కాంగ్రెస్ నేతల ఫోటోలకు చెక్…
దిశ దశ, జగిత్యాల:
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ మారేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్న ఆయన తన ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్లు లేకుండా చర్యలు చేపడుతున్నారు. జీవన్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటోలు ముద్రించి ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం మొదలు పెట్టారు. ఇప్పటికే జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. తాను పార్టీ మారడం ఖాయం అయిపోయిందని… కాంగ్రెస్ పార్టీలో మాత్రం కొనసాగేది లేదని తేల్చి చెప్పారు. దీంతో జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంలో వెనక్కి తగ్గే అవకాశాలు లేవని స్పష్టం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం జీవన్ రెడ్డి ఇంటి వద్ద తీసుకుంటున్న చర్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయిన ఆయన నివాసం వద్ద వాటిని పూర్తిగా తొలగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరి ఫోటోలను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సోమవారం సాయంత్రం తొలగించేశారు. ఇప్పటి వరకు ఉన్న ఫ్లెక్సీలలో ఉమ్మడి జిల్లా మంత్రుల ఫోటోలను కూడా ప్రింట్ చేయించారు. వాటన్నింటిని తొలగించాలని నిర్ణయించడంతో జీవన్ రెడ్డి వెనక్కి తగ్గేదేలా అన్న సంకేతాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇస్తున్నారని స్థానికంగా చర్చ మొదలైంది.

కొత్త ఫ్లెక్సీలు…
ఇకపోతే సోమవారం సాయంత్రం వరకు జీవన్ రెడ్డి ఇంటి ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడిన ఫ్లెక్సీలు ఉండగా వాటిని తొలగించిన తరువాత కొత్త ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తున్నారు. వీటిలో ఒక్క జీవన్ రెడ్డి ఫోటో మాత్రమే ముద్రించి ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మీ ‘‘జన జీవనుడు’’ అంటూ ఫ్లెక్సీల్లో ముద్రించారు. దీంతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తన ఇంటి ముందున్న ఫ్లెక్సీల్లోనూ అవకాశం లేదని చెప్పకనే చెప్పినట్టయింది.


