చేసేందుకు చొరవ చూపడం లేదు. కేవలం ధర్మపురి పట్టణంలో మాత్రమే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మంత్రి అడ్లూరి జగిత్యాల మీదుగానే రాకపోకలు సాగిస్తున్నా అక్కడ ప్రచారం చేసే ప్రయత్నం చేయడం లేదు. ఈ నెల 5న జగిత్యాలలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పర్యటన ఖరారయినప్పటికీ ఎందుకనో షెడ్యూల్ రద్దయింది. ఆ తరువాత జగిత్యాలలో ప్రచారం చేసేందుకు మాత్రం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ తీసుకున్నట్టుగా కనిపించడం లేదు.
తాజాగా…
శనివారం మంత్రి, నిజామాబాద్ లోకసభ ఇంఛార్జి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కోరుట్ల నియోజకవర్గంలో పర్యటించారు. కోరుట్ల, మెట్ పల్లి మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన వెంట జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా పాల్గొని తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అయితే శనివారం నాడు మంత్రుల టూర్ మాత్రం జగిత్యాల, రాయికల్ పట్టణాల్లో కొనసాగకపోవడం గమనార్హం. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు కూడా జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేసేందుకు ముందుకు రావడం లేదని స్పష్టం అవుతోంది.
కారణమేంటీ..?
జగిత్యాల, రాయికల్ మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైన తరువాత జరిగిన రచ్చే ఇందుకు కారణమని తెలుస్తోంది. జగిత్యాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ భీపామ్స్ నిరాకరించిన సంగతి తెలిసిందే. అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ అదిష్టానం ప్రయారిటీ ఇస్తున్నతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ భవన్ లో నిర్వహించిన ఎన్నికల సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా రావడంతో జీవన్ రెడ్డి బహిష్కరించారు. అంతకు ముందు కూడా సంజయ్ కు ఇస్తున్న ప్రాధాన్యతపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయనతో అత్యంత సాన్నిహిత్యంగా ఉండే మంత్రుల దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లపై కూడా కినుక వహించారు. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో జీవన్ రెడ్డి వర్గానికి, సంజయ్ వర్గానికి టికెట్లు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు బీఫామ్స్ కూడా రావడం, చివరి క్షణంలో మరికొన్న వార్డుల్లో జీవన్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థుల పేర్లు తొలగించడంతో జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో నిరసనల పర్వం మొదలైంది. దీంతో జీవన్ రెడ్డి తన మద్దతు దారులను స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయించి వారిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన ప్రచారంలో జీవన్ రెడ్డి కంట తడి పెట్టుకున్నారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో జగిత్యాలకు వెళ్లడం అవసరమా అన్న భావనతో మంత్రులు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినట్టయితే పెద్దాయనతో తలనొప్పి, పెద్దాయన ప్రతిపాదించిన వారిని గెలిపించాలని పిలుపునిస్తే అధిష్టానం పెద్దలతో తలనొప్పి కొనితెచ్చుకోవడం అవసరమా అన్న ఆలోచనలో మంత్రులు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో జగిత్యాల, రాయికల్ మునిసిపాలీటీల వైపు పీసీసీ ముఖ్య నేతలు కూడా దృష్టి పెట్టే అవకాశాలు కూడా లేవని అర్థం అవుతోంది. ఒకప్పుడు జగిత్యాల నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే కాంగ్రెస్ పార్టీ ఇఫ్పుడు ఆ సెగ్మెంట్ పై పట్టించుకోని వైఖరి అవలంబిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది.

