దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామలు చోటు చేసుకున్నాయి. తక్కువ డివిజన్లలో గెలవడంతో మేయర్, డిప్యూటీ పీఠంపై ఆశలు వదులుకున్నారన్న అంచనాలను తలకిందులు చేస్తూ క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. బీజేపీకి అతి ఎక్కువ స్థానాలు రావడం, స్వతంత్రులు, ఆ పార్టీ రెబెల్స్ కూడా అటువైపే మొగ్గు చూపుతుండడంతో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి రాలేమని చాలించుకుందని భావించారు అంతా. కానీ శనివారం హుటాహుటిన క్యాంప్ ఏర్పాటు చేయడం, కార్పొరేటర్లను తరలించడంతో ఊహించని పరిణామాలు ఏవో చోటు చేసుకుంటున్నాయి.
సీఎం సీరియస్…
కరీంనగర్ కార్పొరేషన్ ను చేజిక్కించుకోవాలని మొదటి నుండి చెప్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి తయారైందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్థానిక నాయకత్వంపై అసహనం వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. బల్దియాలో స్పష్టమైన ఆధిక్యం సాధించాలన్న ఆలోచనతో అధిష్టానం ఉంటే క్షేత్ర స్థాయి నాయకత్వం వైఫల్యం కారణంగా చేజేతులారా పార్టీ అభ్యర్థుల ఓటమి కొని తెచ్చుకున్నారన్న అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎలాగయినా కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవల్సిందేనని సీఎం స్ఫష్టం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు హుటాహుటిన క్యాంపు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.
సమీకరణాలు ఇలా…
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 14 మంది, బీఆర్ఎస్ పార్టీకి చెందిన తొమ్మిది మంది, ఎంఐఎం కార్పొరేటర్లు ముగ్గురితో పాటు ఇండిపెండెంట్లు ఆరుగురి మద్దుతు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి లభ్యమైనట్టుగా తెలుస్తోంది. ఎక్స్ అఫిఫియో సభ్యులను కూడా కలుపుకున్నట్టయితే మ్యాజిక్ నంబర్ కు అటు ఇటుగా చేరుకుంటామని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసినట్టుగా తెలుస్తోంది. ఏ మాత్రం అవకాశం అందివచ్చినా తమ సమీకరణాలు సక్సెస్ అవుతాయన్న ఆలోచనతోనే క్యాంపు ఏర్పాటు చేసినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా క్యాంప్ ఏర్పాటు చేయడంతో కరీంనగర్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

