అత్తింటి ఆరళ్లు భరించలేక ఆత్మహత్య…

ప్రేమించి పెళ్లి చేసుకుని కట్నం కోసం వేదింపులు…

ఆసుపత్రిలోనూ తప్పని వేదింపులు…

అత్తింటి ఆరళ్లు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, అత్తామామలు కట్నం కోసం చిత్రహింసలకు గురి చేసి చివరకు ఆమె బలవన్మరణం చేసుకునే పరిస్థితిని కల్పించారు. అనారోగ్యానికి గురైన భర్తను ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నప్పుడు కూడా ఆమెను సూటిపోటి మాటలతో వేధింపులకు గురి చేశారు. పెళ్లయిన నెల రోజుల నుండే తనను చిత్ర హింసలకు గురిచేస్తుండడం, భర్తతో పాటు మెట్టినింటికి చెందిన వారు బాధలకు గురి చేస్తుండడం తట్టుకోలేకపోయిన ఆమె ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన మమత (29)ని ఆమె బంధువైన తాండూరు మండలం చంద్రపల్లికి చెందిన కంబాల నరేష్ దాదాపు 14 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లిలో కొంతకాలం నివాసం ఉంటూ సింగరేణి వన్ ఇంక్లైన్ బావిలో ఉద్యోగం చేసేవాడు. ఇటీవలే వీరు గోదావరిఖనిలోని గంగానగర్ అద్దె ఇంటిలోకి మారారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న నెలరోజులకు మమత భర్త నరేష్, అత్త చిన్నక్క, మామ భూమయ్య, ఆడపడుచు లింగంపల్లి కవితలు కట్నం కోసం వేదింపలకు గురి చేసేవారు. తనను శారీరకంగా, మానసికంగా వేదింపులకు గురి చేస్తున్నారని మమత ఫోన్ చేసి తెలపడంతో రెండు నెలల క్రితం మమత సోదరుడు మహేష్ ద్వారా రూ. లక్ష నగదు ఇచ్చి పంపించారు. ఆ తరువాత కూడా మమతను వేదింపులకు గురి చేస్తున్నారని చెప్పుకుని రోధించేది. ఈ నెల 16న మమత తన సోదరుడు మహేష్ కు ఫోన్ చేసి తనను అత్తింటి వారు చిత్ర హింసలకు గురి చేస్తున్నారని, చంపేసే ప్రమాదం ఉందని చెప్పడంతో తాను దూరంగా ఉన్నానని మరునాడు ఉదయం వస్తానని వివరించాడు. దీంతో తన చిన్నాన్న కొడుకు అయిన లింగంపల్లి శంకర్ కు కాల్ చేసి చెప్పగా ఆటోలో వెళ్లి మంచిర్యాల సమీపంలోని నస్పూర్ కాలనీకి తీసుకెళ్లాడు. మరునాటి ఉదయం గోదావరిఖనిలోని గంగానగర్ ఇంటి యజమాని ఫోన్ చేసి నరేష్ మెట్ల వద్ద పడి ఉన్నాడని మమతకు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే వెళ్లిన మమత అత్తింటి వారికి భర్త నరేష్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తీసుకెళ్లాలని చెప్పగా కరీంనగర్ లోని మెడికోవర్ ఆసుపత్రికి తీసుకెళ్లిన మమత చికిత్స చేయిస్తోంది. మంగళవారం మెడికోవర్ ఆసుపత్రికి మమత సోదరుడు మహేష్ కూడా చేరుకోగా అక్కడే ఉన్న మమత అత్తింటి వారు ఆమెను మానసికంగా వేదింపులకు గురి చేశారు. నీ కారణంగానే తమ కొడుకు పరిస్థితి ఇలా తయారైందంటూ సూటి పోటీ మాటలు అనడంతో తట్టుకోలేకపోయిన మమత వాష్ రూంకని చెప్పి వెళ్లింది. ఆ తరువాత మహేష్ మమతకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళన చెందాడు. మద్యాహ్నం 3.35 గంటల సమయంలో మమత సోదరుడు మహేష్ కు కాల్ చేసి అత్తింటి వారి వేదింపులు తట్టుకోలేకపోతున్నానని, తాను చనిపోతున్నానని చెప్తుండగానే ఆమె అరుపులు వినిపించాయి. వెంటనే మహేష్ డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వగా పోలీసులు మమత లొకేషన్ ట్రేస్ చేశారు. ఆమె తీగలగుట్టపల్లిలోని హనుమాన్ నగర్ రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్నట్టుగా గుర్తించారు. పోలీసులతో పాటు మహేష్ కూడా ఘటనా స్థలానికి చేరుకోగా మమత పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుని చనపోయింది. మృతదేహాన్ని కరీనంగర్ సివిల్ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని ప్రొబేషనరీ ఐపీఎస్ ఆఫీసర్ సోహం సునీల్, కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ లు పరిశీలించారు. మమత తండ్రి లింగంపల్లి పోషం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త నరేష్ తో పాటు అత్తింటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.