దిశ దశ, తెలంగాణ బ్యూరో:
వెల వెలబోయిన గోదారమ్మ జల కళను సంతరించుకుంది. ఈ సారి కాలం అనుకూలించేనా అన్న భయంతో కొట్టుమిట్టాడినప్పటికీ వరణుని కరుణతో సమృద్దిగా జలాలు ప్రాజెక్టుల్లోకి వచ్చి చేరుతుండగా మిగులు జలాలను దిగువకు వదిలేయాల్సిన పరిస్థితి తయారైంది. వారం క్రితం వరకు ఉన్న ఆందోళనకర పరిస్థితులకు పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానేరు డ్యాంలకు మాత్రం సమృద్దిగా జలాలు రాకపోవడం ఆందోళన కల్గిస్తోంది.
ఎస్సారెస్పీ నుండి…
బాల్కొండ సమీపంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. 80 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎస్సారెస్సీ వారం క్రితం వరకు నీరు లేక బోసిపోయినట్టుగా కనిపించింది. కానీ గత నాలుగైదు రోజులుగా వరద వస్తుండడంతో దిగువ ప్రాంతాలకు నీటిని వదులుతున్నారు ఇరిగేషన్ అధికారులు. ఎస్సారెస్పీకి ప్రస్తుతం 1.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లోగా వస్తుండగా, 2,28,867 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులు, కాకతీయ కెనాల్ ద్వారా 5 వేల క్యూసెక్కులు, 40 గేట్లను ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టు 27.55 టీఎంసీల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 14.33 టీఎంసీల నీరు నిలువ ఉంది. ఇన్ ఫ్లోగా 15040 క్యూసెక్కుల మేర నీరు వచ్చి చేరుతుండగా ఔట్ ఫ్లో 3140 క్యూసెక్కులుగా ఉంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానేరు డ్యాం 24 టీఎంసీల సామర్థ్యం కాగా ప్రస్తుతం ఇందులో 7 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 1280 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లోగా వస్తుండగా, మిడ్ మానేరు నిండినట్టయితే అక్కడి నుండి ఎల్ఎండీకి నీటిని తరలించే అవకాశాలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మాత్రం భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 20.175 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో 15.4788 టీఎంసీల నీరు నిలువ ఉంది. అయితే ఎగువ ప్రాంతం నుండి ఎల్లంపల్లికి 502186 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా ఇక్కడి నుండి 40 గేట్ల ద్వారా 544242 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సుందిళ్ల బ్యారేజీ నుండి ఎగువ ప్రాంత నుండి వస్తున్న నీటిని 74 గేట్ల ద్వారా దిగువకు యథావిధిగా వదిలేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి దిగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకునే సరికి గోదావరి, ప్రాణహిత నదులకు సంబంధించిన వరద నీరు తీవ్ర స్థాయిలో వస్తోంది. 9 లక్షల పై చిలుకు వరద నీరు ఎగువ ప్రాంతం నుండి వస్తుండగా అంతే మొత్తాన్ని దిగువకు వదిలేస్తున్నారు.

భద్రాచలం వద్ద…
భద్రాద్రి కొత్తగూడెం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. కాళేశ్వరంతో పటు ఇంద్రావతి, సమ్మక్క సారలక్క బ్యారేజీ, శబరి నదుల నుండి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో కొద్ది సేపటి క్రితం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం ఇక్కడ 43 ఫీట్ల మేర గోదావరి ప్రవహిస్తోందని, బుధవారం 8.15 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని అధికారులు ప్రకటించారు. భద్రాచలం వద్ద 9 లక్షలకు పైగా ఇన్ ఫ్లోగా ఉంది.

