జన జీవనంలోకి బడే దామోదర్ కూడా..?

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకత్వం తెలంగాణ డీజీపీ సమక్షంలో జనజీవనంలో కలిసేందుకు రంగం సిద్దమైంది. మంగళవారం ఈ మేరకు మీడియా ముందుకు రానున్నారు కీలక నేతలు. మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, కేంద్ర కమిటీ సభ్యులు మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహ రెడ్డి అలియాస్ గంగన్నతో పాటు 40 మంది మావోయిస్టులు బాహ్య ప్రపంచంలోకి వచ్చారు.

బడే దామెదర్ కూడా…

తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ నేటి మీడియా సమావేశంలో జన జీవనంలో కలుస్తున్నట్టుగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా పోలీసు ఉన్నతాధికారులకు ఇప్పటికే కలిసినట్టుగా సమాచారం. కొంత కాలంగా దామోదర్ బయటకు వస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ ఆయన మాత్రం లొంగిపోయేందుకు వస్తున్నట్టుగా అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా ఆయన కూడా బయటకు వచ్చారని తెలుస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకపోయినట్టేనని పోలీసు వర్గాలు అంటున్నాయి.

తెలంగాణ ఫ్రీ…

తెలంగాణ రాష్ట్ర కమిటీలో బాధ్యతలు చేపట్టిన మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకత్వం అంతా కూడా బయటకు వచ్చినట్టేనని తెలుస్తోంది. రాష్ట్ర కమిటీ బాధ్యులుగా ఉన్న వారిలో కొంత మంది ఎదురు కాల్పుల్లో మరణించగా మరికొంతమంది నాయకులు జనజీవనంలోకి వచ్చేశారు. రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న బడే దామోదర్ కూడా జనజీవనంలోకి వస్తుండడంతో మావోయిస్టు రహిత రాష్ట్రంగా పోలీసు అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. మావోయిస్టు పార్టీ ఉనికి లేకుండా చేయడంలో లొంగుబాట్లను ప్రొత్సహించి పొరుగు రాష్ట్రాల కంటే ముందే తెలంగాణ పోలీసులు సక్సెస్ అయ్యారు. దండకారణ్య అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కగార్ మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ నిరంతరం ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లు కొనసాగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిలిచిపోలేదు. మార్చి 31 నాటికి మావోయిస్టు పార్టీ రహిత భారత్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలనుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ లొంగుబాట్లను ప్రొత్సహించే పనిలో నిమగ్నం అయ్యారు. దీంతో తెలంగాణ రాష్ట్ర కమిటీ ముఖ్య నాయకులంతా బాహ్య ప్రపచంలోకి రావడంతో దేశంలో అన్ని రాష్ట్రాలకంటే ముందే తెలంగాణ నక్సల్ రహిత రాష్ట్రం కానుంది. ఇక్కడి వారు ఇతర రాష్ట్రాలలో వివిధ క్యాడర్ లలో పని చేస్తున్నప్పటికీ తెలంగాణా రాష్ట్ర కమిటీలో ఉన్న బాధ్యులంతా కూడా బయటకు రావడంతో ఆ కమిటీ ఉనికి లేకుండా పోయిన నేపథ్యంలో మావోయిస్ట్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణ ఆవిర్భంచనుంది.