దిశ దశ, జగిత్యాల:
అక్కడ రెండు జాతీయ పార్టీల్లో వర్గ విబేధాలు కొనసాగుతున్నాయి. సీనియర్, జూనియర్ మధ్య ఆదిపత్య పోరు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో పెద్దల నడుమ పంచాయితీ నడుస్తుంటే… బీజేపీలో పెద్ద నాయకులు, సామాన్యుల మధ్య వైరం నెలకొంది.
జీవన్ వర్సెస్ సంజయ్…
మాజీ మంత్రి జీవన్ రెడ్డికి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు మధ్య వర్గ విబేధాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయింపులను బాహాటంగానే వ్యతిరేకిస్తున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ కాంగ్రెస్ కు అనుకూలంగా నడుచుకుంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో టికెట్ల కెటాయింపు విషయంలో జీవన్ రెడ్డి వర్గం సంజయ్ వర్గంపై దుమ్మెత్తిపోసింది. కౌన్సిలర్లచే క్యాంపులు కొనసాగించిన తరువాత అధిష్టానం జోక్యం చేసుకుని సంజయ్ వర్గానికి ఛైర్ పర్సన్ పదవి, జీవన్ రెడ్డి వర్గానికి వైస్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. తన వర్గానికి అన్యాయం చేశారని జీవన్ రెడ్డి కినుక వహించినప్పటికీ పీసీసీ నాయకులు మాత్రం కిమ్మనలేదు. ఓ దశలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారన్న ప్రచారం జరిగినప్పటికీ కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్నారు జీవన్ రెడ్డి. 2014 ఎన్నికలప్పటి నుండి జీవన్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ లు ప్రధాన ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో జీవన్ రెడ్డికి మింగుడు పడని పరిస్థితి తయారైంది. అధిష్టానం తీరును జీవన్ రెడ్డి తరుచూ తప్పు పడుతున్నప్పటికీ ఆయన డిమాండ్ కు అనుకూలంగా మాత్రం నిర్ణయాలు సాగడం లేదన్నది బహిరంగ రహస్యం. దీంతో జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరినట్టుగా స్పష్టం అవుతోంది.
కమలంలో ముసలం…
ఇకపోతే బీజేపీ పార్టీలోనూ ఆదిపత్య పోరు కొనసాగుతోంది. దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న నాయకులకు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. మునిసిపల్ ఎన్నికల్లో తమకు టికెట్లు ఇవ్వకుండా కొత్త వారికి ఇవ్వడంపై దుమారమే చెలరేగింది. దీంతో సీనియర్లంతా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి రెబెల్ అభ్యర్థులుగా బరిలో నిలిచి గెలిచారు. అయితే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారని అధిష్టానం రెబెల్ అభ్యర్థులను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అయితే మునిసిపల్ ఎన్నికల్లో గెలిచిన రెబెల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులంతా కలిసి బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావును కలిశారు. తమను కాదని కొత్త వారికి టికెట్లు ఇచ్చిన వారిలో చాలామందికి డిపాజిట్లు కూడా దక్కలేదని, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు. గురువారం మునిసిపాలిటీకి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ నాయకులచే సమవేశం ఏర్పాటు చేశారు. దీంతో పార్టీ నుండి సస్పెండ్ కు గురైన నాయకులంతా బోగ శ్రావణి ఇంటి ఆవరణలో సభ ఏర్పాటు చేయడమేంటని నిరసనగా దిగగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తన ఇంటిపై దాడి చేశారని, తమను చంపుతామని బెదిరించారని బోగ శ్రావణి ఆరోపించారు. అయితే పార్టీ కార్యాలయం ఉండగా బోగ శ్రావణి ఇంటి ఆవరణలో సమావేశం ఎలా ఏర్పాటు చేశారంటూ సస్పండ్ కు గురైన నాయకులు ప్రశ్నించారు. బీజేపీలోనూ వర్గ పోరు కొనసాగుతుండడం అధిష్టానానికి తలనొప్పిగా మారిందనే చెప్పాలి.
స్తబ్దతలో బీఆర్ఎస్…
సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం, ఆయన అనుచరులకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత దక్కుతుండడంతో బీఆర్ఎస్ పార్టీలో స్తబ్దత నెలకొన్నట్టయింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే ముఖ్య నాయకుడు జగిత్యాలలో లేకపోవడంతో క్యాడర్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. జగిత్యాల రాజకీయాల్లో వైవిద్యమైన పరిస్థితులు ఏర్పడ్డట్టయింది.

