BRS PARTY: నాన్న కోసమే ఉద్యమంలోకి… అంతా ఆ ఇద్దరే చేస్తున్నారు.. కల్వకుంట్ల కవిత

ఆయన చుట్టూ దుష్ట చతుష్టయం…

అంతా ఆ ఇద్దరే చేస్తున్నారు…

నేరేళ్ల పాపం సంతన్నదే…

కవిత సంచలన వ్యాఖ్యలు…

దిశ దశ, హైదరాబాద్:

బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి. బావ హరీష్ రావు, కజిన్ బ్రదర్ సంతోష్ రావులపై మాటల తూటాలు పేల్చడం సంచలనంగా మారింది. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో అన్న కేటీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేసినప్పటికీ విమర్శనాస్త్రాలు మాత్రం హరీష్, సంతోష్ లపైనే సంధించడం గమనార్హం.

నాన్న కోసమే వచ్చాం…

ఉద్యమ ప్రస్థానంలో స్వరాష్ట్ర కల సాకారం చేయడం కోసం తాను కాని అన్న కేటీఆర్ కానీ నాన్నకు చేదోడుగా నిలిచామని కవిత వ్యాఖ్యానించారు. అప్పటి నుండి పార్టీలోనే ఉన్న తాను తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయడంలో తనవంతు పాత్ర పోషించానని ప్రకటించారు. ఇటీవల కాలంలో నాన్న చుట్టూ చేరిన కొంతమంది ఒత్తిళ్ల కారణంగానే తన సస్పెన్షన్ కు కారణమన్నారు. తాను రాసిన లేఖ బయటకు వచ్చిన విషయంపై పార్టీలో ఎలాంటి చర్యలు లేవని, కనీసం వారి నుండి వివరణ కూడా కోరలేదు కానీ… తన సస్పెన్షన్ విషయంలో మాత్రం సంజాయిషీ కూడా కోరకుండా నిర్ణయం తీసుకున్నారని కవిత ఆరోపించారు. కావాలనే తనపై చర్యలు తీసుకుని తనను ఊరి తీశారని ఘాటుగా స్పందించిన ఆమె మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావులపై డైరక్ట్ అటాక్ చేయడం గమనార్హం.

నేరెళ్ల పాపం…

నేరేళ్ల ఇసుక మాఫియా కారణంగా ఒకరు చనిపోతే ఆందోళనలకు దిగిన వారిలో ఏఢుగురిని చిత్ర హింసలకు గురి చేయడానికి కారణం సంతోష్ రావేనని దీనివల్ల తన అన్న కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొవలసి వచ్చిందన్నారు. సంతోష్ రావు కారణంగానే ఏడుగురు అమాయకుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయరైందన్నారు. మరో వైపున మెగా కృష్ణారెడ్డితో కలిసి మోఖిలాలో భారీ బడ్జెట్ తో 700 విల్లాలు నిర్మిస్తున్నారని, సంతోష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యారని ఆ కారణంగానే టానిక్ లిక్కర్ మాల్ పై దాడులు జరిగినా ఆ కేసు తెరమరుగైందని ఆరోపించారు. తెలంగాణకు హరిత హారం కార్యక్రమం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని కేసీఆర్ ప్రయత్నిస్తే సంతోష్ రావు గ్రీన్ ఛాలెంజ్ పేరిట సెలబ్రిటీలచే ప్రమోట్ చేయించుకున్నాడని ఈ వ్యవహారంలో మరో కోణం దాగి ఉందన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సంతోష్ రావు కలిసి చదువుకున్నారన్నారు. సంతోష్ రావు నిర్వహిస్తున్న టీ న్యూస్ ఛానెల్ లో తన వార్తలు ప్రసారం కూడా చేయలేదని, ఇటీవల కాలంలో నమస్తే తెలంగాణలో కూడా తన వార్తలు ప్రచూరితం చేయడం లేదన్నారు.

కాళేశ్వరంలో…

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి కారణం హరీష్ రావేనని ఈ వ్యవహారంలో తన తండ్రి కేసీఆర్ కు ఏ మాత్రం సంబంధం లేదని కవిత కుండబద్దలు కొట్టారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు హరీష్ రావు సొంతగా డబ్బులు సమకూర్చాడని ఇవి కాళేశ్వరంలో చేసిన అవినీతి డబ్బులేనని ఆరోపించారు. కేటీఆర్ ను ఓడించేందుకు కూడా హరీష్ రావు ప్రత్యర్థులకు రూ. 60 లక్షలు పంపించారన్నారు. ఉద్యమ పార్టీ ప్రారంభించినప్పుడు హరీష్ రావు లేరని ఆ తరువాత చేరారని వ్యాఖ్యానించిన కవిత ఆయన ట్రబుల్ షూటర్ కాదని బబుల్ షూటర్ అంటూ మండిపడ్డారు. ట్రబుల్స్ క్రియేట్ చేసేదే హరీష్ రావేనన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి హరీష్ రావు ఫ్లైట్ లో ప్రయాణించిన తరువాతే కుట్రలకు తెరలేపారని దుయ్యబట్టారు. హరీష్ రావు కారణంగానే ఈటల, జగ్గారెడ్డి, విజయశాంతి, మైనంపల్లితో పాటు పలువురు పార్టీ నుండి వెల్లిపోయారని, దుబ్బాక, హుజురాబాద్ లలో బీఆర్ఎస్ ఓటమికి కూడా ఆయనే కారణమన్నారు.

విచ్ఛిన్నం కావడం…

తమ కుటుంబం విచ్ఛిన్నం కావడమే వారి లక్ష్యమని ఈ కారణంగానే తనను పార్టీ నుండి బయటకు వెల్లగొట్టేందుకు తమవంతు ప్రయత్నాలు చేశారని కవిత అన్నారు. తమ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేయాలన్న లక్ష్యంతోనే తన తండ్రి చుట్టూ చేరిన కొంతమంది కుట్ర చేస్తున్నారని… ఈ రోజు తనకు ఎదురైన పరిస్థితి భవిష్యత్తులో తన తండ్రి, అన్నలకు ఎదురు కాక తప్పదని కవిత హెచ్చరించారు. వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు. హరీష్ రావు, సంతోష్ రావులు మేకవన్నె పులులని వారిని విశ్వసించకూడదని సూచించారు.

అన్నపై…

ఇకపోతే అన్న విషయంలో కూడా కవిత తన అసహనాన్ని ప్రదర్శించారు. తాను నాన్నకు రాసిన లేఖ బయటకు వచ్చిన విషయంలో చొరవ తీసుకోవాలని కోరి 103 రోజులైనా స్పందించలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

రాజీనామా…

బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కవిత ప్రకటించారు. రెండు దశాబ్దాలుగా పార్టీ అభ్యున్నతికి పాల్పడిన తాను తన తల్లికి దూరంగా ఉండడం బాధిస్తోందన్నారు. తనను సస్పెన్షన్ చేసిన విషయంలో మనోవేదనకు గురవుతున్నానని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. అయితే తాను మాత్రం ఏ పార్టీలో చేరేది లేదని కవిత స్పష్టం చేశారు.