జగిత్యాల కిస్సా…. సీనియర్ నేత గుస్సా…

గాంధీ భవన్ నుండి వాకౌట్…

దిశ దశ, జగిత్యాల:

కాంగ్రెస్ పార్టీ సొంతింటి నుండే వ్యతిరేకతను ముటగట్టుకుంటోంది. సీనియర్ నేత నుండే ప్రతికూలతను ఎదుర్కొంటున్న తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. తాజాగా గాంధీ భవన్ సాక్షిగా ఆ నాయకుడు వాకౌట్ చేయడం రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది.

మునిసిపల్ ఎలక్షన్స్…

త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల వేదికగా సీనియర్ నేత జీవన్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాల్సిందేనని, పార్టీ టికెట్లు పదేళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన వారికి ఇవ్వాల్సిందేనని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందుకు కౌంటర్ గా డాక్టర్ సంజయ్ కుమార్ కూడా జీవన్ రెడ్డిపై విమర్శలు చేశారు. దీంతో జీవన్ రెడ్డి మరోసారి సంజయ్ పై విరుచకపడ్డారు. జగిత్యాలకు చెందిన ఇద్దరు ముఖ్య నేతల మధ్య బహిరంగంగా విమర్శలు సాగుతున్న నేపథ్యంలో బుధవారం గాంధీ భవన్ లో జరిగిన సమావేశం రచ్చకు దారి తీసినట్టయింది. గత వారం పది రోజులుగా జగిత్యాలలో నెలకొన్న పరిణామాలను గమనించి అధిష్టానం దృష్టి సారించకుండా లోకసభ నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహించింది. ఈ క్రమంలో నిజామాబాద్ లోకసభ పరిధి సమావేశం బుధవారం రాత్రి గాంధీ భవన్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి జగిత్యాల నియోజకవర్గం నుండి మాజీ మంత్రి జీవన్ రెడ్డి మొదట హాజరు కాగా, కొద్ది సేపటి తరువాత సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా వచ్చారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి గాంధీ భవన్ నుండి వాకౌట్ చేయడం సంచలనంగా మారింది.

రాజ్యాంగ విరుద్దం…

ఈ సందర్భంగా ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాటిపర్తి జీవన్ రెడ్డి తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన డాక్టర్ సంజయ్ పార్టీ ఫిరాయించారన్న ఆరోపణలు రాగా స్పీకర్ విచారణ జరుపుతున్నారని అయితే తాను ఏ పార్టీలో చేరలేదని అఫిడవిట్ కూడా ఇచ్చిన ఎమ్మెల్యే గాంధీ భవన్ సమావేశానికి ఎలా హాజరయ్యారంటూ ప్రశ్నించారు. రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించడం సరికాదని పార్టీ ఫిరాయింపులు మొదటి నుండి వ్యతిరేకిస్తున్న విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. అంతేకాకుండా తాను గాంధీ భవన్ లో జరుగుతున్న సమావేశం నుండి వెల్లిపోతున్నానని కూడా స్పష్టం చేశారు. దీంతో మరోసారి జగిత్యాల వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.

బీఆర్ఎస్ నజర్…

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గాంధీ భవన్ సమావేశానికి హాజరు కావడం… ఈ విషయాన్ని బాహాటంగానే జీవన్ రెడ్డి వ్యతిరేకించడంతో బీఆర్ఎస్ పార్టీకి మరో అస్త్రాన్ని అందించినట్టయిందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికే ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో కోర్టులను ఆశ్రయించడం, ప్రజా క్షేత్రంలో అధికార పార్టీని ఇరుకున పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డి వాకౌట్ చేసిన విషయాన్ని హెలెట్ చేసే అవకాశం లేకపోలేదు.

హై కమాండ్..?

పార్టీ ఫిరాయింపు విషయంపై ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా వ్యతిరేకేస్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డిని హై కమాండ్ బుజ్జగిస్తుందా లేక ఆయనకే ప్రాధాన్యత ఇస్తుందా అన్నది తేలాల్సి ఉంది. మునిసిపల్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి అనుయూలకే టికెట్లు కెటాయిస్తుందా లేక సంజయ్ చెప్పిన నాయకులకూ కూడా అవకాశం కల్పిస్తుందా అన్నదే అంతు చిక్కకుండా పోతోంది. గత వారం పది రోజులుగా జగిత్యాలలో ఇరువురు నాయకుల మధ్య కొనసాగుతున్న విమర్శలు, తాజాగా గాంధీ భవన్ నుండి జీవన్ రెడ్డి వాకౌట్ అంశాలను పరిగణనలోకి తీసుకుని హైకమాండ్ ఎలా వ్యవహరిస్తోందోనన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.