దిశ దశ, కరీంనగర్:
మ్యాజిక్ ఫిగర్ కు చేరువ వరకూ చేరుకున్న బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు పార్టీలన్ని ప్రయత్నించాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలతో పాటు ఏఐఎఫ్బీ, స్వతంత్రులందరిని ఒక దరికి చేర్చి పోటీ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మ్యాజిక్ ఫిగర్ 35కు చేరుకున్న తరువాత కూటమి పార్టీల మధ్య వచ్చిన భిన్నాభిప్రాయాలతో కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయం జెండా ఎగిరింది. అయితే ప్రత్యర్థి పార్టీలన్ని కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ వేసిన వ్యూహాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసినా ప్రమాణ స్వీకారం సమయానికి అదంతా విచ్ఛిన్నమైపోయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీపై పై చేయి సాధించాలన్న ప్రయత్నంలో సెల్ఫ్ గోల్ అయిందన్నది వాస్తవం. మొదటి నుండి బీజేపీ కూడా వ్యూహాత్మంగా వ్యవహరించినట్టయితే అసలు కూటమి ప్రయత్నాలకే అస్కారం ఉండకపోయేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఫలితాల తరువాత…
30 స్థానాల్లో గెలిచిన బీజేపి మరో నాలుగు స్థానాల్లో గెలిచినట్టయితే ప్రత్యర్థి పార్టీలకు ఏ మాత్రం అవకాశం చిక్కేది కాదు. మరో నలుగురి మద్దతు అవసరం కాగా అప్పటికప్పుడు బీజేపీ రెబెల్స్ ను పార్టీలో చేర్చుకోగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిని కూడా జాయిన్ చేసుకుంది. అప్పటికే తమకు అవసరమైనంత బలాన్ని సమకూర్చుకున్నామన్న ధీమాతో ఉన్న బీజేపీ ప్రత్యర్థి పార్టీలకు అవకాశం లేకుండా చేయాలన్న ఆలోచనతో ముందుకు సాగకపోవడంతో కూటమి పార్టీలు శిబిరానికి అవకాశం ఇచ్చినట్టయింది. కరీంనగర్ కార్పొరేషన్ లో AIFBకి చెందిన ఇద్దరు, స్వతంత్రులు ఎనిమిది మంది గెలిచారు. దీంతో వీరిలో బీజేపీ రెబెల్స్ ముగ్గురు కాగా 10వ డివిజన్ నుండి గెలిచిన కొమురయ్య డిమాండ్ నెరవేర్చేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ససేమిరా అన్నారు. దీంతో ఇద్దరు రెబెల్స్, AIFB అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థిని బీజేపీలో చేర్పించుకున్నారు. మొత్తం 34 మంది కార్పొరేటర్లు, ఎంపీ ఓటుతో విజయం ఖాయమని అంచనా వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సమీకరణాలు మార్చేందుకు కూటమిగా ఏర్పడితే ఎలా ఉంటుందని భావించి క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. స్వతంత్రులు, AIFB అభ్యర్థుల మద్దతు కూడగట్టుకున్నట్టయితే తాము సక్సెస్ అవుతామని అనుకుంది. బీజేపీ క్యాంపునకు AIFB అభ్యర్థిని కాకుండా ఆమె కుటుంబ సభ్యులకు తరలించడం కూడా తమకు లాభించిందని కాంగ్రెస్ అనుకుంది. ఈ మేరకు పావులు కదిపి మ్యాజిక్ ఫిగర్ 35కు చేర్చుకోవడంలో సఫలం అయింది. ఫలితాలను వెలువడిన వెంటనే బీజేపీ తనకు కావల్సినంత మెజార్టీతో సరిపెట్టకుండా అదనంగా మరో ఇద్దరు ముగ్గురు స్వతంత్రులను, AIFB పార్టీకి చెందిన మరో కార్పొరేటర్ ను తమ పార్టీలో చేర్చుకున్నా… 15వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతిని క్యాంపునకు తరలించినా కాంగ్రెస్ పార్టీ అసలు కార్యరంగంలోకి దూకే అవకాశం లేకుండా పోయేది. మరో ఇద్దరు స్వతంత్రుల మద్దతు కూడగట్టుకున్నట్టయితే బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ జట్టుకట్టే అవకాశం లేకుండా పోయేది. మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నామన్న సంతృప్తితో బీజేపీ నాయకులు ఉంటే వారికి మింగుడు పడకుండా చేసేందుకు ఇతర పార్టీలు మరో శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో రెండు రోజుల పాటు కరీంనగర్ కార్పొరేషన్ లో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. అంచనాలు తారుమారై కూటమి కార్పొరేషన్ పీఠాన్ని అందుకుంటుందా అన్న విషయంపై తర్జనభర్జనలు సాగాయి. ఏది ఏమైనా కరీంనగర్ మేయర్ బలం ఉందని సరిపెట్టుకోకుండా ప్రత్యర్ధి పార్టీలు పుంజుకోకుండా ఉండేందుకు కూడా వ్యూహ రచన చేసుకోక తప్పదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

