గోదావరి తీరంలో గందరగోళం… లెంకలగడ్డలో భయానకం…

గోదావరి తీరంలో ప్రకృతి బీభత్సం…

వాటర్ స్పౌట్ కారణంగా నేలకొరిగిన వనసంపద

దిశ దశ, భూపాలపల్లి:

గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రకృతి ప్రకోపిస్తున్న తీరు స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ సారి గోదావరి నది ఒడ్డునే వాటర్ స్పౌట్ ఏర్పడడం స్థానికంగా భయాందోళనకు దారి తీసింది. గత సంవత్సరం సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు మూడు సార్లు ప్రకృతి విలయతాండవం చేయడం సంచలనంగా మారింది. అయితే గత సంవత్సరం సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో ములుగు జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో బీభత్సం చోటు చేసుకోగా తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో ప్రళయం సంభవించడం గమనార్హం. మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్య ఏర్పడిన వాటర్ స్పౌట్ ఉత్తర దిశ నుండి దక్షిణం వైపు ప్రయాణం చేసింది. దాదాపు 2 కిలో మీటర్ల విస్తీర్ణంలో ఏర్పడిన వాటర్ స్పౌట్ ఆకాశాన్ని తాకుతూ తన ప్రయాణాన్ని కొనసాగించిందని ప్రతక్ష్య సాక్షులు చెప్తున్నారు. అయితే లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో ఏర్పడిన వచ్చిన వాతావరణ మార్పుల ప్రభావం వల్ల కొంతమంది రైతులు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారని స్థానికులు చెప్తున్నారు. వ్యవసాయ అవసరాల కోసం మోటార్లను తరలిస్తున్న ఎద్దుల బండి కూడా వాటర్ స్పౌట్ ఉధృతికి కొట్టుకపోయింది. దీంతో ఎడ్ల బండిలో తీసుకెల్తున్న వ్యవసాయ పనిముట్లన్ని తునాతనకలు కాగా, రైతుకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయిన కొంతమంది రైతులు వాటర్ స్పౌట్ కారణంగా పలుమార్లు గాల్లోకి లేవగా గురత్వాకర్షణ శక్తి వల్ల తిరిగి నేలపై పడిపోయారు. ఇక్కడే ఉన్నట్టయితే ప్రాణాలు పోయేలా ఉందని గమనించిన రైతులు రాత్రి వరకూ ఇండ్లకు చేరుకుని భిక్కుభిక్కుమంటూ కాలం వెల్లదీశారు.

విరిగి పడ్డ చెట్లు…

లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో సంభవించిన వాటర్ స్పౌట్ ప్రభావంతో భారీ సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. 2 నుండి 3 కిలో మీటర్ల మేర అటవీ ప్రాంతం అంతా అతలాకుతలం అయి ఉంటుందని భావిస్తున్నారు. స్థానికులు సుమారు కిలో మీటరు దూరం వరకూ పరిశీలించగా ఆ ప్రాంతంలోని చెట్లన్ని పడిపోయి ఉన్నాయి. అటవీ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తే వాటర్ స్పౌట్ తీవ్రత ప్రభావం ఎంతమేర అన్నది తేలనుంది.

పంటలు కూడా…

లెంకలగడ్డ అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న వ్యవసాయ భూముల్లోని పంటలు కూడా నాశనం అయ్యాయి. మిర్చి, పత్తి వంటి పంటలన్ని ధ్వంసం కావడంతో రైతులు తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సైక్లోన్ ఎఫెక్టా..?

గత నెల రోజులుగా వాతావరణంలో వస్తున్న పెను మార్పులు, తుపానుల కారణంగానే గోదావరి నదిలో వాటర్ స్పౌట్ ఏర్పడి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు ఒకే సారి హెచ్చు తగ్గులు అవుతున్న కారణంగానే వాటర్ స్పౌట్ ఏర్పడి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. గత సంవత్సంర సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో మేడారం అటవీ ప్రాంతంలో వచ్చినట్టుగానే ఈ సారి లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో సంభవించడం గమనార్హం. మేడారం అటవీ ప్రాంతానికి లెంకలగడ్డకు సుమారు 50 కిలో మీటర్ల దూరం ఉంటుంది. అయితే గత సంవత్సరం మేడారం అటవీ ప్రాంతంలోనే మూడు నెలల వ్యవధిలో ప్రకృతి విలయం తాండవం సృష్టించగా తాజాగా ఈ స్థలానికి దిగువ ప్రాంతంలో వాటర్ స్పౌట్ ఏర్పడడం వెనక కారణం ఏమై ఉంటుందన్నదే అంతుచిక్కకుండా పోతోంది. అయితే వాటర్ స్పౌట్ నార్త్ నుండి సౌత్ వైపు ప్రయాణం చేసిందని స్థానికులు చెప్తుండడం కూడా కొత్తదనాన్ని సంతరించుకుందనే చెప్పకతప్పదు. నిలువ ఉన్న ప్రాంతంలోనే వాటర్ స్పౌట్స్ ఏర్పడుతాయి కానీ… అటవీ ప్రాంతం వైపు ప్రయాణించడం వెనక ఆంతర్యం ఏంటన్నది కూడా గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది.