ఆచారానికి ప్రాధాన్యత ఇచ్చిన సీపీ…

సాంప్రాదాయం పాటించిన గౌష్ ఆలం…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ సీపీ గౌష్ ఆలం వినాయక నిమజ్జనం రోజున తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ సందర్భంగా తన ప్రత్యేకతను చాటుకుని ఆకట్టుకున్నారు. సమాజంలోని అన్ని వర్గాల ఆచారాలను పాటించే విషయంలో ఆయన ఇచ్చిన ప్రాధాన్యత పలువురిని ఆకట్టుకుంది. ఉన్నతాధికారిగా అన్ని మతాలను గౌరవించే విషయంలో సీపీ ఆచరణలో పెట్టిన తీరు భక్తులను అబ్బురపరిచింది.

డ్యూటీలో…

వినాయక నిమజ్జనం సందర్భంగా కరీంనగర్ భారీ ఎత్తున శోభాయాత్ర నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతున్న విషయం అందరకీ తెలిసిందే. ఏటేటా పెరిగిపోతున్న వినాయక ప్రతిమల నిమజ్జనం కోసం కరీంనగర్ సమీపంలోని మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లిలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శోభాయత్ర నుండి మొదలు నిమజ్జనం వరకూ ఆవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా బలగాలను మోహరించారు. వివిధ విభాగాలకు చెందిన పోలీసు యంత్రాంగం కరీంనగర్ నగరమంతా కూడా భారీ బందోబస్తు నిర్వహించింది. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా ఉంటేందుకు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిమగ్నమైన పోలీసు యంత్రాంగం పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడంతో పాటు సూచనలు అందించేందుకు నగరమంతా కలియతిరిగారు సీపీ. ఈ సందర్భంగా యూనిఫాం, షూస్ వేసుకుని భద్రతా చర్యలను పర్యవేక్షించారు.

ప్రత్యేకత..

శుక్రవారం సాయంత్రం కరీంనగర్ లోని వివిధ వినాయక మంటపాల వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారితో పాటు విఘ్నేశ్వరుని పూజలో పాల్గొన్న సీపీ హిందూ ఆచారాలను పాటించేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే వినాయక ప్రతిమల నిమజ్జనంలోనూ పాల్గొన్న సీపీ షూస్ విడిచి మరీ విగ్రహాలను నిమజ్జనం చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం మాత్రం అన్ని మతాలను ఆదరించడం తన అభిమతమని చేతల్లో చూపించిన తీరు ఆదర్శంగా నిలిచింది.