నాలుగు దశాబ్దాల అనుబంధానికిక గుడ్ బై..!

దిశ దశ, జగిత్యాల:

నాలుగు దశాబ్దాల అనుబంధానికి ఆ సీనియర్ నేత గుడ్ బై చెప్పబోతున్నారు. అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలపై అసహనంతో ఉన్న ఆయన అవమనాలు ఎదుర్కొంటున్నానని మదన పడిపోతున్నారు. ఒడిదొడుకులు ఎదురైనా పార్టీలోనే కొనసాగిన ఆయనిప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. పార్టీ మారడం ఖాయమని కుండబద్దలు కొట్టి మరీ చెప్తున్న ఆ నేతను మెప్పించి ఒప్పించే ప్రయత్నం చేసినా ససేమిరా అంటున్నారు.

జగిత్యాల…

జగిత్యాలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. 42 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ మారడం దాదాపు ఖాయం అయింది. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత జగిత్యాల విషయంలో పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై కినుక వహించినప్పటికీ తనకు ప్రాధాన్యత తగ్గదన్న నమ్మకంతో ముందుకు సాగారు జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండడం, తన వర్గాన్ని పక్కనపెడుతుండడంతో జీవన్ రెడ్డి పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో అయితే మరీ దారుణమైన పరాభావాన్ని చవిచూడాల్సి వచ్చిందన్న వేదన జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరగణంలో పెరిగిపోయింది. అవమానాలు, పరాభవాలు చవి చూస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అవసరం లేదని ఆయన అనుచరులు ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. అయినా మార్పు రాకపోతోందా అన్న భావనతో తనవంతు ప్రయత్నాలు చేశారు జీవన్ రెడ్డి. అయితే పార్టీ పెద్దలు మాత్రం ఆయనకు ప్రయారిటీ ఇవ్వడాన్ని విస్మరిస్తున్నారని ఆయన వర్గంలో బలంగా నాటుకపోయింది. పార్టీ టికెట్లు ఇవ్వకున్నా స్వతంత్రులుగా తన వర్గాన్ని గెలిపించుకోవడంలో సఫలం అయిన జీవన్ రెడ్డి తన వారికి ఛైర్ పర్సన్ పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపునకు పయనించాల్సిందేనన్న ప్రతిపాదనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సొంత పార్టీ నేతలు చూపుతున్న వివక్ష, అనుచరుల ఒత్తిళ్ల మేరకు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడం పక్కా అని తేలిపోయింది.

మేడిపల్లి భేటీ…

సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం రంగంలోకి దిగారు. ఆదివారం జగిత్యాలకు వెళ్లిన ఆయన జీవన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు జగిత్యాలకు చేరుకున్న మేడిపల్లి సత్యం జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని కోరారు. పార్టీ నాయకత్వం తనను అవమానాల పాలు చేసిందని తాను పార్టీలో కొనసాగేది లేదని జీవన్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్టుగా సమాచారం.

‘‘పరాభవం’’…

ఈ నెల 19 నుండి తెలుగు నూతన సంవత్సంర ప్రారంభం కాబోతోంది. విశ్వావసు నుండి పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న క్రమంలో తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ మారేందుకు ముహూర్తం ఖారారు చేసుకున్నారు. ఇప్పటికే పలు మార్లు ఇతర పార్టీల నుండి పిలుపు వచ్చినప్పటికీ ఆచూతూచి వ్యవహరించిన జీవన్ రెడ్డి ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడేందుకే మొగ్గు చూపుతున్నారు. అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయం అయిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది.

మూడో పార్టీ…

1980లో మల్యాల సమితి అధ్యక్షునిగా గెలిచిన జీవన్ రెడ్డి 1983లో టీడీపీ అభ్యర్థిగా జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తొలిసారే మంత్రి పదవిని దక్కించుకున్న ఆయన టీడీపీ అధినేతతో విబేధించి 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం గమనార్హం.