Karimnagr: హైవేపై భారీ గుంత… కారణమేంటటా..? కేంద్ర మంత్రికీ తప్పని తిప్పలు…

దిశ దశ, బావుపేట:

కరీంనగర్, సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంత ప్రయాణీకులకు సవాల్ గా మారింది. ఓ వైపున గ్రానైట్ ఇండస్ట్రీ మరో వైపున ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీరు దిగువకు వెల్లే పరిస్థితి లేకపోవడం వల్లే ఈ దుస్థితి తయారైంది. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న వేములవాడకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు రాకపోకలు సాగించడమే కాకుండా ఈ ప్రధాన రహదారి సమీపంలో ఉన్న గ్రానైట్ క్వారీలు, పరిశ్రమలు కొలువై ఉన్న ప్రాంతం కావడం గమనార్హం. మరోవైపున రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు కామారెడ్డి ప్రాంతానికి కరీంనగర్ మీదుగా వెల్లే వారికి ఇదే ప్రధాన రహదారి కావడంతో ప్రయాణీకులకు అవస్థలు తప్పడం లేదు. నిత్యం భారీ వాహనాలతో పాటు సాధారణ ప్రయాణీకులు ప్రయాణించే కరీంనగర్, సిరిసిల్ల హైవే బావుపేట సమీపంలో భారీ సైజు గుంత ఏర్పడింది. ఈ గుంత కారణంగా నీరు కూడా పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో వాహనదారులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అంతేకాకుండా బావుపేట గ్రామస్థులు కూడా ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నిలిచిపోతున్న నీటిని మళ్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడంతో వాహన దారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. భారీ వాహనాల పరిస్థితి ఎలా ఉన్నా కార్లు, ఆటోల వంటి వాహనాలు నీటి గుంతలో ఇరుక్కపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో వాహనాలు ఈ గుంత కారణంగా రిపేర్లు అవుతున్నాయి కూడా. వర్షాకాలం కూడా రావడంతో బావుపేట స్టేజీ సమీపంలోని ఈ ప్రాంతమంతా కూడా జలమయం అయింది. సమీపంలోనే వే బ్రిడ్జిలు కూడా ఉండడంతో భారీ వాహనాలు తూకం వేయించుకునేందుకు రాకపోకలు సాగిస్తుండడంతో రోజు రోజుకు గుంత పెద్దదిగా అవుతోంది. వర్షం పడినప్పుడు అయితే చిన్నపాటి కుంటను తలపిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయ దర్శనానికి వెల్లే భక్తులు సుదూర ప్రాంతాల నుండి వస్తుంటారని, బావుపేట సమీపంలోని గుంత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం అవుతోంది.

కేంద్ర మంత్రికే…

బావుపేట సమీపంలోని నీటి గుంత కారణంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు కూడా తిప్పలు తప్పలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెల్తున్న సందర్భంగా కాన్వాయి నిలిపివేయాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో బండి సంజయ్ కుమార్ బావుపేట వద్ద నుండే జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఫోన్ చేసి రోడ్డును బాగు చేయించాలని కోరారు.

కలెక్టర్ పరిశీలన…

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఘటనా స్థలానికి చేరుకుని గుంతను పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులను కూడా పిలిపించుకుని రోడ్డును బాగు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు సమీక్షించారు. ఇందు కోసం రూ. 90 లక్షలు కెటాయించి యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

కారణం ఇదేనా..?

బావుపేట ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీటితో పాటు సమీపంలోని గ్రానైట్ ఇండస్ట్రీల నుండి వస్తున వృధా నీరు నేరుగా దిగువ ప్రాంతానికి వెల్లే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో బావుపేటకు దిగువన ఉన్న తూంకుంటకు ఈ నీరు నేరుగా చేరుకునే పరిస్థితి ఉండేది. అయితే హైవే నిర్మాణ సమయంలో ఈ నీటిని ఎలగందుల చెరువు మీదుగా లోయర్ మానేరు డ్యాంలోకి తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఈ పనులు కూడా పూర్తి కాకపోవడం, గతంలో తూకుంటకు నీరు వెల్లే దారులన్ని మూసుకపోవడంతో హైవేపై భారీగా నీరు నిలిచిపోతున్నదని స్థానికులు చెప్తున్నారు. తూంకుంట చెరువుకు వరద నీరు వెల్లకుండా నిలువరించే చర్యలు తీసుకున్న అధికారులు ఆ వరద నీటిని ఇతర ప్రాంతం మీదుగా మళ్లించేందుకు చేసిన ప్రతిపాదనలు కార్యరూపంలో పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి తయారైందన్న ఆందోళన స్థానికంగా వ్యక్తం అవుతోంది. సహజ సిద్దంగా వెల్లే వరద నీటిని దారి మళ్లించాలని తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. అక్కడ నీరు నిలవకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ శాశ్వత పరిష్కారం మాత్రం చూపవని, తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుందన్న విషయాన్ని అధికారులు గుర్తించాలని ఈ ప్రాంత వాసులు సూచిస్తున్నారు.