మేడిగడ్డ ఎఫెక్ట్… కోతకు గురవుతున్న భూములు…

వారం రోజుల్లో సమగ్ర నివేదికలు…

ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం…

దిశ దశ, సిరొంచ:

తెలంగాణ రాష్ట్రం అవసరాల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తమకు తీరని నష్టం వాటిల్లుతోందని మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సమయంలో ముంపునకు గరైన భూములకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదని రైతులు వాపోతున్నారు. మొదటి విడత జరిగిన సర్వేలో పరిహారం అందించినప్పటికీ అదనంగా ముంపునకు గురవుతున్న దాదాపు 300 ఎకరాల భూమికి నేటికీ పరిహారం చెల్లించలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని గతంలో పలుమార్లు నిరసనలు చేపట్టిన నామమాత్రపు చర్యలతోనే సరిపెట్టారని పూర్తి స్థాయిలో పరిహారం మాత్రం అందలేదని రైతులు చెప్తున్నారు.

భూముల పరిస్థితి…

మరో వైపున మేడిగడ్డ బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లోని గోదావరి పరివాహక ప్రాంత భూములు వరదల సమయంలో కోతకు గురవుతున్నాయని దీనివల్ల ఏటేటా వ్యవసాయ భూములు గోదావరి నదిలో కలిసిపోతున్నాయని రైతులు చెప్తున్నారు. గతంలో కూడా భూములు కోతకు గురైనప్పటికీ ఈ స్థాయింలో నష్టం వాటిల్లిన సందర్భాలు తక్కువేనన్నారు. తమ జీవనాధారం అయిన భూములు అంతర్థానం అవుతున్న తీరు ఆందోళన కల్గిస్తున్నదని రైతులు చెప్తున్నారు. 30 నుండి 50 మీటర్ల మేర పంట భూములు వర్షా కాలంలో కోతకు గురవుతుండడంతో ఈ ప్రాంత రైతుల ఉపాధి దెబ్బతింటున్నదని చెప్తున్నారు. సిరొంచ తాలుకాలోని గోదావరి పరివాహక గ్రామాలతో పాటు మేడిగడ్డకు దిగువన ఉన్న అంకీసా, ఆసరెల్లి వరకు కూడా భూములు కోతకు గురవుతున్నాయని వివరించారు.

రివ్యూ మీటింగ్

మేడిగడ్డ బ్యారేజ్ కారణంగా నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ గడ్చిరోలి జిల్లా కలెక్టర్ అవిశ్యంత్ పాండా తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల అధికారులు రివ్యూ నిర్వహించారు. మాజీ మంత్రి శోభాథాయ్ సిరొంచ తాలుకాకు చెందిన బాధిత రైతులు పడుతున్న ఇబ్బందులను జిల్లా అధికార యంత్రాంగానికి సమగ్రంగా వివరించారు. తెలంగాణ అవసరాల కోసం నిర్మించకున్న కాళేశ్వరం విషయంలో మహారాష్ట్ర రైతులు నష్టపోతున్నారన్నారు. గోదావరి వరదల కారణంగా ఏటేటా కోతకు గురవుతున్న వ్యవసాయ భూములను కాపాడేందుకు ప్రొటెక్షన్ వాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే అదనంగా ముంపునకు గురవుతున్న భూముల గురించి మరోసారి సర్వే చేయించి బాధిత రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ కారణంగా వ్యవసాయ భూములు కోల్పోయిన రైతులకు పరిహారంతో పాటు సర్టిఫికెట్లు కూడా ఇవ్వాలని కోరారు. రైతుల డిమాండ్ మేరకు వారం రోజుల్లోగా మేడిగడ్డ వల్ల నష్టపోతున్న భూములకు సంబంధించిన వివరాలతో పాటు కోతకు గురైన భూములు, భూములు ఇచ్చిన రైతులకు ధృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల అధికారులు హామీ ఇచ్చారు. వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదికలు తయారు చేసి ఇచ్చినట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని గడ్చిరోలి జిల్లా అధికారులు ప్రకటించారు. ఈ సమావేశానికి మేడిగడ్డ బాధిత రైతులు, గడ్చిరోలి జిల్లాలోని అధికారులు, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు కూడా హాజరయ్యారు.