దిశ దశ, హైదరాబాద్:
రవాణా శాఖలో అవినీతి అధికారిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. అయితే ఏసీబీ అధికారుల దాడులకు ముందు రోజే సదరు అధికారి తన ఇంట్లో అక్రమ ఆస్తులకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా జాగ్రత్త పడిన తీరు సరికొత్త చర్చకు దారి తీసింది.
కాన్ఫిడెన్షియల్…
మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కిషన్ ఆదాయానికి మించి ఆస్తులు గడించారన్న ఆరోపణల నేఫథ్యంలో ఏసీబీ అధికారులు సమగ్రంగా ఆరా తీశారు. ఆయనతో పాటు బినామీల పేరిట ఆస్తులు ఏమైనా ఉన్నాయా అన్న వివరాలను కూడా సేకరించారు. అత్యంత రహస్యంగా సాగే ఈ టాస్క్ లో పని చేసే అధికార యంగ్రాంగానికి తప్ప ఈ విషయం వారితో కలిసి పనిచేసే సహచరులకు కూడా తెలియకుండా ఏసీబీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అత్యంత విశ్వసనీయంగా సాగే ఈ విచారణకు సంబంధించిన టీమ్ ఇంఛార్జి, ఏసీబీ చీఫ్ టీమ్ లో పని చేస్తున్న వారికి మాత్రమే తెలుస్తుంది. అయితే సదరు అవినీతి అధికారి ఇంటిపై దాడులు ఎప్పుడు చేస్తారోనన్న విషయంపై కింది స్థాయి ఉద్యోగులకు ఎవరికీ తెలియదు. పంచులుగా అవసరమున్న అధికారులను కూడా సంబంధిత జిల్లా కలెక్టర్ కు లేఖ రాసి డిప్యూట్ చేసుకుంటారు తప్ప వారికి కూడా దాడి ఎవరిపై చేస్తున్నారన్న విషయాన్ని లీక్ చేసే అవకాశం లేదు. అయితే బోయినపల్లిలో ఉన్న మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ కిషన్ ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు సోదాలు చేసినప్పుడు షాకింగ్ విషయాలు తెలిశాయి.

ముందు రోజే…
మంగళవారం ఉదయం కిషన్ ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఇంట్లో సోదాలు చేసినప్పుడు ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన డాక్యూమెంట్లు ఏవీ లభ్యం కానట్టుగా తెలుస్తోంది. దీంతో ఏసీబీ అధికారులు ఆయన మొబైల్ ఫోన్ చెక్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కిషన్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆభరణాలు సికింద్రాబాద్ లోని ఓ బంగారం షాపులో ఉంచినట్టుగా మొబైల్ ఫోన్ లో లభ్యమైన ఓ స్లిప్ ద్వారా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ ఆభరణాలు కూడా సోమవారమే సదరు షాపుకు పంపించినట్టుగా యజమాని ఏసీబీ అధికారులకు చెప్పినట్టుగా సమాచారం. అలాగే డీటీసీ కిషన్ ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా ముందు రోజే బంధువుల ఇంటికి పంపించి దాచిపెట్టినట్టుగా ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. ఓ వైపున ఆభరణాలు, మరో వైపున ఆస్థుల డాక్యూమెంట్లను ఆయన ముందు రోజే వేరే చోటకు తరలించారంటే ఏసీబీ తనపై గురి పెట్టిందన్న సంకేతాలు అందుకున్నారా లేక యాధృచ్ఛికంగానే ఇతర ప్రాంతాలకు తరలించారా అన్న విషయంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఉన్నట్టుండి డీటీసీ అభరణాలను, ఆస్తుల పత్రాలను వేరే చోట్లకు తరలించడం వెనక మర్మమేమిటన్న చర్చ సాగుతోంది.

30 ఏళ్లలో…
1994లో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్ పెక్టర్ (AMVI)గా రవాణా శాఖలో జాయిన్ అయిన కిషన్ 30 ఏళ్లలో సంపాదించిన ఆస్తుల వివరాలు సేకరించిన ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోయి ఉంటారు. బహిరంగ మార్కెట్లో వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఆయన కూడ బెట్టుకున్న తీరు సంచలనంగా మారింది. మంగళవారం కిషన్ ఇంటితో పాటు 11 చోట్ల దాడులు చేసిన ఏసీబీ అధికారులు ఆయన ఆస్తుల వివరాలను తేల్చారు. నిజామాబాద్ లోని లహరీ ఇంటర్నేషనల్ హోటల్ లో 50 శాతం వాట, రాయల్ ఓక్ ఫర్నిచర్ స్థలం 3 వేల చదరపు గజాలు, అశోకా టౌన్ షిప్ లో 2 ప్లాట్లు, 10 ఎకరాల కమర్షియల్ ల్యాండ్, సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలంలో 31 ఎకరాల వ్యవాస భూమి, 4 వేల చదరపు అడుగుల పాలీ హౌజ్, షెడ్, రెండు ఇన్నోవా క్రిస్టా, హోండా సిటీ, 1000.4 గ్రామలు బంగారు ఆభరాణాలు, రూ. 1.37 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించారు ఏసీబీ అధికారులు. రిజిస్ట్రేషన్ వాల్యూయేషన్ ప్రకారం రూ. 12. 72 కోట్ల మేర ఆస్తుల విలువ చేస్తాయని ఏసీబీ పేర్కొంది. అయితే బహిరంగ మార్కెట్ లో మాత్రం వీటి విలువు వందల కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బినామీలపైనా..?
అయితే డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ (DTC) కిషన్ వద్ద లభ్యమైన ఈ ఆస్తులతో పాటు బినామీల పేరిట కూడబెట్టాడా అన్న కోణంలో కూడా ఏసీబీ ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కిషన్ పై కేసు నమోదు చేసిన ఏసీబీ ఆయన ఆస్తులను కాపాడేందుకు బాసటగా నిలిచిన వారు ఎవరూ అన్న వివరాలను కూడా సేకరిస్తే మరింత అక్రమ ఆదాయం బయట పడే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కిషన్ పై ఏసీబీ ఇప్పటికే లోతుగా దర్యాప్తు చేసిన తరువాతే దాడులు చేసినందున బినామీల జాబితా కూడా అందుబాటులో ఉండి ఉంటుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
గుబులు…
ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు రవాణా శాఖపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టినట్టుగా స్పష్టం అవుతోంది. సరిహద్దు ప్రాంతాల చెక్ పోస్టులతో పాటు పలువురు అధికారులను ట్రాప్ చేయడం, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ చేయడం విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తోంది. దీంతో ఏసీబీకి తరువాతి టార్గెట్ ఎవరై ఉంటారోనన్న గుబులు అధికారుల్లో మొదలైందని రవాణా శాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది.

