Godavari: తెరపైకి ఇచ్చంపల్లి… మంత్రి ప్రకటనతో సరికొత్త చర్చ…

దిశ దశ, కరీంనగర్:

గోదావరి నదిపై మరో భారీ ప్రాజెక్టుకు రంగం సిద్దం అవుతోందా..? గోదావరి, కావేరీ నదుల అనుసంధానం కార్య రూపం దాల్చనుందా…? ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కాలగర్భంలో కలిసిపోయిందని భావిస్తున్న ఈ సమయంలో  ఇచ్చంపల్లి అంశం మళ్లీ తెరపైకి వస్తుండడం గమనార్హం. తాజగా కరీంనగర్ లో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మించే విషయంపై ఆలోచిస్తామని ప్రకటించారు. దీంతో మళ్లీ ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణం గురించి చర్చ మొదలైంది.

బ్రిటీష్ కాలం నాటి… 

1860లో బ్రిటీష్ పాలకులకు ఫ్రెంఛ్ ఇంజనీర్ల ద్వారా ఇచ్చంపల్లి వద్ద బహుళార్ద సాధక ప్రాజెక్టు నిర్మించాలని తలపెట్టారు. కొంతమేర ఆనకట్టతో పాటు ఇతరాత్ర నిర్మాణాలు కూడా జరిపారు. భారీ సైజు బండరాళ్లను వేసి కొంతమేర ఆనకట్ట కట్టడంతో పాటు ఇంజనీర్ల క్వార్టర్ల కోసం ప్రత్యేకంగా నిర్మాణాలు చేపట్టారు. సుమారు వెయ్యి టీఎంసీల సామర్థ్యంతో 125 మీటర్ల ఎత్తుతో 112.77 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవల్ (FRL)తో నిర్మించాలని తలపెట్టారు. ఫ్రెంచ్ ఇంజనీర్లు ఇచ్చంపల్లి వద్దకు చేరుకుని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణాలను పర్యవేక్షించగా, ఇక్కడ భారీ జల విద్యుత్ కేంద్రం కూడా నిర్మించాలన్న ప్రతిపాదన కూడా ఉండేది. మధ్యప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుండి ప్రవహించే ఇంద్రావతి నది గోదావరి నదిలో కలుస్తున్న ప్రాంతానికి దిగువన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాళేశ్వరం వద్ద మహారాష్ట్ర నుండి వచ్చి కలుస్తున్న ప్రాణిహిత, దమ్మూరు వద్ద కలుస్తున్న ఇంద్రావతి నదుల నీటిని నిలువ చేసి బహుళార్ద సాధక ప్రాజెక్టు నిర్మించాలని భావించారు. ఆసమయంలో ప్రపంచాన్ని భయపెట్టిన ప్లేగు వ్యాధి ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్న ఇంజనీర్ల కుటుంబాలను కూడా వెంటాడింది. ప్లేగు బారిన పడిన ఇంజనీర్లు మృత్యువాత పడడంతో వారిని ఇచ్చంపల్లి సమీపంలోనే సమాధి చేశారు. ఆ తరువాత ఈ ప్రాజెక్టు నిర్మాణం గురించి బ్రిటీష్ పాలకులు పట్టించుకోలేదు. స్వాతంత్ర్యం అనంతరం కూడా ఇచ్చంపల్లిని నిర్మించాలన్న ప్రతిపాదనలు పలుమార్లు తెరపైకి రాగా సర్వేలు కూడా జరిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన అడవులు ఇచ్చంపల్లి బ్యాక్ వాటర్ లో ముంపునకు గురవుతున్నాయి. ఎక్కవ నష్టం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎదురవుతుండడం, పర్యావరణ సమస్య కూడా ఎదుర్కొవల్సి వస్తోందన్న అభ్యంతరాలతో ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని వాయిదా వేశారు. చాలాకాలం వరకు కూడా మహారాష్ట్రలోని చంద్రపూర్, తెలంగాణాలోని వరంగల్, మద్యప్రదేష్ లోని జగ్దల్ పూర్ లలో ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే కార్యాలయాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే 1998లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సి హెచ్ విద్యాసాగర్ రావు ఉన్నప్పుడు గోదావరి జలాలను వినియోగంలోకి తీసుకరావాలని ఇచ్చంపల్లి నుండి పాదయాత్ర కూడా చేపట్టారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చంపల్లి నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ చత్తీస్ గడ్, మహారాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవల్సిన పరిస్థితి వచ్చింది. నెహ్రు, ఇందిరాలు ప్రధానిగా ఉన్న సమయంలో సర్వేలు జరిపినప్పటికీ పొరుగు రాష్ట్రాల నుండి వ్యతిరేకత రావడంతో అర్థాంతరంగా ఈ ప్రాజెక్టును నిలిపివేయాల్సి వచ్చింది. అయితే ఇచ్చంపల్లి ఆనకట్ట ఎత్తును 95 మీటర్లకు తగ్గించాలన్న ప్రతిపాదనను పరిశీలించినప్పటికీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేకపోయింది. ఆ తరువాత ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఎగువ ప్రాంతానికి నీటిని తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయితే ఇప్పుడు మళ్లీ ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మాణం గురించి తెరపైకి రావడం సరికొత్త చర్చనీయాంశంగా మారింది.

కావేరీ లింక్…

దేశంలోని నదులను అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఇందులో భాగంగా ఇచ్చంపల్లి నుండి కావేరీ నదికి అనుసంధనం చేసి మిగులు జలాలను తరలించాలన్న విషయంపై ప్రతిపాదనలు కూడా జరిగాయి. 2008లో జరిగిన ఈ ప్రపోజల్స్ ను ఇటీవల కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేసింది. అయితే ఈ విషయం ఆ తరువాత మరుగున పడిపోగా, తాజాగా తెలంగాణ ప్రభుత్వం తెరపైకి ఈ విషయాన్ని తీసుకస్తుండడం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ ఒకటి కుంగుబాటుకు గురి కావడంతో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నీటిని దిగువకు వదిలేయాలని సూచించింది. ఒకే డిజైన్ లో కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించారని మూడు బ్యారేజీలలో నీటిని నిలువ ఉంచకూడదని NDSA సూచించింది. గత రెండు సీజన్లుగా కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని తెలంగాణ ప్రభుత్వం స్టోర్ చేయడం లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చంపల్లి నుండి నీటిని మళ్లించే ప్రక్రియకు సంబంధించిన అంశం గురించి చర్చ జరిపింది. దీంతో మళ్లీ కావేరీ నది అనుసంధానం విషయం తెరపైకి వచ్చినట్టయిది. గోదావరి, కావేరీ నది అనుసంధానం ప్రతిపాదనపై కరీంనగర్ లో మంత్రి శ్రీధర్ బాబు ఆలోచిస్తామని ప్రకటించడం గమనార్హం. మరో వైపున అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మడి హట్టి వద్ద నిర్మాణం విషయంలోనూ వెనక్కి తగ్గే యోచనలో లేనట్టుగా స్పష్టం అవుతోంది. ఎన్నికలకు ముందు ప్రకటించినట్టుగానే ఇప్పుడు కూడా తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణం చేసి తీరుతామని పదే పదే ప్రకటిస్తున్నారు.