జీవన్ రెడ్డి అనుచరుల ఆగ్రహం…
దిశ దశ, జగిత్యాల:
మునిసిపల్ టికెట్ల కెటాయింపుపై జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి అన్యాయం చేశారంటూ పీసీసీ చీఫ్, సీఎం, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లపై మండిపడుతున్నారు. మంగళవారం ఉదయం జగిత్యాల మునిసిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితా విడుదల అయిన తరువాత పట్టణంలోని ఇందిరా భవన్ వద్దకు చేరుకున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డిని కలిసిన తరువాత కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.
బీఆర్ఎస్ వారికి…
ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్న వారికి కాంగ్రెస్ టికెట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటూ జగిత్యాల కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న జీవన్ రెడ్డి అనచరులకు అన్యాయం చేశారంటూ వారు మండిపడుతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహిస్తూ బీఆర్ఎస్ పార్టీ వారికి ప్రాధాన్యత ఇవ్వడం సరైంది కాదని, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలు మారుతూ సీనియర్ కాంగ్రెస్ నాయకులపై వివక్ష చూపే విధంగా వ్యవరిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమకారులను అణిచివేసిన సంజయ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పంచన చేరి సీనియర్లకు తీరని నష్టం చేకూర్చుతున్నారని ఆరోపించారు. ఇటీవల ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ జగిత్యాల పర్యటనలో జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన తీరును కూడా జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకులు దుయ్యబట్టారు.
కండువా విసిరి…
స్థానిక నాయకుడు ఒకరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు పార్టీ కండువా కప్పే ప్రయత్నం చేయగా ఆయన తన భుజాలపై వేసిన కండువాను తీసి కింద పడేయడం గమనార్హం.
ఆయన నిర్ణయమే…
జగిత్యాలలో నెలకొన్న పరిణామాలపై తుది నిర్ణయం జీవన్ రెడ్డిదేనని ఆయన సూచనల మేరకే నడుచుకుంటామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అయితే జీవన్ రెడ్డి తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ముందుకు సాగుతామని పలువురు ప్రకటించారు.

