సీనియర్ కాంగ్రెస్ నేత ప్రచారం తీరు…
దిశ దశ, జగిత్యాల:
నిన్న మొన్నటి వరకు ఆయన భుజాన మూడు రంగుల కండువా వేసుకుని ప్రజల్లో తిరిగే వారు. కాంగ్రెస్ పార్టీ విధానాలే లక్ష్యంగా ప్రచారం చేసేవారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆ సీనియర్ నేత స్వతంత్ర అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తున్నారు. భుజంపై వేసుకున్న కండువా తీసేసి స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.
జగిత్యాల…
జగిత్యాల రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ కాంగ్రెస్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి అధిష్టానం తీరును తప్పు పడుతూ మునిసిపల్ ఎన్నికల్లో తన స్వరాన్ని వినిపిస్తున్నారు. బీఫామ్స్ ఇచ్చే విషయంలో స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరిగిందన్న వాదనలు వినిపించిన జీవన్ రెడ్డి తన అండదండలతో బరిలో నిలిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు కార్యరంగంలోకి దిగారు. జగిత్యాల మునిసిపాలిటీలో 30 భీఫామ్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వర్గానికి, 20 జీవన్ రెడ్డి వర్గానికి కెటాయించాలని పీసీసీ నిర్ణయించింది. దీంతో జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించిన జీవన్ రెడ్డి వర్గానికి చుక్కెదరయింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విధానాలకు అనుగుణంగా పని చేస్తానని పదే పదే చెప్తున్న జీవన్ రెడ్డి ఈ సారి మునిసిపల్ ఎన్నికల్లో స్వతంత్రుల తరుపున ప్రచారం చేయడం మొదలు పెట్టారు. గురువారం పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేపట్టిన జీవన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థుల గుర్తులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.

దొర దగ్గర పడి ఉండాలా..?
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేయి ఇచ్చిందని అందుకే స్వతంత్రుల తరుపున పోటీ చేయాల్సి వస్తోందని, నిన్న మొన్నటి వరకు కారు గుర్తుపై తిరిగిన నాయకులు ఇఫ్పుడు కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారని ఆరోపించారు. సుదీర్ఘ కాలంగా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరిగిందంటున్న జీవన్ రెడ్డి గుర్తులను పట్టించుకోకుండా స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. 40 ఏళ్లుగా తాను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ తనను కాదని ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తోందని దీంతో పార్టీలో దశాబ్దాలుగా ఉంటున్న వారి కోసం పని చేయాల్సి వస్తోందన్నారు. జగిత్యాల పట్టణ అభివృద్ది కోసం తాను చేసిన అభివృద్ది గురించి వివరిస్తూనే పరోక్షంగా సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై విమర్శలు చేస్తున్నారు. స్థానిక విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయిస్తే దానిని మూసివేయించారన్నారు. ముదిరాజులను బీసీఏలో కలపాలని, ఇప్పుడు దొర దగ్గర పడి ఉండాలా..? అని ఆయన ప్రశ్నించారు. బీసీ బిడ్డ అయిన బోగ శ్రావణిని ఇబ్బందులకు గురి చేసి పార్టీ నుండి వెళ్లగొట్టారని ఆరోపించారు.

