ఓటర్ల సరికొత్త పల్లవి… స్థానికులకే మద్దతు…

దిశ దశ, కరీంనగర్:

పోలింగ్ సమీపిస్తున్నా కొద్ది ఓటర్ల మనోగతం మారుతోందా..? పట్టు బిగించాలనుకున్న పార్టీలకు షాకిచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా..? స్థానికులకే మద్దతు ఇవ్వాలన్న చర్చ సాగుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని డివిజన్లలో సరికొత్త చర్చ మొదలైంది. ఓటర్లు తమ డివిజన్ పరిధిలోని వారికే ఓట్లు వేయాలన్న నినాదాన్ని తెరపైకీ తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది.

స్థానికులకే మద్దతు…

స్థానికేతరులకు మద్దతు ఇవ్వవద్దని తమ డివిజన్ పరిధిలోని వారికే అండగా నిలబడాలన్న చర్చ కొన్ని డివిజన్లలో మొదలైంది. తమ వారికి ప్రాధాన్యం ఇచ్చినట్టయితే ఎన్నికల తరువాత డివిజన్లలోని సమస్యలను పరిష్కరించుకునేందుకు సులువు అవుతుందని భావిస్తున్నారు. దీంతో పక్కా లోకల్ అన్న నినాదాన్ని బలంగా వినిపించాలని భావిస్తున్నట్టుగా సమాచారం. డివిజన్ పరిధిలోని ఓటరుగా ఉండి బరిలో నిలిచిన వారికే అండగా నిలబడాలన్న వాదనలు వినిపిస్తున్నారు కొన్ని కాలనీల్లోని జనం. పార్టీ ఏదైనా సరే, ఎవరికి నచ్చిన వారికి ఓటు వేసినా సరే కానీ ఆ అభ్యర్థి మాత్రం తమ డివిజన పరిధిలోని వ్యక్తి అయి ఉండాలన్న ఆకాంక్షతోనే నిర్ణయం తీసుకోవాలని అనకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని డివిజన్లలో ఇందుకు అనుగుణంగా ఓటర్లు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నాన్ లోకల్ అభ్యర్థలను ఆదరించాల్సిన అవసరం లేదన్న భావనకు వచ్చిన ఓటర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.

పార్టీలకు షాక్…

బల్దియా పరిధిలోని కొన్ని డివిజన్లలో తెరపైకి వచ్చిన స్థానికత నినాదం వల్ల పార్టీల అంచనాలు తలకిందలయ్యే ప్రమాదం లేకపోలేదు. బలమైన అభ్యర్థులుగా భావించి పోటీకి దింపినప్పటికీ స్థానికులు కాకపోవడం వల్ల వారి గెలుపోటములపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. మంచిర్యాల చౌరస్తా సమీప ప్రాంతాల్లోని కొన్ని డివిజన్ల ఓటర్లు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రధాన పార్టీల అంచనాలు తలకిందులయ్యే ప్రమాదం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నాన్ లోకల్ అభ్యర్థులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ క్యాంపెయిన్ తీవ్ర రూపం దాల్చినట్టయితే అభ్యర్థుల తలరాతలు మారిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.