రికార్డుల్లో పేర్కొన్నా మాయాజాలం చేసిందెవరూ..?
దిశ దశ, కరీంనగర్:
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇష్టారాజ్యం నడుస్తోందా..? కలెక్టర్లు, కోర్టులు ఆదేశించినా తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారా..? రేకుర్తి భూముల వ్యవహారాన్ని సునిశితంగా పరిశీలిస్తే అసలు నిజం వెలుగులోకి రానుంది. శాఖాపరంగా విచారణ జరింపించి బాధ్యులపై చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
రేకుర్తి భూముల్లో…
కరీంనగర్ సమీపంలోని రేకుర్తి శివార్లలోని భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సంబంధిత శాఖా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడానికి కారణం ఏంటన్నదే అంతు చిక్కకుండా ఫోతోంది. గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఉన్న రేకుర్తి శివార్లలోని పలు సర్వే నంబర్లకు సంబంధించిన వివరాల్లో ప్రొహిబిటెడ్, అండర్ కవర్డ్ కోర్టు స్టే అని రాసి ఉన్నప్పటికీ క్రయ విక్రయాలు జరిపించడం విడ్డూరం. ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్న భూముల లావాదేవీలు ఎలా జరిపారన్న విషయంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ భూములకు సంబంధించి ఇరు పార్టీలు హై కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో స్టే విధించినట్టుగా స్పష్టం అవుతోంది. సదరు భూముల్లో ఎలాంటి లావాదేవీలు జరపకూడదని కోర్టు స్టే విధించడంతో పాటు ఇరు పార్టీలు కూడా కోర్టు తీర్పును అనుసరించి నడుచుకోవల్సి ఉంటుంది. కానీ గంగాధర రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మాత్రం ప్రొహిబిటెడ్ అండర్ కవర్డ్ కోర్ట్ స్టే అని రాసి ఉన్నప్పటికీ అధికారులు రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఎలా ఇచ్చారన్నదే మిస్టరీగా మారింది. గంగాధర రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో రేకుర్తికి సంబందించిన ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన డాక్యూమెంట్లు వందల సంఖ్యలో జరిగినట్టుగా తెలుస్తోంది. చట్టాన్ని ధిక్కరించి మరీ రిజిస్ట్రేషన్ అధికారులు ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన డాక్యూమెంట్లను ఎలా ఆమోదించారన్న విషయంపై చర్చ జరుగుతోంది.
తీర్పు తరువాత…
రిజిస్ట్రేషన్ అధికారులు ప్రొహిబిటెడ్ భూముల్లో లావాదేవీలు జరపడం వల్ల భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందన్నది వాస్తవం. కోర్టు తీర్పు అనుకూలంగా ఇచ్చిన వారి పేర్లను రెవెన్యూ అధికారులు రికార్డుల్లో చేర్చడంతో పాటు పట్టాదారు పాసు పుస్తకాలను ఇవ్వవలసి ఉంటుంది. అలాగే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా ప్రొహిబిటెడ్ జాబితా నుండి తీర్పు వచ్చిన సర్వే నెంబర్లను మినహాయించాల్సిన బాధ్యత ఉంటుంది. అప్పుడు కోర్టు తీర్పు ద్వారా భూములు పొందిన వారు క్రయ విక్రయాలు జరుపుకునే అవకాశం ఉంటుంది. అయితే కోర్టు వివాదం ఉన్న భూములు ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్న సమయంలో రిజిస్ట్రేషన్లు చేస్తుండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొక తప్పని పరిస్థితులు ఉంటాయి. ప్రొహిబిటెడ్ జాబితాలోని భూముల్లో జరుగుతున్న క్రయ విక్రయాల వల్ల కొనుగోలు చేసిన వారు ఆ స్థలాలను ఆక్రమించుకుని నిర్మాణాలు చేయనున్నారు. కొంతమంది వాటిని వేరే వారికి విక్రయించడంతో లింక్ డాక్యూమెంట్లు కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఇంతకాలం కోర్టు తీర్పు కోసం ఎధురు చూసిన వారు మళ్లీ కోర్టు మెట్లు ఎక్కి తమ భూములను కోర్టు ఆదేశాలను ధిక్కరించి రిజిస్ట్రేషన్ చేశారని దీంతో తమకు అన్యాయం జరిగిందని మళ్లీ సదరు కోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల బాధితులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందన్న విషయం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రొహిబిటెడ్ జాబితాను విస్మరించి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిపిన లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపి ముందుగానే చర్యలు తీసుకున్నట్టయితే అన్ని విధాల లాభదాయకంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపున కోర్టు తీర్పు ప్రకారం భూములను స్వాధీనం చేసుకునేందుకు వెల్లినట్టయితే శాంతి భద్రతల సమస్య కూడా ఉత్పన్నం కావడం ఖాయం. ఈ నేపథ్యంలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో ముందు నుండే కఠినంగా వ్యవహరించినట్టయితే అన్ని విధాల సముచితంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
కలెక్టర్, సీపీ హెచ్చరిక…
అయితే ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన వ్యవహారంపై జిల్లా అధికార యంత్రాంగం కూడా దృష్టి సారించింది. నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో ఎలాంటి లావాదేవీలు జరిపినా కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రొహిబిటెడ్ జాబితాను అనుసరించి లావా దేవీలు జరిపేందుకు అనుమతించాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సమన్వయంతో నిషేధిత భూముల వివరాలను సిద్దం చేసుకోవాలని కలెక్టర్ ఆధేశించారు. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లోని భూముల రిజిస్ట్రేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పమేలా సత్పతి హెచ్చరించారు. నిబందనలకు విరుద్దంగా రిజిస్ట్రేషన్లు జరిపినట్టయితే బాధ్యులైన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ప్రకటించారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలోని పలు స్టేషన్లలో రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు.

