మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై ఒత్తిళ్లు…
దిశ దశ, జగిత్యాల:
ఏడు పదుల వయసు దాటినా నేటికీ ప్రజా క్షేత్రంలోనే ఉండడానికే ప్రాధాన్యత ఇస్తారా నేత. నాలుగు దశాబ్దాలకుపైగా అనుబంధం పెనవేసుకున్న పార్టీలో ఎదురవుతున్న పరిస్థితులను తిప్పి కొట్టేందుకు సమాయత్తం కాక తప్పదా..? అనుచరుల నిర్ణయానికి అనుగుణంగా నడుచుకునేందుకు మొగ్గు చూపుతారా..? పొమ్మనలేక పొగపెట్టినట్టుగా వ్యవహరిస్తున్న అధిష్టానానికి షాక్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతారా..? ఇప్పుడిదే చర్చ ఇంటా బయట సాగుతోంది.
జగిత్యాల…
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నేతల్లో ఒకరైన తాటిపర్తి జీవన్ రెడ్డి కూడా ఒకరు. జగిత్యాల కేరాఫ్ అడ్రస్ గా ఎదిగిన ఈ నేత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రొత్సహించడంలో బాగంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో సాన్నిహిత్యంగా ఉంటోంది అదిష్టానం. స్థానిక ఎన్నికల్లో కూడా ఆయనకే ప్రాధాన్యత ఇచ్చిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. చివరకు మునిసిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో కూడా జీవన్ రెడ్డికి ప్రాధాన్యత దక్కలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరుపై కినుక వహించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఒత్తిళ్లు…
తాటిపర్తి జీవన్ రెడ్డికి సొంత పార్టీలో ఎదురవుతున్న ప్రతికూలతపై ఆయన అనుచరుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. నామినేటెడ్ పదవులే అయినా మునిసిపల్ ఎన్నికలే అయినా పెద్దాయనకు అంతగా ప్రయారిటీ దక్కడం లేదన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. మునిసిపల్ కౌన్సిలర్ ఎన్నికల సమయంలో పార్టీతో ఏ మాత్రం సంబంధం లేని వారికి టికెట్లు కెటాయించిన తీరుపై జీవన్ రెడ్డితో పాటు ఆయన అనచరులు కూడా అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అయినా హై కమాండ్ మొగ్గు మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వైపే అన్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటుంది. మునిసిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలకు ముందు క్యాంపు ఏర్పాటు చేసిన క్రమంలో డాక్టర్ సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డితో, జీవన్ రెడ్డి డిప్యటీ సీఎం భట్టీ, మంత్రి అడ్లూరితో భేటి అయ్యారు. ఆ తరువాత ఆయన ప్రతిపాదనలకు మాత్రం అధిష్టానం సానుకూల నిర్ణయం తీసుకోలేదు. దీంతో జీవన్ రెడ్డి అనుచరులు ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. పార్టీ మారాల్సిందేనని, వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీకి గుణ పాఠం చెప్పే విధంగా ముందుకు సాగాల్సిందేనని జీవన్ రెడ్డి అనుచరులు పదే పదే చెప్తున్నారు. దీంతో ఆయన పార్టీ ఫిరాయించాలా లేక ఇందులోనే కొనసాగాలా అన్న విషయంపై తర్జన భర్జన పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే జీవన్ రెడ్డికి బీఆర్ఎస్, బీజేపీల నుండి ఆహ్వానాలు అందాయన్న ప్రచారం అయితే సాగుతున్నప్పటికీ అలాంటిదేమీ లేదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి పార్టీ ఫిరాయిస్తానంటే తానే వారి ఇంటికి వెళ్లి బీజేపీలో చేరాలని స్వయంగా ఆహ్వానిస్తానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటించారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవన్ రెడ్డి టచ్ లోకి వచ్చారని పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని మాట ఇచ్చారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు మాత్రం జీవన్ రెడ్డి మాత్రం పార్టీ మారే యోచనలపై స్పష్టమైన వైఖరిని ప్రకటి్ంచలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారన్న వాదనలు వినిపిస్తున్నా అనుచరగణం ఒత్తిళ్లను అంతర్మథనంలోకి నెడుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తాడో పేడో…
కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో తాడో పేడో తేల్చుకోవాలని, ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు గమనిస్తే భవిష్యత్తులో నామ మాత్రంగా కూడా ప్రాధాన్యత లేకుండా పోయే ప్రమాదం ఉందని జీవన్ రెడ్డి అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎటు వైపు మొగ్గు చూపుతారన్నదే హాట్ టాపిక్ గా మారింది. అనుచరుల నిర్ణయానికి అనుగుణంగా ముందుకు సాగితే రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్న వారూ లేకపోలేదు.

